Svarupanandendra Saraswati
-
కొత్తనోట్లు వేస్తేనే మొక్కు తీరుతుంది
శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సాక్షి, తిరుమల: దేవునికి భక్తులు హుండీ ద్వారా సమర్పించే కానుకల్లో పాతనోట్లు వేయవద్దని, కొత్త నోట్లు వేయడం వల్లే మొక్కు తీరుతుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. భక్తులు ఏడుకొండలవాడిపై అపారమైన భక్తి విశ్వాసాలతో పైసాపైసా కూడబెట్టుకుని ‘‘గోవిందా..గోవిందా’’ అంటూ తిరుమలకు వచ్చి హుండీలో సమర్పిస్తుంటారని, భక్తుల కష్టార్జితంతో కూడిన హుండీ కానుకలు చెల్లవని చెప్పటం సరికాదన్నారు. కేంద్రంతో స్నేహ సంబంధా లున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ఇప్పటికే టీటీడీ వద్ద ఉన్న రూ. 8.29 కోట్ల పాత కరెన్సీ నోట్లను చెల్లుబాటయ్యేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. -
దేశ ప్రగతికి బ్రాహ్మణ జాతి తోడ్పడింది
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కావడి (కేరళ): స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి నేటి వరకూ భారతదేశ ప్రగతికి బ్రాహ్మణజాతి ఎంతగానో తోడ్పడిందని, అటువంటి జాతిని కుటిల ప్రయత్నాలతో అన్ని రాష్ట్రాల్లోనూ అణగ దొక్కేస్తున్నారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆది శంకరాచార్యుల జన్మస్థలమైన కేరళలోని ‘కాలడి’ గ్రామంలో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రాహ్మణుల సలహాలూ, సూచనలు పాటించడం వల్లే అప్పట్లో రాజ్యాలు సుభిక్షంగా ఉండేవని, యజ్ఞ యాగాదులతో రాజ్యాలు సుఖ సంతోషాలతో ఉండేవని అన్నారు. కానీ నేడు బ్రాహ్మణులను గుర్తించి వారి సూచనలను, సలహాలను పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. శంకరాచార్య, శ్రీ రామానుజ, శ్రీ మధ్వాచార్యుల సాంప్రదాయ పీఠాలను, భక్తులను, బ్రాహ్మణ జాతి సభ్యులందరినీ కలుపుకుని త్వరలో భారతదేశం మొత్తం పర్యటించి, బ్రాహ్మణ జాతిని చైతన్య పరిచి అన్ని రకాలా ప్రాధాన్యత ఇచ్చేవరకూ ముందుండి నడిపిస్తామని పేర్కొన్నారు. -
సంప్రదాయాలకు విలువిచ్చేవారే ప్రజానేతలు
♦ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆ కోవకు చెందిన వ్యక్తి ♦ వేద పండితులు సుఖసంతోషాలతో ఉంటేనే దేశానికి మంచిది: శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పెందుర్తి: సనాతన సంప్రదాయాలు, పీఠాలు, మఠాలు, దేవాలయాలకు విలువనిచ్చే వారే నిజమైన ప్రజానాయకులు కాగలుగుతారని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంప్రదాయ విలువలు, పీఠాలు, దేవుడిపై ఎనలేని భక్తి, గౌరవం ఉన్నాయని చెప్పారు. ప్రజానాయకులకు విలువలుంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా చినముషిడివాడలోని శారదాపీఠం వార్షికోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన శ్రౌత, శాస్త్రసభలో భక్తులనుద్దేశించి స్వామీజీ అనుగ్రహభాషణం చేశారు. మాజీ మంత్రులు, వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్తర పీఠాధిపతిగా కిరణ్‌కుమార్‌శర్మ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతిగా కిరణ్‌కుమార్‌శర్మ (బాలస్వామి)ను నియమించినట్లు స్వరూపానందేంద్ర సరస్వతి వెల్లడించారు. తాను 2020లో రుషికేష్‌కు వెళ్లి అక్కడే భగవంతుని సేవకు అంకితమవుతానన్నారు. బాలస్వామిని వైఎస్ జగన్ చేతుల మీదుగా సత్కరించే ఏర్పాటు చేశామని, అయితే అనివార్య కారణాల వలన ఆయన రాలేకపోయారని స్వామీజీ చెప్పారు. పీఠమన్నా, తానన్నా జగన్‌కు అభిమానమని గుర్తుచేసుకున్నారు. బాలస్వామిని ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఘనంగా సత్కరించారు. -
దేశానికి కాలసర్పదోషం
స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పెందుర్తి: దేశానికి కాలసర్పదోషం ఉన్నందున రానున్న రోజుల్లో గడ్డుకాలం నడుస్తుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. దాని నివారణకు హోమాలు, యజ్ఞాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం మూడో రోజు ఘనంగా జరిగాయి. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ సీతారామమూర్తి, ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి సింధు, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధి చాముండేశ్వరీనా«థ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు. -
ఆలయాలను కూలగొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం
-
ఆలయాలను కూలగొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం
- విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మండిపాటు - దేవాలయ భూములను దోచుకుతింటున్నారు - హిందూమతాన్ని,జాతిని అణచివేస్తోంది - వైభవంగా స్వామీజీ జన్మదినోత్సవం పెందుర్తి: విజయవాడలో 40 దేవాలయాలను కూలగొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు అండతో కొందరు వ్యక్తులు దేవాలయాల భూములను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఆలయాల భూములను రక్షించడం కోసం శారదాపీఠం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. స్వామీజీ జన్మదినోత్సవాన్ని గురువారం వేడుకగా నిర్వహించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో జరిగిన జన్మదినోత్సవ ఆత్మీయ సభలో స్వామీజీ భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. రూ.158 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్మును కాలువలు, రోడ్లకు వినియోగించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. హిందూమతాన్ని, హిందూ జాతిని దుర్మార్గంగా అణచిచేస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్ధిని ప్రసాదించాలని దేవతామూర్తులను తాను వేడుకున్నట్లు స్వామీజీ తెలిపారు. ప్రభుత్వం చేతుల్లో నలిగిపోతున్న ధర్మాన్ని కాపాడుకునేందుకు తనకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకున్నానన్నారు. హిందూధర్మం కోసం స్వామీజీ చేస్తున్న పోరాటం గొప్పదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కొనియాడారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... స్వామీజీ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, వంశీకృష్ణశ్రీనివాస్యాదవ్, తిప్పల నాగిరెడ్డి, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది పేదలకు స్వామీజీ చేతుల మీదుగా వస్త్రదానం చేశారు. ఉదయం స్వామీజీ చేతుల మీదుగా దేవతామూర్తులకు అభిషేకాలు నిర్వహించి పూజలు జరిపారు. వైఎస్ జగన్ శుభాకాంక్షలు జన్మదినోత్సవం సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం స్వామీజీకి ఫోన్ చేసి కాసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మం త్రి శిద్ధా రాఘవరావు, ఇతర ప్రముఖులు స్వామీజీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వచనాలు పొందారు. -
‘బాబు ఎన్ని తప్పులు చేస్తే హుండీలో డబ్బులు వేశారు?’
పాపపు సొమ్ము హుండీలో వేస్తున్నారనడం అవివేకం సీఎం స్థాయిలో వారు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు చంద్రబాబుపై మండిపడ్డ స్వరూపానందేంద్ర సరస్వతి తిరుమల ప్రజలు పాపపు సొమ్మునే హుండీల్లో వేస్తునారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శనమని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. గురువారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు. చంద్రబాబు ఎన్ని తప్పులు చేస్తే ఆయన మనవడి పుట్టినరోజు శ్రీవారికి విరాళంగా డబ్బులు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి నుంచి పేదవాడి వరకు భక్తులు అందరూ తాము కష్టపడి సంపాదించిన సొమ్మునే హుండీల్లో వేస్తున్నారని అన్నారు. ఇలా హుండీల్లో భక్తులు వేసిన డబ్బులతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. హిందూ మతం, సంప్రదాయాలపై ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పెద్దలే అక్రమార్కులు సదాపర్తి ఆలయానికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని అన్నారు. 470 ఎకరాలకు గాను 83 ఎకరాలే స్వాధీనంలో ఉన్నాయని, ప్రభుత్వ పెద్దలే ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇలాగే అనేక ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని, ప్రభుత్వం అభాసుపాలు కాకముందే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించుకంటే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. -
పండితులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
స్వరూపానందేంద్ర సరస్వతి విమర్శ సాక్షి, విశాఖపట్నం: పండితులను, దేవాలయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. పెందుర్తి శారద పీఠంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2016 రాష్ట్రానికి అంతగా బాగోలేదని.. దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగడం కోసం ఈనెల 14 నుంచి 18 వరకు శారదా పీఠంలో సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామిలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నామని స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 18వ తేదీ కార్యక్రమాలకు హాజరవుతారని వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పండితులను రప్పించి వారిని స్వర్ణ కంకణధారణతో సత్కరిస్తామని వివరించారు. -
హిందూధర్మ పరిరక్షణకు కృషి
పెందుర్తి (విశాఖ): హిందూధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నట్లు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెందుర్తి మండలం చినముషిడివాడలో స్వామీజీ జన్మదిన వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. పీఠం ప్రాంగణంలో దేవతామూర్తులకు స్వామీజీ పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పీఠంలో జరిగిన ఆత్మీయ సభలో భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. పవిత్ర హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాల నిరోధానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నామన్నారు. సేవా కార్యక్రమాలను భవిష్యత్‌లో మరింత విస్తృతం చేస్తామని, లోక కల్యాణార్థం ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కొనసాగిస్తామని వెల్లడించారు. స్వామీజీకి ప్రముఖుల సత్కారం స్వామీజీని మంత్రి గంటా శ్రీనివాసరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, గణబాబు, పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, సింహాచలం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ తదితరులు గజమాలతో సత్కరించి ఆయన ఆశీర్వచనాలు పొందారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, టీటీడీ ఈవో సాంబశివరావు, ఐఏఎస్ ఎల్.వి సుబ్రహ్మణ్యం, తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ, ఐపీఎస్ జె.పూర్ణచంద్రరావు ఫోన్ ద్వారా స్వామీజీకి శుభాకాంక్షలు తెలియజేశారు. సభలో స్వామీజీ చేతుల మీదుగా పేదలకు వస్త్రదానం చేశారు. వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.