సాక్షి, న్యూఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక వసతులు సిద్ధమైతే ఏపీ, తెలంగాణ హైకోర్టుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ జారీ అనంతరం ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా విధులు నిర్వహించడం ప్రారంభమవుతుంది. ఏపీ హైకోర్టు కొత్త భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి తాత్కాలిక భవనాలు సిద్ధమవుతాయని ఏపీ ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. పరిశీలన కమిటీ ఇచ్చిన నివేదికపై ఏపీకి వెళ్లే హైకోర్టు న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారని ఏపీ తెలిపింది.
అమరావతిలో జస్టిస్ సిటీ పేరుతో పెద్ద కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని, అందులోనే హైకోర్టు, సబార్డినేట్ కోర్టు జడ్జీల వసతి సదుపాయాలు, నివాస గృహాలు ఏర్పాటు చేస్తారని సుప్రీంకు ఏపీ నివేదించింది. అప్పటివరకూ తాత్కాలిక భవనాల్లో హైకోర్టు కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు ఏపీలో హైకోర్టు కార్యకలాపాలకు అవసరమైనవన్నీ సిద్ధమైతే నోటిఫికేషన్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment