పాపపు సొమ్ము హుండీలో వేస్తున్నారనడం అవివేకం
సీఎం స్థాయిలో వారు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు
చంద్రబాబుపై మండిపడ్డ స్వరూపానందేంద్ర సరస్వతి
తిరుమల
ప్రజలు పాపపు సొమ్మునే హుండీల్లో వేస్తునారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శనమని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. గురువారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు. చంద్రబాబు ఎన్ని తప్పులు చేస్తే ఆయన మనవడి పుట్టినరోజు శ్రీవారికి విరాళంగా డబ్బులు ఇచ్చారని ప్రశ్నించారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి నుంచి పేదవాడి వరకు భక్తులు అందరూ తాము కష్టపడి సంపాదించిన సొమ్మునే హుండీల్లో వేస్తున్నారని అన్నారు. ఇలా హుండీల్లో భక్తులు వేసిన డబ్బులతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. హిందూ మతం, సంప్రదాయాలపై ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
పెద్దలే అక్రమార్కులు
సదాపర్తి ఆలయానికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని అన్నారు. 470 ఎకరాలకు గాను 83 ఎకరాలే స్వాధీనంలో ఉన్నాయని, ప్రభుత్వ పెద్దలే ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇలాగే అనేక ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని, ప్రభుత్వం అభాసుపాలు కాకముందే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించుకంటే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.