సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చేతివృత్తి కళాకారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. వారు తయారు చేసిన వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించడం ద్వారా వాటికి డిమాండ్ లభించేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమాయత్తమైంది.
ఆప్కో తరహాలో: ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ(ఆప్కో) గత డిసెంబర్‌లో అమెజాన్‌తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సొసైటీ ఆధ్వర్యంలో తయారవుతున్న 104 రకాల చేనేత ఉత్పత్తుల్ని ఆన్‌లైన్ ద్వారా అమెజాన్ విక్రయిస్తోంది. అప్పట్నుంచీ ఆన్‌లైన్ ద్వారా ఆప్కో విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీన్ని పరిశీలించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇదే తరహాలో చేతివృత్తి కళాకారులు రూపొందించిన వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తే వారికి మేలు జరుగుతుందని భావించింది.
ప్రస్తుతం తాము తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకునే సామర్థ్యం లేక, ఆశించిన ధర లభించక చేతివృత్తి కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని, దీంతో ఈ వృత్తిని మానేసి ఇతర రంగాలకు తరలిపోతున్నారని గుర్తించింది. ఈ వృత్తి అంతరించిపోకుండా ఉండడానికి వారు రూపొందించిన వస్తువులకు గ్లోబల్ స్థాయిలో విక్రయాలు జరిగేలా చూడడమొక్కటే మార్గమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వృత్తి కళాకారులకు మెరుగైన శిక్షణనిస్తూ, వారి వస్తువులను ఆన్‌లైన్ మార్కెట్ ద్వారా విక్రయించడానికిగాను ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు చేపట్టింది. ఆ సంస్థ ప్రతినిధులకు చేతివృత్తి కళాకారులు తయారు చేస్తున్న వస్తువుల నాణ్యత, ప్రత్యేకతలను కార్పొరేషన్ అధికారులు వివరించగా.. ఒప్పందానికి ఫ్లిప్‌కార్ట్ ముందుకొచ్చింది.
సేవలందించనున్న ఫ్లిప్‌కార్ట్..
తొలిదశలో చేతివృత్తి కళాకారులు తయారు చేస్తున్న 19 రకాల వస్తువులను ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. వీటిని ఫ్లిప్‌కార్ట్ క్యాటలాగ్‌కు జత చేస్తారు. కొనుగోలుదారుల నుంచి వచ్చిన ఆర్డర్లకనుగుణంగా చేతివృత్తి కళాకారులు ఫ్లిప్‌కార్ట్‌కు వీటిని సరఫరా చేస్తారు. ఫ్లిప్‌కార్ట్, చేతివృత్తి కళాకారులకు మధ్య స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. చేతివృత్తి కళాకారుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్కువ కమీషన్‌కే సేవలందించేందుకు ఫ్లిప్‌కార్ట్ ముందుకొచ్చిందని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఎ.శ్రీకాంత్ తెలిపారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, కలంకారీ, వుడ్ కార్వింగ్, లెదర్ పప్పెట్స్ వంటి మరికొన్ని వస్తువులను తొలిదశలో ఫ్లిప్‌కార్ట్ క్యాటలాగ్‌కు జత చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment