రిఫైనరీ రంగంలో... అగ్రదేశాల సరసన భారత్
2040 నాటికి 340 మిలియన్ టన్నుల ఉత్పత్తి
► కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
సాక్షి, విశాఖపట్నం: రిఫైనరీ పరిశ్రమలో అగ్రదేశాల సరసన నిలిచేవిధంగా భారత్ అభివృద్ధిబాటలో పయనిస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇప్పటికే 231 మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంఎంటీ) ఉత్పత్తిని సాధిస్తున్న మన పరిశ్రమ 2040 నాటికి 340 ఎంఎంటీల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 21వ రిఫైనరీ టెక్నాలజీ మీట్ (ఆర్‌టీఎం)ను విశాఖలో ఆయన గురువారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశ, విదేశాల నుంచి 900 మందికి పైగా రిఫైనరీ పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు.
సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీ), హెచ్‌పీసీఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రధాన్ కీలకోపన్యాసం చేశారు. మన దేశీయ అవసరాలను తీర్చుకోవడంతో పాటు పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక దేశాలకు సరఫరా చేసే స్థాయికి గడిచిన మూడేళ్లలో భారత్ ఎదిగిందని చెప్పారు. అదేవిధంగా మలేసియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్ వంటి దేశాలతో కలిసి పనిచేసే స్థాయికి వృద్ధి చెందిందన్నారు.
పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న భారత్ రిఫైనరీ పరిశ్రమ నాలుగో అతిపెద్ద దేశంగా అవతరించిందన్నారు. 9 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన రిఫైనరీని ఇటీవలే రాజస్తాన్‌కు మంజూరు చేశామన్నారు. 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఈ ఇండస్ట్రీస్‌కి రాబోతోందని చెప్పారు.
2020కల్లా బీఎస్–6 ప్రమాణాలు...
ప్రస్తుతం రిఫైనరీ రంగం బీఎస్–4 ప్రమాణాల స్థాయికి వచ్చిందని, 2020 కల్లా బీఎస్–6 ప్రమాణాలను అందుకోనుపకపటేకల ప్రధాన్ పేర్కొన్నారు. ఉద్గారాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా కొత్త ఆవిష్కరణలకు నాందిపలకాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సందీప్ పాండ్రిక్ మాట్లాడుతూ దేశ జీడీపీలో 33% రిఫైనరీ రంగానిదేనని చెప్పారు. పెట్రో కెమికల్స్‌కు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని, దిగుమతులు కూడా 15% మేర పెరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలందించిన రిఫైనరీలకు కేంద్ర మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. సదస్సులో హెచ్‌పీసీఎల్ సీఎండీ ఎంకే సురాన్, సీహెచ్‌టీ ఈడీ బ్రిజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.