సాక్షి, హైదరాబాద్: వంటగ్యాస్ సబ్సిడీ అమలు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం కేంద్ర పెట్రోలియం శాఖ బేఖాతరు చేస్తోంది. ఆధార్‌కు చట్టబద్ధత లేదని, ఇది లేదన్న కారణంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఎవరికీ తిరస్కరించరాదని సుప్రీంకోర్టు గత నెలలో సుస్పష్టంగా ప్రకటించింది. ఆధార్ లేకున్నా వంటగ్యాస్ సబ్సిడీని అందించాలని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు ఆదేశాలు జారీచేస్తామని పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి ప్రకటించారు. కానీ నెలన్నర దాటిపోయినా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించటం లేదు. ఆధార్ లేని వారి నుంచి సిలిండర్‌కు రూ. 1,042.50 చొప్పున పూర్తి మొత్తం వసూలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆధార్ లేని వారికి కూడా సిలిండర్‌పై రూ. 575.40 సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడంలేదు. ‘ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. ఎవరైనా దీనిపై కోర్టుకెళితే ఆయిల్ మార్కెటింగ్ శాఖ కోర్టు ధిక్కార నేరాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఒక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
కోర్టులో ‘ఐచ్ఛికమే’నని.. అమలు తప్పనిసరి చేస్తారా?
‘ఆధార్ తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై ఎవరికి వారే నిర్ణయం తీసుకోవచ్చు. ఇది ఐచ్ఛికమే. తప్పనిసరి కాదు’ అని సుప్రీంకోర్టుకు తెలియజేసిన ప్రభుత్వం.. మన రాష్ట్రంలో మాత్రం ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనంటూ ప్రజలపై ఒత్తిడి తెస్తోంది. ఆధార్ లేనివారికి వంటగ్యాస్ సబ్సిడీ ఇవ్వడంలేదు. వంద శాతం ఆధార్ నమోదు, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం ప్రక్రియ పూర్తి చేయాలంటూ జిల్లా జాయింట్ కలెక్టర్లు వంట గ్యాస్ డీలర్లపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఆధార్ నమోదు, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం పూర్తి చేయలేదన్న కారణంగా మెదక్ జిల్లాలో కొందరు డీలర్లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇతర జిల్లాల్లోనూ అధికార యంత్రాంగం నుంచి వంట గ్యాస్ డీలర్లపై ఇలాంటి ఒత్తిడి కొనసాగుతోంది.
ఆధార్ సమర్పించినందుకు రూ. 60 అదనపు భారం
నగదు బదిలీకి ఆధార్ అనుసంధానం గడువు పూర్తికాకముందే ఆధార్ సమర్పించిన వారిపై ఒక్కో గ్యాస్ సిలిండర్‌కు రూ. 60 చొప్పున అదనపు భారం పడుతోంది. వంట గ్యాస్ సిలిండర్‌పై వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన రూ. 25 సబ్సిడీని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ పేరుతో దొంగచాటుగా ఎత్తివేయడం, మొత్తం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1042.50పై (సబ్సిడీ మొత్తం రూ. 575.40 పై కూడా) విలువ ఆధారిత పన్ను వడ్డించడం వల్లే వినియోగదారులపై రూ. 60 అదనపు భారం పడుతోంది. అందువల్లే ఆధార్ సమర్పణకు గడువు ఉన్న జిల్లాల్లో చాలా మంది ఆధార్ ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు కూడా గ్యాస్ కంపెనీల డీలర్లను బాధ్యులను చేస్తూ వారి డీలర్‌షిప్‌లు సస్పెండ్ చేస్తామంటూ అధికారులు హెచ్చరికలు చేయడంపై డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు రాష్ట్రంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డీలర్లు ఆదివారం వరంగల్‌లో సమావేశమయ్యారు. మరోసారి సమావేశమై.. కంపెనీలతో కూడా మాట్లాడి కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయానికొచ్చారు.
‘సుప్రీం’ ఆదేశాలు బేఖాతర్
Published Mon, Nov 11 2013 2:21 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement