టీ-నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వలేం | supreme court rejected stay of telangana notification | Sakshi
Sakshi News home page

టీ-నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వలేం

Published Tue, May 6 2014 1:48 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

టీ-నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వలేం - Sakshi

టీ-నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వలేం

అందరి వాదనలూ వినాలి: సుప్రీంకోర్టు
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌పై స్టే విధించటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదన వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సోమవారం స్పష్టంచేసింది. ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, ఇతరులు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసేందుకు ఆరు వారాల గడువు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందని, విభజన బిల్లును (ప్రస్తుతం చట్టం) కొట్టివేయాలని, విభజనను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది.
 
 రాష్ట్ర విభజన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, విభజనను నిలిపివేయాలని కోరుతూ తొలుత ఫిబ్రవరి 19న వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్, రఘురామకృష్ణంరాజు తదితరులతో పాటు తరువాతి రోజుల్లో ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, సి.ఎం.రమేశ్, రాయపాటి సాంబశివరావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులంతా విడివిడిగా దాదాపు 25 పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లను తొలుత మార్చి 7న విచారించిన సుప్రీంకోర్టు.. విభజనపై అప్పుడు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ.. కేంద్ర హోంశాఖ సహా ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు ఆ రోజు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసిన విషయమూ విదితమే. తాజాగా సోమవారం జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎం.వై.ఇక్బాల్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
 
 న్యాయవాదుల వాదనలు: ధర్మాసనం ఎదుట వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణన్, మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాది రాజీవ్‌దావన్‌లతో పాటు ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు ఒక్కొక్కరుగా తమ వాదనలు వినిపించారు. తొలుత దావన్ తన వాదనలు వినిపిస్తూ.. ‘తమరు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించినా కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విభజన రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. ఈ కేసును త్వరితగతిన విచారించి రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచుతూ ఆదేశాలు ఇవ్వండి..’ అని నివేదించారు. జస్టిస్ దత్తు జోక్యం చేసుకుని.. ‘ప్రతివాదుల వాదనలు విందాం. ఒకవేళ రాజ్యాంగ ధర్మాసనం వినాల్సిన అవసరం ఉంటే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి విన్నవిస్తాం. లేదంటే మేం ముగ్గురం విచారిస్తాం...’ అని పేర్కొన్నారు. ఆ వెంటనే ైవె ఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తరపు న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణన్ తన వాదనలు వినిపిస్తూ ‘అపాయింటెడ్ డే జూన్ 2నే ఉంది. అందువల్ల అంతకుముందే మీరు ఈ కేసును విచారిం చండి. లేదంటే అపాయింటెడ్ డేపై స్టే ఇవ్వండి.. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం ఈ బిల్లును తెచ్చింది. అనేక రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా కేంద్రం పట్టించుకోలేదు..’ అని తన వాదనలు వినిపించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ అన్ని అంశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. కేంద్రం త్వరితగతిన సమాధానం ఇచ్చేందుకు ఆదేశిస్తామన్నారు. ఇంతలో దావన్ కల్పించుకుని ‘నిర్దిష్ట గడువు పెట్టండి..’ అని కోరారు. దీంతో న్యాయమూర్తి కేసును ఆగస్టు 20కి వాయిదా వేస్తున్నామని, స్టే ఇవ్వలేమని, కేంద్ర హోంశాఖ, తదితర ప్రతివాదులంతా 6 వారాల్లో తమ సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు.
 
 మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం: చివరగా ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఒకింత ఆవేశంతో తన వాదనలు వినిపిస్తూ ‘లోక్‌సభలో సభ్యులను సస్పెండ్ చేసి, ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి బిల్లును పాస్ చేశారు. రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ ఈ బిల్లుకు రాజ్యాంగ సవరణలు అవసరం ఉందని గుర్తు చేయగా.. కే ంద్ర న్యాయమంత్రి కపిల్‌సిబల్ ఆ విషయాలు కోర్టులు చూస్తాయని చెప్పారు. అందువల్ల తక్షణం స్టే ఇవ్వండి’ అని అభ్యర్థిచారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ ‘ఇలాంటి కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం’ అని పేర్కొన్నారు. ఉండవల్లితో పాటు ఇతర పిటిషనర్లకు చెందిన మరో ఇద్దరు ముగ్గురు న్యాయవాదులు కూడా వాదించబోవడంతో జస్టిస్ దత్తు కల్పించుకుని ‘ఇదేమీ చేపల మార్కెట్టు కాదు.. ’ అని ఆగ్రహం వ్యక్తంచేయడంతో అందరూ మౌనం దాల్చారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement