రేషన్‌కూ ఆ‘ధారే’
Published Wed, Jan 8 2014 2:45 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
సాక్షి, ఏలూరు:సబ్సిడీలకు ఆధార్ కార్డుతో లింకు పెట్టొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలి చ్చినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. నిన్నటివరకూ సబ్సిడీపై సరఫరా చేసే గ్యాస్ సిలిండర్లకు ఆధార్ కార్డుతో లింకు పెట్టిన ప్రభుత్వం తాజాగా రేషన్ బియ్యం తీసుకోవాలన్నా ఆధార్ నంబర్‌ను రేషన్ కార్డుతో అనుసంధానం చేయించుకుని తీరాలనే నిబంధన విధించింది. లేదంటే తెల్ల రేషన్ కార్డుపై ఇచ్చే బియ్యం కోటాలో కోత విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేషన్ కార్డులో నమోదై ఉండే కుటుంబ సభ్యులంతా ఆధార్ కార్డు కాపీలు సమర్పించాలని ఆదేశాలి చ్చారు. ఏదైనా కుటుంబంలో ఏ ఒక్కరి ఆధార్ నంబర్ ఇవ్వకపోరుునా వచ్చేనెల కోటాలో సంబంధిత వ్యక్తికి బియ్యం ఇవ్వరు. నిజానికి ఈ విధానాన్ని జనవరి నుంచే అమలు చేయూలని భావించినప్పటికీ సంక్రాంతి రోజులు కావడంతో వినియోగదారుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో వెనక్కు తగ్గారు. ఈ దృష్ట్యా జనవరినెలాఖరు వరకూ ఆధార్ సమర్పించేందుకు గడువు ఇచ్చారు. ఆలోగా స్థానిక చౌక దుకాణంలో ఆధార్ కార్డు నకలు అందించాలని సూచిస్తున్నారు. వచ్చే నెలలో రేషన్ బియ్యూనికి మాత్రమే పరిమితం చేసిన ఆధార్ అనుసంధానాన్ని ఆ తరువాత నుంచి అన్ని సరుకులకు అమలు చేస్తారు.
పండగ కోటా లేనట్టే
సంక్రాంతి పండగకు ఈసారి కూడా అదనపు కోటా ఇవ్వడం లేదు. పెద్ద పండగగా పిలిచే సంక్రాంతికి సాధారణ కోటా సరిపోదు. ఈ పరిస్థితుల్లో పేదలకు అదనపు కోటాగా నిత్యావసర సరుకులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది అదనపు కోటాపై ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రెండేళ్ల క్రితం వరకూ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండగకు రేషన్ కోటాలో కొన్ని సరుకులు అధికంగా ఇచ్చేది. పంచదార అరకేజీ ఇవ్వాల్సి ఉండగా, మరో అరకేజీ అదనంగా ఇచ్చేవారు. అదేవిధంగా పామాయిల్ కేజీ ప్యాకెట్ ఇవ్వాల్సి ఉండగా మరో కేజీ అదనంగా ఇచ్చేవారు. గతేడాది ఈ ఆనవాయితీని తప్పించారు. ఈ ఏడాదైనా ఇస్తారనుకుంటే మళ్లీ నిరాశే మిగింది.
అసలు కోటా అయినా ఎప్పుడిస్తారో
జిల్లాకు 11 లక్షల 38 వేల లీటర్ల పామాయిల్ అవసరం కాగా, అందుకోసం 22వేల 88 మంది డీలర్లు ప్రతినెలా డీడీలు తీస్తున్నారు. గత డిసెంబర్‌లోనూ డీడీలు తీశారు. కానీ ప్రభుత్వం పామాయిల్ కంపెనీలకు సబ్సిడీ మొత్తం చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా రేషన్ కార్డులపై పామాయిల్ పంపిణీని నిలిపివేశారు. దానికోసం సొమ్ముకట్టిన డీలర్లు వడ్డీ నష్టపోయారు. సబ్సిడీపై లీటర్ పామాయిల్ రూ.40కి రేషన్ డిపోల ద్వారా ఇస్తుండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.65 పలుకుతోంది. గత నెల దీనిని పంపిణీ చేయకపోవడంతో11.22లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు రూ.2.80 కోట్ల మేర నష్టపోయారు. సంక్రాంతి దృష్ట్యా ఈనెలలో సాధారణ కోటా కింద కార్డుకు కిలో చొప్పున పామాయిల్ ఇవ్వనున్నట్టు అధికారులు ప్రకటించారు. పండగ రోజులు దగ్గర పడుతున్నా నేటికీ రేషన్ డిపోలకు ఆ ప్యాకెట్లు చేరుకోలేదు.
‘అమ్మహస్తం’ సరుకులు సిద్ధం:
జనవరి కోటా ‘అమ్మహస్తం’ సరుకులు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పంచదార 560 టన్నులు, గోధుమలు, గోధుమపిండి 350 టన్నులు, చింతపండు 90 నుంచి 120 టన్నులు, పసుపు 20 టన్నులు. కందిపప్పు 600 టన్నులు సిద్ధంగా ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 10 నుంచి వీటిని రేషన్ షాపులకు సరఫరా చేయనున్నారు. 1,776కిలో లీటర్ల కిరోసిన్‌ను ఈ నెలలో పంపిణీ చేయనున్నారు. ఇటీవల కూపన్లు పొందిన వారికి కిరోసిన్ మినహా మిగతా సరుకులు అందించనున్నారు. 15 వేల టన్నుల బియ్యం విడుదలకాగా, ఇప్పటికే పంపిణీ ప్రారంభించారు.
Advertisement
Advertisement