సుజాతకు ఫస్ట్.. మాణిక్యాలరావుకు 12
మంత్రులకు మళ్లీ గ్రేడింగ్‌లు ఇచ్చిన చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మంత్రుల పనితీరుకు సంబంధించి టీడీపీ అధిష్టానం ఇచ్చుకునే ర్యాంకుల్లో ఈసారి జిల్లాకు చెందిన స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సోమవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యలతో భేటీ అయ్యారు. టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు సమావేశమై మంత్రుల పనితీరుపై సమీక్షించారు.
సుదీర్ఘ సమీక్షల అనంతరం పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం, శాఖల పర్యవేక్షణ, మంత్రిగా జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించడం తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకులు ప్రకటించారు. ఇందులో జిల్లాకు చెందిన పీతల సుజాతకు మొదటి ర్యాంకు ఇచ్చినట్టు తెలిసింది. 6 నెలల క్రితం ఇంట్లో నోట్లకట్టలు దొరకి.. వివాదాల్లో కూరుకున్న ఆమెకు ఆ కేసులో పోలీసుల నుంచి క్లీన్‌చిట్ వచ్చినా పార్టీ అధిష్టానం వద్ద ఒకింత పట్టు తగ్గిందన్న ప్రచారం జరిగింది. తదనంతర పరిణామాల్లో జిల్లాలోని ఓ వర్గం తనను ఉద్దేశపూరకంగా చిన్నచూపు చూస్తోందని ఆమె మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆమెకు మొదటి ర్యాంకు రావడంతో పార్టీ అధినేత వద్ద మంచి పలుకుబడి సాధించనట్టయ్యిందన్న వాదనలు మొదలయ్యాయి.
జిల్లాకే చెందిన పైడికొండల మాణిక్యాలరావుకు 12వ ర్యాంకు ఇచ్చినట్టు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీకే చెందిన కృష్ణాజిల్లా మంత్రి కామినేని శ్రీనివాస్‌కు నాలుగో ర్యాంకు రాగా, పైడికొండల 12వ ర్యాంకుకు దిగిపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది. టీడీపీ నేతలను కాదని.. నిట్ సాధించిన నేతగా ఆయనకు గుర్తింపు లభించినా చంద్రబాబు ఇచ్చిన గ్రేడుల్లో వెనుకబడటం గమనార్హం. కాగా, ప్రభుత్వ పనితీరుపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రులకు చంద్రబాబు ఇచ్చే గ్రేడింగ్‌లు ఏమేరకు ఫలితమిస్తాయి, 6 నెలలకోసారి ఇచ్చే ర్యాంకులు ఎవరికి ఉపకరిస్తాయన్న వాదన రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.