సాక్షి, సిటీబ్యూరో: రౌడీలపై రౌడీషీట్.. చోరులపై సిటీ డోషియర్ క్రిమినల్ షీట్.. సమస్యాత్మక వ్యక్తులపై హిస్టరీ షీట్.. మత పరమైన నేరాలు చేసిన వారిపై కమ్యూనల్ షీట్.. కబ్జాకోరులపై ల్యాండ్ గ్రాబర్ షీట్.. ఇవీ ప్రస్తుతం అమలవుతున్న విధానాలు. వీటికి అదనంగా హైదరాబాద్ పోలీసులు తొలిసారిగా మోసగాళ్లపై సస్పెక్ట్ షీట్ తెరుస్తున్నారు. వైట్‌కాలర్ అఫెన్సులతో పాటు సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై కూడా దీన్ని తెరుస్తున్నామని హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డీసీపీ జి.పాలరాజు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సైబర్ క్రైమ్ ఠాణా అధికారులు అరెస్టు చేసిన మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎమ్‌ఎల్‌ఎమ్) మోసగాళ్లు రత్నకుమారి, పండులపై తొలిషీట్లు ఓపెన్ చేస్తున్నామని ప్రకటించారు. ‘‘ప్రస్తుతం మోసగాళ్లపై తెరుస్తున్న సస్పెక్ట్ షీట్లను త్వరలో అన్ని రకాలైన ప్రాపర్టీ అఫెండర్లుకూ వర్తింపజేస్తాం. వీరు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వెంటనే స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. తద్వారా ఠాణా సిబ్బందితో పాటు బీట్ కానిస్టేబుళ్లు, గస్తీ బృందాలు, స్పెషల్‌బ్రాంచ్ అధికారులు నిత్యం వీరిపై కన్నేసి ఉంచుతారు. నేరగాళ్ల వివరాలు స్థానిక పోలీసుస్టేషన్లు, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండటంతో ప్రజలూ అప్రమత్తం కావడానికి అవకాశం ఉంటుంది’’ అని డీసీపీ పాలరాజు తెలిపారు.
ఎవరిపై ఎలా..: ఏటా నమోదవుతున్న నేరాల్లో 85 శాతం పాత నేరగాళ్లే నిందితులుగా ఉంటున్నారు. వీరిపై కన్నేసి ఉంచడం ద్వారా నేరాల్ని నిరోధించడంతో పాటు అప్పటికే చోటు చేసుకున్న వాటిని కొలిక్కి తేవడం తేలికవుతుందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి రిపీటెడ్ అఫెండర్స్‌పై ఉక్కుపాదం మోపడానికి ప్రారంభించిన విధానమే సస్పెక్ట్ షీట్ తెరవడం. ఇప్పటి వరకు అసాంఘిక శక్తులపై చట్ట పరిధిలో తెరుస్తున్న షీట్లలో స్వల్ప మార్పులతో సీసీఎస్ అధికారులు ఈ షీట్లు నమోదు చేస్తారు. నేరగాళ్లకు సంబంధించిన ఫొటో, చిరునామా సహా పూర్తి సమాచారం ఇందులో పొందుపరుస్తారు. ఈ వివరాలను సదరు నేరగాళ్లు ఏ ఠాణా పరిధిలో నివసిస్తుంటే ఆ పోలీసుస్టేషన్‌కు పంపుతారు. ఆయా ఠాణాల్లో వీరి ఫొటోలను అందుబాటులో ఉంచుతారు. ఈ షీట్‌లో నిందితుడు ఇప్పటి వరకు చేసిన నేరాలు, అనుసరించిన విధానాలు (మోడెస్ ఆపరెండీ), కోర్టులు, దర్యాప్తు దశల్లో ఉన్న కేసుల స్థితిగతులు తదితరాలను పొందు పరుస్తారు. దీనివల్ల పోలీసు అధికారులు మారినప్పటికీ నేరగాళ్లపై పక్కా నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుంది.
వెబ్‌సైట్‌లో నేరగాళ్ల వివరాలు: సామాన్యులు, మోసగాళ్ల ఎత్తులకు ఆకర్షితులవుతున్న వారు ఠాణాలకు వెళ్లి వివరాలు సరిచూసుకోవడం సాధ్యం కాదని భావిస్తున్న సీసీఎస్ పోలీసులు ఈ వివరాలను హైదరాబాద్ పోలీసు వెబ్‌సైట్ (ఠీఠీఠీ.జిడఛ్ఛీట్చఛ్చఛీఞౌజీఛ్ఛి.జౌఠి.జీ)లోనూ ప్రత్యేక లింకు ఏర్పాటు చేయడం ద్వారా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఇంటర్ నెట్ ద్వారా మోసాగాళ్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
మోసగాళ్లకు సస్పెక్ట్ షీట్‌తో చెక్
Published Mon, Nov 11 2013 5:00 AM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM
Advertisement