Craftsmanship
-
చేతివృత్తి కళాకారులకు చేయూత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చేతివృత్తి కళాకారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. వారు తయారు చేసిన వస్తువులను ఆన్లైన్లో విక్రయించడం ద్వారా వాటికి డిమాండ్ లభించేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమాయత్తమైంది. ఆప్కో తరహాలో: ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ(ఆప్కో) గత డిసెంబర్లో అమెజాన్‌తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సొసైటీ ఆధ్వర్యంలో తయారవుతున్న 104 రకాల చేనేత ఉత్పత్తుల్ని ఆన్లైన్ ద్వారా అమెజాన్ విక్రయిస్తోంది. అప్పట్నుంచీ ఆన్లైన్ ద్వారా ఆప్కో విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీన్ని పరిశీలించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇదే తరహాలో చేతివృత్తి కళాకారులు రూపొందించిన వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తే వారికి మేలు జరుగుతుందని భావించింది. ప్రస్తుతం తాము తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకునే సామర్థ్యం లేక, ఆశించిన ధర లభించక చేతివృత్తి కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని, దీంతో ఈ వృత్తిని మానేసి ఇతర రంగాలకు తరలిపోతున్నారని గుర్తించింది. ఈ వృత్తి అంతరించిపోకుండా ఉండడానికి వారు రూపొందించిన వస్తువులకు గ్లోబల్ స్థాయిలో విక్రయాలు జరిగేలా చూడడమొక్కటే మార్గమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వృత్తి కళాకారులకు మెరుగైన శిక్షణనిస్తూ, వారి వస్తువులను ఆన్లైన్ మార్కెట్ ద్వారా విక్రయించడానికిగాను ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు చేపట్టింది. ఆ సంస్థ ప్రతినిధులకు చేతివృత్తి కళాకారులు తయారు చేస్తున్న వస్తువుల నాణ్యత, ప్రత్యేకతలను కార్పొరేషన్ అధికారులు వివరించగా.. ఒప్పందానికి ఫ్లిప్‌కార్ట్ ముందుకొచ్చింది. సేవలందించనున్న ఫ్లిప్‌కార్ట్.. తొలిదశలో చేతివృత్తి కళాకారులు తయారు చేస్తున్న 19 రకాల వస్తువులను ఫ్లిప్‌కార్ట్ ఆన్లైన్లో విక్రయించనుంది. వీటిని ఫ్లిప్‌కార్ట్ క్యాటలాగ్‌కు జత చేస్తారు. కొనుగోలుదారుల నుంచి వచ్చిన ఆర్డర్లకనుగుణంగా చేతివృత్తి కళాకారులు ఫ్లిప్‌కార్ట్‌కు వీటిని సరఫరా చేస్తారు. ఫ్లిప్‌కార్ట్, చేతివృత్తి కళాకారులకు మధ్య స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. చేతివృత్తి కళాకారుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్కువ కమీషన్‌కే సేవలందించేందుకు ఫ్లిప్‌కార్ట్ ముందుకొచ్చిందని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఎ.శ్రీకాంత్ తెలిపారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, కలంకారీ, వుడ్ కార్వింగ్, లెదర్ పప్పెట్స్ వంటి మరికొన్ని వస్తువులను తొలిదశలో ఫ్లిప్‌కార్ట్ క్యాటలాగ్‌కు జత చేస్తామని చెప్పారు. -
నాతోపాటు నా ‘పద్మశ్రీ’నీ సమాధి చేయండి
