ఆలయాలను కూలగొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం
- విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మండిపాటు
- దేవాలయ భూములను దోచుకుతింటున్నారు
- హిందూమతాన్ని,జాతిని అణచివేస్తోంది
- వైభవంగా స్వామీజీ జన్మదినోత్సవం
పెందుర్తి: విజయవాడలో 40 దేవాలయాలను కూలగొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు అండతో కొందరు వ్యక్తులు దేవాలయాల భూములను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఆలయాల భూములను రక్షించడం కోసం శారదాపీఠం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. స్వామీజీ జన్మదినోత్సవాన్ని గురువారం వేడుకగా నిర్వహించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో జరిగిన జన్మదినోత్సవ ఆత్మీయ సభలో స్వామీజీ భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. రూ.158 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్మును కాలువలు, రోడ్లకు వినియోగించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
హిందూమతాన్ని, హిందూ జాతిని దుర్మార్గంగా అణచిచేస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్ధిని ప్రసాదించాలని దేవతామూర్తులను తాను వేడుకున్నట్లు స్వామీజీ తెలిపారు. ప్రభుత్వం చేతుల్లో నలిగిపోతున్న ధర్మాన్ని కాపాడుకునేందుకు తనకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకున్నానన్నారు. హిందూధర్మం కోసం స్వామీజీ చేస్తున్న పోరాటం గొప్పదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కొనియాడారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... స్వామీజీ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, వంశీకృష్ణశ్రీనివాస్‌యాదవ్, తిప్పల నాగిరెడ్డి, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది పేదలకు స్వామీజీ చేతుల మీదుగా వస్త్రదానం చేశారు. ఉదయం స్వామీజీ చేతుల మీదుగా దేవతామూర్తులకు అభిషేకాలు నిర్వహించి పూజలు జరిపారు.
వైఎస్ జగన్ శుభాకాంక్షలు
జన్మదినోత్సవం సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం స్వామీజీకి ఫోన్ చేసి కాసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మం త్రి శిద్ధా రాఘవరావు, ఇతర ప్రముఖులు స్వామీజీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వచనాలు పొందారు.