సాక్షి, అనంతపురం సిటీ: స్వయానా జిల్లా మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న శాఖ అది. తరచూ పర్యవేక్షణ ఉంటుందన్న భయంతో ఉద్యోగులు పని చేయాల్సి ఉంది. కానీ అనంతపురం జిల్లాలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. చివరికి బరి తెగించి అభం శుభం తెలియని అమాయక చిన్నారులను అమ్మకానికి పెట్టారంటే తెలుగుదేశం పాలనలో అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
అమ్మకానికి శిశువులు
అసలే వారు అనాథ చిన్నారులు, చెత్తకుప్పల్లోనూ. ముళ్ల పొదల్లోనూ దొరికిన వారు. అలాంటి వారిని తీసుకువచ్చి స్త్రీ, శిశు సంక్షేమశాఖకు చెందిన శిశు గృహలో ఉంచి కంటికి రెప్పలా కాపాడాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా శిశువులను అమ్మకానికి పెడుతున్నారు. ఓ విదేశీయురాలు ఇందుకు సంబంధించి నేరుగా కేంద్ర మంత్రి మేనకాగాంధీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కెనడాకు చెందిన ఓ మహిళ శిశు గృహంలోని ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. ఆ సమయంలో అక్కడి సిబ్బంది ఖర్చులకని చెప్పి ఆమెతో రూ.లక్ష తీసుకున్నట్లు తెలిసింది. దత్తత సమయంలో కోర్టు ఇచ్చే అనుమతి పత్రంలో చిన్నారి పేరు తప్పు పడింది. దీంతో ఆ చిన్నారికి పాస్‌పోర్ట్ రావడం ఆలస్యమైంది. దీంతో మరోసారి జిల్లాలోని శిశుగృహ సిబ్బందిని సంప్రదించింది. దీన్ని వరంగా మార్చుకున్న సిబ్బంది ఆ విదేశీ మహిళను మరోసారి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రికి ఫిర్యాదు
భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడంతో ఆ విదేశీయురాలు దిక్కుతోచని స్థితిలో నేరుగా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖా మంత్రి మేనకాగాంధీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే విచారణ జరిపి సదరు సిబ్బందిని టర్మినేట్ చేయాలని స్త్రీ శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఆయన శిశు గృహ అధికారి సుబ్రమణ్యంను శుక్రవారం ఆఘమేఘాల మీద గుంటూరుకు పిలిపించారు. అక్కడ ఇలాంటి సిబ్బందిని ఎలా పెట్టుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కమిషనర్, కలెక్టర్ విషయాన్ని సమీక్షించి శిశుగృహ కోఆర్డినేటర్‌ను టర్మినేట్ చేయాలని ఫైలు తయారు చేయాలని పీడీ చిన్మయాదేవిని ఆదేశించారు. టర్మినేటర్ ఆర్డర్‌ను తయారు చేసి శుక్రవారం రాత్రి కలెక్టర్‌కు పంపించారు.
గతంలోనూ ఇలాగే...
3 సంవత్సరాల క్రితం మడకశిరకు చెందిన ఓ చిన్నారిని ఇదే సిబ్బంది రూ.40 వేలకు ఉరవకొండకు చెందిన వారికి అమ్మేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి బయటకు పొక్కింది. దీంతో విచారణ జరిపిన అప్పటి సీడీపీఓ విజయశ్రీ సంఘటన జరిగిన మాట వాస్తవమేనని, చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చింది. అయితే అప్పుడు కూడా తమకున్న రాజకీయ పలుకుబడితో ఈ విషయాన్ని తొక్కిపెట్టినట్లు సమాచారం.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు
శిశు గృహలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ వీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోందని ఆ శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఎవరైనా వీరు చేసే అక్రమాల గురించి ప్రశ్నిస్తే వారిని తమకున్న రాజకీయ పలుకుబడితో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అందుకే ఎవరూ నోరు విప్పరని సిబ్బంది చెబుతున్నారు. తెలుగుదేశం పాలనలో స్వయంగా మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment