జర్నలిస్టులకు అండగా ఉంటా’
అనంతపురం : సమాజభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ఎప్పుడూ అండగా ఉంటానని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌ను ఆయన కార్యాలయంలో పాత్రికేయులు కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా కొడిమిలోని జర్నలిస్టుల కాలనీలో పక్కాఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఇందుకు ఆర్డీటీ సహకారం కోరతానని హామీ ఇచ్చారు.
అలాగే మీడియా ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ మంజూరు చేస్తామన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలులో భాగంగా పర్యవేక్షించేందుకు సూపరింటెండెంట్‌స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ను ఏపీయూడబ్యూజే, ఫొటోగ్రాఫర్ల సంఘం, చిన్నపత్రికల సంపాదకుల సంఘం, సబ్‌ఎడిటర్ల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. తన ఏడాది పాలనకు జర్నలిస్టుల సహకారం కూడా మరువలేనిదని కలెక్టర్ అన్నారు.