న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో ట్రేడింగ్‌కు పెట్రోలియం శాఖ తన సూత్రప్రాయ ఆమోదాన్ని తెలియజేసింది. సెబీ దీనిపై తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. పెట్రోల్, డీజిల్ ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రారంభించేందుకు సెబీ అనుమతి కోసం ఐసీఈఎక్స్ దరఖాస్తు చేసుకుంది. దీంతో అభిప్రాయాలను తెలియజేయాలని పెట్రోలియం శాఖను సెబీ కోరగా సానుకూల నిర్ణయం వెలువడింది.
పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ పెట్రోల్, డీజిల్ ఫ్యూచర్ కాంట్రాక్టుల ప్రారంభానికి అనుమతించిందని, సెబీ కూడా తుది ఆమోదం ఇస్తుందన్న ఆశాభావాన్ని ఐసీఈఎక్స్ ఎండీ, సీఈవో సంజిత్ ప్రసాద్ వ్యక్తీకరించారు. సెబీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే కాంట్రాక్టులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఇతరుల సూచనల తర్వాతే పెట్రోలియం శాఖ సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
చమురు ధరల్లో హెచ్చు, తగ్గులకు వ్యతిరేకంగా హెడ్జ్ చేసుకుని రిస్క్ తగ్గించుకునేందుకు ఈ కాంట్రాక్టులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో చమురు ధరలు పెరుగుతూ వెళ్లిన విషయం గమనార్హం. ఐసీఈఎక్స్ గత నెలలో 30 సెంట్ల డైమండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను సైతం ప్రారంభించింది. అప్పటికే ఒక క్యారట్, 50 సెంట్ల కాంట్రాక్టులను కూడా నిర్వహిస్తోంది. ప్రపంచంలో డైమండ్ ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రారంభించిన మొదటి ఎక్సేంజ్ ఐసీఈఎక్స్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment