సూపర్‌వైజర్లకు కల‘వరం’ | supreme court stay removed on Child welfare department supervisor candidates | Sakshi
Sakshi News home page

సూపర్‌వైజర్లకు కల‘వరం’

Published Sat, Jan 4 2014 1:40 AM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

supreme court stay removed on Child welfare department supervisor candidates

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రెండు నెలలుగా నిరీక్షిస్తున్న శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్ అభ్యర్థుల్లో కొత్త ఆశలు, మరో వైపు ఆందోళన నెలకొంది.  నియామకాల నిలుపుదలపై ఉన్న స్టేను సుప్రీం కోర్టు శుక్రవారం ఎత్తివేసిందని సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాధరం మీడియాకు తెలిపారు.  

 మహిళా శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-2 రెగ్యులర్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో 305 పోస్టులకు అక్టోబర్ 27వ తేదీ ఒంగోలులో రాత పరీక్ష నిర్వహించారు. మూడు జిల్లాల నుంచి 3887 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 248 మందిని రాతపరీక్ష ద్వారా ఎంపిక చేశారు. పోస్టింగ్‌లిచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కొంతమంది అంగన్‌వాడీ కార్యకర్తలు నోటిఫికేషన్‌లోని నిబంధనలను తప్పుపడుతూ, తమకు అవకాశం కల్పించాలని కోరుతూ కోర్టులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు వెళ్లారు. సమాచార హక్కు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు టీ గంగాధర్ కూడా ఆ శాఖ ఉన్నతాధికారుల చర్యలను తప్పుపడుతూ లోకాయుక్తను ఆశ్రయించారు.

గత డిసెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, 6న హైకోర్టు, 9న సుప్రీంకోర్టు, 12న లోకాయుక్తలు పిటిషన్లు విచారించాయి. సుప్రీంకోర్టు జనవరి 3వ తేదీ, హైకోర్టు 21వ తేదీకి విచారణలను వాయిదా వేశాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టులోని గోఖలే, జాస్తి చలమేశ్వరరావులతో కూడిన న్యాయమూర్తుల బృందం గ్రేడ్-2 సూపర్‌వైజర్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందని సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాధరం శుక్రవారం తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులు తమకు అందలేదని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.
 విచారణ కొనసాగడంపై  కలవరపాటు...
 ఈనెల 21న హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌తోపాటు లోకాయుక్తలో కూడా విచారణలు జరుగనున్నాయి. దీంతో సూపర్‌వైజర్ అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. సుప్రీం కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చి ఉంటే ఆ ఉత్తర్వులకు భిన్నంగా ఏ కోర్టులూ వ్యవహరించవని కొంత ఆశతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement