ఆగండి.. క్షణం ఆలోచించండి..! | Suicide cases increasing In vijayawada District | Sakshi
Sakshi News home page

ఆగండి.. క్షణం ఆలోచించండి..!

Published Sun, Sep 9 2018 7:47 AM | Last Updated on Tue, Nov 6 2018 8:41 PM

Suicide cases increasing In vijayawada District - Sakshi

ఒక్క క్షణం ఆలోచించగలిగితే ఆత్మహత్య ఆలోచనలను దూరం చేయవచ్చు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కార మార్గం చూపదు. పైగా తమవారిని, తమను నమ్ముకున్న వారిని మరింత కష్టాల్లోకి నెడుతుంది. నేషనల్‌ క్రైం బ్యూరో సైతం నగర కమిషనరేట్‌ పరిధిలో ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు పేర్కొనడం గమనార్హం. సెప్టెంబరు 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం...

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రేమ విఫలం కావడం, కుటుంబ కలహాలు, విద్యలో రాణించకపోవడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం తదితర కారణాలతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం చూపక పోగా.. వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రతి ఏటా 3 వేల మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడుతుండగా మరో 8 వేల మందికిపైగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. 

పెరిగిన యువత ఆత్మహత్యలు 
ఆధునిక జీవన విధానంలో పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు కొరవడటం, వారి కోసం సరైన సమయాన్ని వెచ్చించలేకపోవడం, పిల్లలు ఏమి చేస్తున్నారో పట్టించుకునే సమయం లేకపోవడం వలన పిల్లలు మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో టీనేజ్,  18 నుంచి 29 సంవత్సరాల వయస్సు వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణాల తర్వాత రెండవ స్థానంలో ఆత్మహత్యలు ఉంటున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌కు బానిసలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు విజయవాడ, గుంటూరు నగరాల్లో నమోదవుతున్నాయి. 

సంకేతాలు తెలుసుకోవచ్చు 
ఆత్మహత్యకు పాల్పడాలనుకునే వారిని ముందుగా గుర్తించవచ్చంటున్నారు మానసిన నిపుణులు. డల్‌గా ఉండటం, ఇతరులతో కలవకపోవడం, ఏకాంతంగా ఉండటం, ఆకలి, నిద్ర లేకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం, హాస్టల్‌లో ఉండేవారు రూంలో ఒంటరిగా గడపడం, విషాదభరితమైన సీరియల్స్‌ చూడటం, జోక్స్‌ వచ్చినా స్పందించకపోవడం వంటి లక్షణాలు వుంటాయని చెపుతున్నారు. అలాంటి వారు తమ మనస్సులోని బాధను ఎదుటి వారితో చెప్పుకోవడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెపుతున్నారు. నాకు చనిపోవాలని ఉంది.. ఈ జీవితం ఎందుకు.. ఏమీ సాధించలేక పోతున్నానని సన్నిహితుల వద్ద పదేపదే అనడం. ఆల్కహాల్‌ ఎక్కువగా సేవించడం, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ చెట్టుకు ఢీకొట్టడం వంటివి చేస్తుంటారని చెపుతున్నారు. 

యువతలో పెరుగుతున్న సమస్యలు
గతంలో 40 సంవత్సరాల వయస్సు పైబడిన వారు ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడే వారు. కానీ నేడు ప్రేమ విఫలమవడం, చదువులో రాణించలేక పోవడం, ఒత్తిడి, నవ దంపతుల్లో సర్ధుబాటు సమస్యలు వంటి కారణాలతో యువత ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో ప్రతి ఆరు గంటలకు ఒక టీనేజ్‌ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో స్త్రీల కంటే పురుషులు రెండు రెట్లు  ఎక్కువగా ఉంటున్నారు.  
– డాక్టర్‌ టీఎస్‌ రావు, అధ్యక్షుడు, ఏపీ సైకాలజిస్ట్‌ అసోసియేషన్‌ 

ఆత్మహత్య ఆలోచన మానసిక సమస్యే
ఆత్మహత్య ఆలోచన కూడా మానసిక సమస్యే. అలాంటి వారికి జీవితం విలువను తెలియచేయాలి. చనిపోయేందుకు దారికాదు.. బతికేందుకు మార్గాలు చూపించగలగాలి. ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవలకు కౌన్సెలింగ్‌తో చక్కటి పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురవకుండా పాఠశాలలు, కళాశాలల్లో కౌన్సెలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఆత్మహత్య ఆలోచన చేసే వారిని స్నేహితులు, కుటుంబ సభ్యులు ముందుగా లక్షణాలను గుర్తించి వారికి తగిన కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.
– డాక్టర్‌ గర్రే శంకర్రావు, మానసిక విశ్లేషకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement