పదవులు అనుభవిస్తూ... విమర్శలా?
సీఎం, ఎంపీలపై పనబాక విమర్శలు
సాక్షి, ఒంగోలు: ‘‘కాంగ్రెస్ పార్టీపరంగా ప్రభుత్వంలో అన్ని పదవులు చివరివరకు అనుభవించి... స్వలాభం కోసమే పార్టీలో ఇంకా కొనసాగుతూ... చివరి నిముషంలో పార్టీకి రాజీనామా చేయాలని భావిస్తున్న మా పార్టీ నేతలే అసలైన దొంగలు’’అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి విమర్శించారు. ఆమె శనివారం ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలు, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీని జలగల్లా పట్టుకుని వేళ్లాడుతున్నారని ఆమె వారిని దుయ్యబట్టారు. తాను మొదటినుంచి చెప్తున్నట్లుగానే వ్యక్తిగతంగా సమైక్యవాదినే అయినా పార్టీపరంగా తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. విభజన జరిగినా జరగకపోయినా తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు.
పనబాకకు సమైక్య సెగ
కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఒంగోలులో శనివారం విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒంగోలు కలెక్టరేట్‌లో ఆమె సమావేశంలో ఉండగా విద్యార్థి జేఏసీ నేతలు బయట ధర్నా చేశారు. ‘పనబాక లక్ష్మి సమైక్యాంధ్ర ద్రోహి’అని నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి దూసుకువెళ్లేందుకు యత్నించారు. దాంతో పోలీసులు విద్యార్థి జేఏసీ నేతలను అరెస్ట్ చేసి అక్కడ నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.