అది నా జీవితాన్ని నాశనం చేసింది ఓ నేత కార్మికుడి చివరి కోరిక లక్నో: ‘‘ఆయన హస్తకళ.. ప్రాచీన సంప్రదాయకంగా సాంస్కృతికంగా సుసంపన్నమైనది’’ అని నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి ప్రశంసలందుకున్న తివాచీ నేత కార్మికుడతడు. ఆ ప్రశంసలతో పాటు.. 1981లో దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డునూ అందుకున్నాడు. అప్పుడతడి ఖ్యాతి దేశమంతా మార్మోగింది. ఆయన నివసించే ప్రాంతంలో ఎంతో ప్రముఖుడైపోయాడు. ఆ అవార్డు రాకముందు వరకూ నేత పనితో అతడి కుటుంబం జీవిస్తుండేది. పద్మశ్రీ పురస్కారంతో తమ జీవితం మారిపోతుందని ఆశించింది. నిజంగానే మారిపోయింది. ఎంతగా మారిపోయిందంటే.. ఇక అతడు పని చేయటానికే అవకాశం దక్కలేదు. ఎవ్వరూ పని ఇవ్వలేదు. ఒకే ఒక్క జీవనాధారం కూడా కోల్పోయి.. దుర్భర దారిద్య్రంలోకి ఆ కుటుంబం దిగజారిపోయింది. ఆ పద్మశ్రీ గ్రహీత పేరు సీతారాంపాల్. ఇప్పుడతడి వయసు 72 సంవత్సరాలు. కంటిచూపు లేదు. పాతికేళ్ల కిందటే పోయింది. డాక్టర్‌కు ఫీజు కట్టలేకపోవటమే కారణం. ఏళ్ల తరబడి సరైన తిండి లేదు. సన్నగా బక్కచిక్కిపోయాడు. మంచం మీద జీవచ్ఛవంలా పడున్నాడు. చావు కోసం నిరీక్షిస్తున్నాడు. అతడిది ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా షేర్పూర్ కలాన్ గ్రామం. ‘‘నేను మా ప్రాంతంలో అకస్మాత్తుగా చాలా కీర్తివంతుడినయ్యాను. కానీ.. తివాచీ తయారుదారులు నాకు పని ఇవ్వటం మానేశారు. నన్ను రోజు కూలీగా పెట్టుకుంటే.. ప్రభుత్వానికి కోపం వస్తుందని వారు భయపడ్డారు. పద్మశ్రీ అవార్డుతో నా దుర్దినాలు మొదలయ్యాయి. చేతిలో సొమ్ములు లేక, వైద్యం చేయించుకోలేకపోవటంతో 1986లోనే నా కంటిచూపు పోయింది. నా పరిస్థితిని వివరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నోసార్లు లేఖలు రాశాను. ఫలితంగా నెలకు 300 రూపాయల వృద్ధాప్య పింఛను మంజూరు చేశారు. ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు చేశారు. కానీ.. అవేవీ నా దుస్థితిని మార్చలేకపోయాయి. డాక్టర్‌కు ఫీజులు కట్టేందుకు పైసలు లేకపోవటంతో నా కొడుకు కూడా కంటి చూపు కోల్పోయాడు’’ అని మంచం మీద నుంచి బలహీనమైన గొంతుతో నిర్వేదంగా వివరించాడు సీతారాంపాల్. ‘‘ప్రభుత్వం మా తండ్రికి పద్మశ్రీ అవార్డు ఇవ్వకముందు మా జీవితం సాఫీగానే సాగిపోయేది. కానీ అవార్డు అందుకున్నప్పటి నుంచీ మా తండ్రికి ఉపాధి లేదు. ఆయనకు తెలిసిన కళను మేం నేర్చుకోలేకపోయాం. ఎందుకంటే.. అది నేర్చుకుని జీవనోపాధి సంపాదించగలమన్న ఆశ ఏకోశానా లేకుండా పోయింది. మా ఇంట్లో కరెంటు లేదు.. దీంతో నాకు శుక్లాలు వచ్చాయి. చివరికి కంటిచూపు పోయింది’’ అని సీతారాం కుమారుడు శ్రావణ్పాల్ వివరిం చారు. ఎన్నిసార్లు వేడుకున్నా ప్రభుత్వాలు ఆదుకోలేదని సీతారాం పాల్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ప్రభుత్వాలకు గత ముప్పై ఏళ్లలో కనీసం 20 సార్లు నేను లేఖలు రాశాను. సాయం అర్థిస్తూ చాలామంది రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులను కలిశాను. కానీ నా కష్టాలు వారు అర్థంచేసుకోలేదు. నేనెలా ఉన్నానని అడగటానికి ఏ ఒక్కరూ రాలేదు’’ అని ఆయన చెప్పారు. అయితే తన చివరి కోరిక ఒకటి చెప్పారు. అదేమిటంటే... ‘‘ఇప్పుడు నేను మరణశయ్యపై ఉన్నాను. నా చివరి కోరిక ఒక్కటే.. నాతో పాటు నా పద్మశ్రీ పతకాన్ని కూడా సమాధి చేయండి.’’