ఫుల్లుగా వసూలు
మద్యం వ్యాపారులు మందుబాబులను నిలువునా దోచుకుంటున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తూ వారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. కాయకష్టం చేసే నిరుపేదల బతుకులను పీల్చి పిప్పి చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన ఎక్సయిజ్ అధికారులు ‘మామూలు’గా వదిలేస్తున్నారు.
సాక్షి, గుంటూరు : జిల్లాలోని మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. పలు ప్రాంతాల్లో అయితే ఎమ్మార్పీ కంటే ఒక్కో సీసాకు రూ. 20 నుంచి రూ. 40 వరకూ అధికంగా వసూలు చేస్తుండగా, గుంటూరు నగరంలో ఒక్కో క్వార్టర్ బాటిల్‌పైనా రూ. 5 నుంచి రూ. 10 అధికంగా వేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు.
రెండేళ్ల క్రితం మద్యం దుకాణాల ద్వారా వచ్చిన ఆదాయంలో నాలుగో వంతు కూడా ఈ సారి ప్రభుత్వానికి రాని విషయం అందరికీ తెలిసిందే.
అప్పట్లో అధిక ధరలకు మద్యం దుకాణాలకు టెండర్లు వేయడం వల్లే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపారని భావించిన ప్రభుత్వం మండల, మున్సిపల్, కార్పొరేషన్‌ల పరిధుల్లో ఉన్న మద్యం దుకాణాలకు తక్కువ మొత్తంలో లెసైన్స్ ఫీజులను నిర్ణయించి లాటరీ పద్ధతిన దుకాణాలను కేటాయించింది.
దీని కోసం కొన్ని నిబంధనలు సైతం పెట్టింది. బెల్టు షాపులు ఉండకూడదని, ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని, సమయపాలన పాటించాలని నిర్దేశించింది.
ఆ విధంగా తక్కువ లెసైన్స్ ఫీజులకే మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు సిండికేట్లుగా మారి గతంలో మాదిరిగానే అధిక ధరలకే మద్యం విక్రయిస్తున్నారు.
కాసులు కురిపిస్తున్న మందుబాబుల బలహీనత
ఎమ్మార్పీ కంటే అధికంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెగ ప్రచారం చేసిన ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
అదేమని ప్రజలు ప్రశ్నిస్తే కౌంటర్‌లో ఉన్న మంచి బ్రాండ్ మద్యం సీసాలను పక్కకు తప్పించి ఎవరికీ తెలియని బ్రాండ్లను పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు.
కాస్త మంచిబ్రాండ్లకు అలవాటు పడిన మందుబాబులు చేసేది లేక ఎక్కువ డబ్బు చెల్లించి నోరుమూసుకుంటున్నారు.
నిబంధనలకు వ్యతిరేకంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా విక్రయాలు జరుపుతూ రూ. లక్షలు ఆర్జిస్తున్నారు.
చేష్టలుడిగి చూస్తున్న అధికారులు
ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేసే మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు, రాత్రి 10 గంటల తరువాత మద్యం దుకాణాలను మూయించాల్సిన పోలీస్ అధికారులు ‘మామూలు‘గా వదిలేస్తున్నారు.
రాత్రి 9 గంటలు అయిందంటే రోడ్లపై ఉన్న తోపుడు బండ్లు, చిన్న చిన్న బడ్డీ దుకాణాలను సైతం మూసివేయించే పోలీసులు మద్యం దుకాణాలను మాత్రం తెల్లవారుజాము వరకు అనుమతిస్తుండటం గమనార్హం.
అధిక ధరలకు విక్రయిస్తే సహించం:
ఎక్సయిజ్ డీసీ కుళ్లాయప్ప
ఎమ్మార్పీ కంటే అధిక మొత్తాలకు మద్యం విక్రయిస్తే సహించ బోమని ఎక్సయిజ్ డీసీ కుళ్లాయప్ప తెలిపారు. జిల్లాలో జరుగుతున్న సిండికేట్ల వ్యవహారాన్ని ‘సాక్షి’ ప్రస్తావించగా ఆయన పై విధంగా స్పందించారు.
జిల్లాలో వీటిని అరికట్టేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామనీ, మద్యం లెసైన్స్‌లు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో ఎమ్మార్పీ అతిక్రమణకు పాల్పడుతున్న 25 షాపులను సస్పెండ్ చేశామని తెలిపారు. ఒక్క అక్టోబర్ నెలలోనే ఎనిమిది దుకాణాలు మూయించినట్ట చెప్పారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను పంపి చర్యలు తీసుకుంటామని వివరించారు.