ఉత్కంఠ.. ఉద్రిక్తత | Suspense tensions .. | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ.. ఉద్రిక్తత

Published Fri, Jul 4 2014 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

ఉత్కంఠ.. ఉద్రిక్తత

ఉత్కంఠ.. ఉద్రిక్తత

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: కడప కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాయచోటి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాలిటీ పాలకమండళ్ల ఎన్నికలు ఉద్రిక్తత, ఉత్కంఠ మధ్య జరిగాయి. కడప నగర మేయర్‌గా సురేష్‌బాబు ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా ఉండేల గురివిరెడ్డి, మైదుకూరు చైర్మన్‌గా రంగసంహ, మైదుకూరు చైర్మన్‌గా పార్థసారధి ఎన్నికయ్యారు. రాయచోటి, ఎర్రగుంట్ల ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీల బలాబలాలు సమానం కావడంతో డిప్ తీశారు. ఈ రెండు చోట్ల విజయం వైఎస్సార్‌సీపీనే వరించింది. జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు.
 
 కడప నగర మేయర్‌గా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కె. సురేష్‌బాబు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 42 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియో మెంబర్లు ఆయనకు మద్దతు పలికారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా 25వ డివిజన్ కార్పొరేటర్ బి. అరీఫుల్లా  అంతే ఆధిక్యంతో నెగ్గారు. జిల్లా కలెక్టర్ శశిధర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. సుదీర్ఘ సమయం తర్వాత మళ్లీ ప్రజాప్రతినిధులు కడప కార్పొరేషన్‌కు రావడం సంతోషకరమని జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి కె.శశిధర్ అన్నారు.
 
 కడప నగర ప్రజలకు మంచి పాలన అందించేందుకు పాలకవర్గమంతా కష్టపడి పనిచేస్తుందని నూతన మేయర్ కొత్తమద్ది సురేష్‌బాబు అన్నారు.
 పులివెందుల చైర్‌పర్సన్‌గా ప్రమీలమ్మ : పులివెందుల మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా ప్రమీలమ్మ ఎన్నికయ్యారు. వైఎస్ చైర్మన్‌గా చిన్నప్పను ఎన్నుకున్నారు.
 
 ప్రొద్దుటూరు చైర్మన్‌గా గురివిరెడ్డి : ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీకి చెందిన ఉండేల గురివిరెడ్డి ఎన్నికయ్యారు. టీడీపీ ప్రతిపాదించిన ఉండేల గురివిరెడ్డి పేరును జాయింట్ కలెక్టర్ చదవగా  కౌన్సిలర్లు కోనేటి సునంద, గాండ్ల శకుంతల ప్రతి పాదించారు. టీడీపీకి చెందిన 22 మంది కౌన్సిలర్లతో పాటు, ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య కూడా చేతులు ఎత్తి మద్దతును ప్రకటించారు. దీంతో చైర్మన్‌గా గురివిరెడ్డి ఎన్నికైనట్లు జేసీ ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్‌చైర్మన్‌గా జబీవుల్లాను ఎన్నుకున్నారు.  అందరి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా చైర్మన్ గురివిరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి, మున్సిపల్ కమిషనర్  వెంకటకృష్ణతో పాటు పలువురు చైర్మన్‌ను అభినందించారు.
 మైదుకూరు చైర్మన్‌గా రంగసింహ : మైదుకూరు మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన రంగసింహ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా పెద్దగుర్రప్పను ఎన్నుకున్నారు. అందరి సహకారంతో మైదుకూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రంగసింహ ప్రకటించారు. టీడీపీ నేత పుట్టా సుధాకరయాదవ్ అభినందనలు తెలిపారు.
 బద్వేలు చైర్మన్‌గా పార్థసారధి : బద్వేలు మున్సిపల్ చైర్మన్‌గా తెలుగుదేశంకు చెందిన పార్థసారధి ఎన్నికయ్యారు. ఆయనకు ధ్రువీకరణ పత్రం అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు.  వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రిటర్నింగ్ అధికారి లవన్న కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
 
 రాయచోటిలో వైఎస్సార్‌సీపీదే విజయం : రాయచోటి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక క్షణ క్షణం ఉత్కంఠ నడుమ సాగింది. వైయస్‌ఆర్‌సీపీ, టీడీపీ  సభ్యుల బలం  సమానం కావడంతో  లాటరీ పద్దతిలో మున్సిపల్ ఛైర్మన్‌గా ఖయ్యంఖాని నసీబున్ ఖానం ఎన్నికయ్యారు. మొదట వైయస్‌ఆర్‌సీపీ  తరుపున నసీబున్ ఖానంను ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే టీడీపీ  తరుపున షాబిరున్నీసాను ఛైర్మన్ అభ్యర్థిగా  సూచించారు.  ఇరువర్గాల బలాలు సమానంగా ఉండటంతో చైర్మన్‌ను లాటరీ పద్దతిలో ఎంపిక చేశారు. చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీకి చెందిన నసీబున్ ఎన్నికకాగా వైస్ చైర్మన్‌గా ఇందాదుల్లా ఎన్నికయ్యారు.
 
 ఎర్రగుంట్లలో వైఎస్సార్‌సీపీ విజయం
 ఉత్కంఠగా జరిగిన ఎర్రగుంట్ల మున్సిపాలిటీ చైర్మన్, ైవె స్ చైర్మన్‌లుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. లక్కీడిప్‌లో చైర్మన్‌గా ముసలయ్య, వైస్ చైర్మన్‌గా సుభాష్‌రెడ్డి ఎన్నికయ్యారు. శిబిరాలలో ఉన్న కౌన్సిలర్లు ఉదయం 10 గంటలకే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. వీరందరితో ప్రిసైడింగ్ అధికారి రంగన్న ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా ముసలయ్య, టీడీపీ అభ్యర్థిగా సాదుకూన్‌ను ప్రకటించారు. ఇరువర్గాల బలాలు సమానం కావడంతో లక్కీడిప్ తీశారు. డిప్‌లో ముసలయ్యనే విజయం వరించింది. అలాగే వైస్ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీకే చెందిన సుభాష్‌రెడ్డి విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement