జర్నలిస్టులపై దాడులు సహించం
► దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలి
► గాంధీ విగ్రహానికి పాలాభిషేకం, వినతిపత్రం
కర్నూలు(న్యూసిటీ): జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్‌మోహన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిచోటా జర్నలిస్టులపై మంత్రులు, ఎమ్మెల్యేల చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దా డులు చేయిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలు రాసిన ‘సాక్షి’ జర్నలిస్టులపై విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అనుచరులు దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. దాడులకు పాల్పడినవారిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.
డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. సీనియర్ పాత్రికేయులు మైకేల్ బాబు మాట్లాడుతూ.. జర్నలిస్టు సంఘాలను విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టులు సుబ్రహ్మణ్యం, జె. కుమార్, ఫొటో జర్నలిస్టు యూని యన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసగౌడ్, ఫొటో జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు హుసేన్, జిల్లా సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్, సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇస్మాయిల్, ఎల్లాగౌడు, జం బన్న, వీడియో జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షులు చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆలూరులో జర్నలిస్టులు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆత్మకూరు, నంద్యాల, కోవెలకుంట్లలో రాస్తారోకో.. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, బనగానపల్లె, మంత్రాలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.