Petroleum Department
-
పెట్రో ధరలు తగ్గించే యోచనలో కేంద్రం!
న్యూఢిల్లీ: అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి కాస్తంత ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే ఉద్దేశంతో ప్రజలకు పెట్రో ధరల భారం తగ్గించనుందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.6–10 తగ్గించాలని మోదీ సర్కార్ భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోదీ ఆమోదం కోసం పంపించారని వార్తలొచ్చాయి. అయితే ఈ ధరల సవరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చాలా నెలలుగా ప్రభుత్వరంగ రిటైల్ చమురు కంపెనీలు పెట్రో ధరలను తగ్గించలేదు, పెంచలేదు. గత ఆర్థికసంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో రిటైల్ కంపెనీలు ఆ ధరల భారాన్ని ప్రజలపై పడేశాయి. దీంతో అప్పుడు ధరలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆమేరకు రిటైల్ అమ్మకం ధరలను సంస్థలు తగ్గించలేదు. దాంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ.58,198 కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకున్నాయి. చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8 , లీటర్ డీజిల్ ధర రూ.6 తగ్గింది. కొద్ది నెలలుగా కీలక రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచలేదని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరింత తగ్గించనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
బాధ్యతలు స్వీకరించిన రాజపక్స
కొలంబో: శ్రీలంకలో వెంటవెంటనే చోటుచేసుకుంటున్న పరిణామాల మధ్య మాజీ అధ్యక్షు డు మహింద రాజపక్స సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని సెక్ర టేరియట్‌లో జరిగిన కార్యక్రమంలో రాజపక్స ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సిరిసేన కేబినెట్లో మొత్తం 12 మంది మంత్రులతోపాటు సహాయ, డిప్యూటీ మంత్రు లు ప్రమాణం చేశారు. పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ ఆఫీసు వద్ద ఆదివా రం కాల్పుల్లో గాయపడిన మరొకరు సోమ వారం మరణించడంతో మృతుల సంఖ్య రెండుకు పెరిగింది. దీనికి సంబంధించి మంత్రి రణతుంగను పోలీసులు అరెస్టు చేశారు. -
పెట్రోలియం శాఖ వాళ్లు దేవుళ్లా: సుప్రీం
న్యూఢిల్లీ: పెట్రోలియం కోక్ దిగుమతులపై నిషేధం విషయమై సమయానికి స్పందించకపోవడంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పెట్రోలియం శాఖ వాళ్లు దేవుళ్లా? వాళ్లకిష్టమొచ్చినప్పుడు స్పందిస్తారా? భారత ప్రభుత్వం కన్నా పెద్దదా పెట్రోలియం శాఖ? పనిలేకుండా కూర్చున్న జడ్జీలు వారికి కావాల్సినంత సమయం ఇస్తారని అనుకుంటున్నారా?’ అంటూ జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రోలియం కోక్ (బొగ్గు ఆకారంలో ఉండే పారిశ్రామిక ఇంధనం) దిగుమతులపై నిషేధానికి సంబంధించి పెట్రోలియం శాఖ తన నివేదికను కేవలం ఆదివారమే తమకు సమర్పించిందని పర్యావరణ, అటవీ శాఖ కోర్టుకు చెప్పడంతో జడ్జీలు కోపోద్రిక్తులయ్యారు. పెట్రోలియం శాఖకు 25 వేల రూపాయల జరిమానా విధించి నాలుగు రోజుల్లో చెల్లించాల్సిందేనని ఆదేశించారు. -
పెట్రోల్, డీజిల్ ఫ్యూచర్లకు పెట్రోలియం శాఖ సమ్మతి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో ట్రేడింగ్‌కు పెట్రోలియం శాఖ తన సూత్రప్రాయ ఆమోదాన్ని తెలియజేసింది. సెబీ దీనిపై తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. పెట్రోల్, డీజిల్ ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రారంభించేందుకు సెబీ అనుమతి కోసం ఐసీఈఎక్స్ దరఖాస్తు చేసుకుంది. దీంతో అభిప్రాయాలను తెలియజేయాలని పెట్రోలియం శాఖను సెబీ కోరగా సానుకూల నిర్ణయం వెలువడింది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ పెట్రోల్, డీజిల్ ఫ్యూచర్ కాంట్రాక్టుల ప్రారంభానికి అనుమతించిందని, సెబీ కూడా తుది ఆమోదం ఇస్తుందన్న ఆశాభావాన్ని ఐసీఈఎక్స్ ఎండీ, సీఈవో సంజిత్ ప్రసాద్ వ్యక్తీకరించారు. సెబీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే కాంట్రాక్టులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఇతరుల సూచనల తర్వాతే పెట్రోలియం శాఖ సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. చమురు ధరల్లో హెచ్చు, తగ్గులకు వ్యతిరేకంగా హెడ్జ్ చేసుకుని రిస్క్ తగ్గించుకునేందుకు ఈ కాంట్రాక్టులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో చమురు ధరలు పెరుగుతూ వెళ్లిన విషయం గమనార్హం. ఐసీఈఎక్స్ గత నెలలో 30 సెంట్ల డైమండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను సైతం ప్రారంభించింది. అప్పటికే ఒక క్యారట్, 50 సెంట్ల కాంట్రాక్టులను కూడా నిర్వహిస్తోంది. ప్రపంచంలో డైమండ్ ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రారంభించిన మొదటి ఎక్సేంజ్ ఐసీఈఎక్స్ కావడం గమనార్హం. -
రిఫైనరీ రంగంలో... అగ్రదేశాల సరసన భారత్
2040 నాటికి 340 మిలియన్ టన్నుల ఉత్పత్తి ► కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సాక్షి, విశాఖపట్నం: రిఫైనరీ పరిశ్రమలో అగ్రదేశాల సరసన నిలిచేవిధంగా భారత్ అభివృద్ధిబాటలో పయనిస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇప్పటికే 231 మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంఎంటీ) ఉత్పత్తిని సాధిస్తున్న మన పరిశ్రమ 2040 నాటికి 340 ఎంఎంటీల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 21వ రిఫైనరీ టెక్నాలజీ మీట్ (ఆర్టీఎం)ను విశాఖలో ఆయన గురువారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశ, విదేశాల నుంచి 900 మందికి పైగా రిఫైనరీ పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ), హెచ్‌పీసీఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రధాన్ కీలకోపన్యాసం చేశారు. మన దేశీయ అవసరాలను తీర్చుకోవడంతో పాటు పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక దేశాలకు సరఫరా చేసే స్థాయికి గడిచిన మూడేళ్లలో భారత్ ఎదిగిందని చెప్పారు. అదేవిధంగా మలేసియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్ వంటి దేశాలతో కలిసి పనిచేసే స్థాయికి వృద్ధి చెందిందన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న భారత్ రిఫైనరీ పరిశ్రమ నాలుగో అతిపెద్ద దేశంగా అవతరించిందన్నారు. 9 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన రిఫైనరీని ఇటీవలే రాజస్తాన్‌కు మంజూరు చేశామన్నారు. 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఈ ఇండస్ట్రీస్‌కి రాబోతోందని చెప్పారు. 2020కల్లా బీఎస్–6 ప్రమాణాలు... ప్రస్తుతం రిఫైనరీ రంగం బీఎస్–4 ప్రమాణాల స్థాయికి వచ్చిందని, 2020 కల్లా బీఎస్–6 ప్రమాణాలను అందుకోనుపకపటేకల ప్రధాన్ పేర్కొన్నారు. ఉద్గారాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా కొత్త ఆవిష్కరణలకు నాందిపలకాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సందీప్ పాండ్రిక్ మాట్లాడుతూ దేశ జీడీపీలో 33% రిఫైనరీ రంగానిదేనని చెప్పారు. పెట్రో కెమికల్స్‌కు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని, దిగుమతులు కూడా 15% మేర పెరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలందించిన రిఫైనరీలకు కేంద్ర మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. సదస్సులో హెచ్‌పీసీఎల్ సీఎండీ ఎంకే సురాన్, సీహెచ్టీ ఈడీ బ్రిజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పదవులు అనుభవిస్తూ... విమర్శలా?
సీఎం, ఎంపీలపై పనబాక విమర్శలు సాక్షి, ఒంగోలు: ‘‘కాంగ్రెస్ పార్టీపరంగా ప్రభుత్వంలో అన్ని పదవులు చివరివరకు అనుభవించి... స్వలాభం కోసమే పార్టీలో ఇంకా కొనసాగుతూ... చివరి నిముషంలో పార్టీకి రాజీనామా చేయాలని భావిస్తున్న మా పార్టీ నేతలే అసలైన దొంగలు’’అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి విమర్శించారు. ఆమె శనివారం ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలు, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీని జలగల్లా పట్టుకుని వేళ్లాడుతున్నారని ఆమె వారిని దుయ్యబట్టారు. తాను మొదటినుంచి చెప్తున్నట్లుగానే వ్యక్తిగతంగా సమైక్యవాదినే అయినా పార్టీపరంగా తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. విభజన జరిగినా జరగకపోయినా తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. పనబాకకు సమైక్య సెగ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఒంగోలులో శనివారం విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒంగోలు కలెక్టరేట్లో ఆమె సమావేశంలో ఉండగా విద్యార్థి జేఏసీ నేతలు బయట ధర్నా చేశారు. ‘పనబాక లక్ష్మి సమైక్యాంధ్ర ద్రోహి’అని నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి దూసుకువెళ్లేందుకు యత్నించారు. దాంతో పోలీసులు విద్యార్థి జేఏసీ నేతలను అరెస్ట్ చేసి అక్కడ నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
‘సుప్రీం’ ఆదేశాలు బేఖాతర్
సాక్షి, హైదరాబాద్: వంటగ్యాస్ సబ్సిడీ అమలు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం కేంద్ర పెట్రోలియం శాఖ బేఖాతరు చేస్తోంది. ఆధార్‌కు చట్టబద్ధత లేదని, ఇది లేదన్న కారణంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఎవరికీ తిరస్కరించరాదని సుప్రీంకోర్టు గత నెలలో సుస్పష్టంగా ప్రకటించింది. ఆధార్ లేకున్నా వంటగ్యాస్ సబ్సిడీని అందించాలని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు ఆదేశాలు జారీచేస్తామని పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి ప్రకటించారు. కానీ నెలన్నర దాటిపోయినా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించటం లేదు. ఆధార్ లేని వారి నుంచి సిలిండర్‌కు రూ. 1,042.50 చొప్పున పూర్తి మొత్తం వసూలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆధార్ లేని వారికి కూడా సిలిండర్‌పై రూ. 575.40 సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడంలేదు. ‘ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. ఎవరైనా దీనిపై కోర్టుకెళితే ఆయిల్ మార్కెటింగ్ శాఖ కోర్టు ధిక్కార నేరాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఒక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. కోర్టులో ‘ఐచ్ఛికమే’నని.. అమలు తప్పనిసరి చేస్తారా? ‘ఆధార్ తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై ఎవరికి వారే నిర్ణయం తీసుకోవచ్చు. ఇది ఐచ్ఛికమే. తప్పనిసరి కాదు’ అని సుప్రీంకోర్టుకు తెలియజేసిన ప్రభుత్వం.. మన రాష్ట్రంలో మాత్రం ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనంటూ ప్రజలపై ఒత్తిడి తెస్తోంది. ఆధార్ లేనివారికి వంటగ్యాస్ సబ్సిడీ ఇవ్వడంలేదు. వంద శాతం ఆధార్ నమోదు, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం ప్రక్రియ పూర్తి చేయాలంటూ జిల్లా జాయింట్ కలెక్టర్లు వంట గ్యాస్ డీలర్లపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఆధార్ నమోదు, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం పూర్తి చేయలేదన్న కారణంగా మెదక్ జిల్లాలో కొందరు డీలర్లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇతర జిల్లాల్లోనూ అధికార యంత్రాంగం నుంచి వంట గ్యాస్ డీలర్లపై ఇలాంటి ఒత్తిడి కొనసాగుతోంది. ఆధార్ సమర్పించినందుకు రూ. 60 అదనపు భారం నగదు బదిలీకి ఆధార్ అనుసంధానం గడువు పూర్తికాకముందే ఆధార్ సమర్పించిన వారిపై ఒక్కో గ్యాస్ సిలిండర్‌కు రూ. 60 చొప్పున అదనపు భారం పడుతోంది. వంట గ్యాస్ సిలిండర్‌పై వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన రూ. 25 సబ్సిడీని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ పేరుతో దొంగచాటుగా ఎత్తివేయడం, మొత్తం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1042.50పై (సబ్సిడీ మొత్తం రూ. 575.40 పై కూడా) విలువ ఆధారిత పన్ను వడ్డించడం వల్లే వినియోగదారులపై రూ. 60 అదనపు భారం పడుతోంది. అందువల్లే ఆధార్ సమర్పణకు గడువు ఉన్న జిల్లాల్లో చాలా మంది ఆధార్ ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు కూడా గ్యాస్ కంపెనీల డీలర్లను బాధ్యులను చేస్తూ వారి డీలర్‌షిప్‌లు సస్పెండ్ చేస్తామంటూ అధికారులు హెచ్చరికలు చేయడంపై డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు రాష్ట్రంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డీలర్లు ఆదివారం వరంగల్‌లో సమావేశమయ్యారు. మరోసారి సమావేశమై.. కంపెనీలతో కూడా మాట్లాడి కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయానికొచ్చారు.