సంప్రదాయాలకు విలువిచ్చేవారే ప్రజానేతలు
♦ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆ కోవకు చెందిన వ్యక్తి
♦ వేద పండితులు సుఖసంతోషాలతో ఉంటేనే దేశానికి మంచిది: శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి
పెందుర్తి: సనాతన సంప్రదాయాలు, పీఠాలు, మఠాలు, దేవాలయాలకు విలువనిచ్చే వారే నిజమైన ప్రజానాయకులు కాగలుగుతారని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంప్రదాయ విలువలు, పీఠాలు, దేవుడిపై ఎనలేని భక్తి, గౌరవం ఉన్నాయని చెప్పారు. ప్రజానాయకులకు విలువలుంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా చినముషిడివాడలోని శారదాపీఠం వార్షికోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన శ్రౌత, శాస్త్రసభలో భక్తులనుద్దేశించి స్వామీజీ అనుగ్రహభాషణం చేశారు. మాజీ మంత్రులు, వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ఉత్తర పీఠాధిపతిగా కిరణ్‌కుమార్‌శర్మ
శారదాపీఠం ఉత్తర పీఠాధిపతిగా కిరణ్‌కుమార్‌శర్మ (బాలస్వామి)ను నియమించినట్లు స్వరూపానందేంద్ర సరస్వతి వెల్లడించారు. తాను 2020లో రుషికేష్‌కు వెళ్లి అక్కడే భగవంతుని సేవకు అంకితమవుతానన్నారు. బాలస్వామిని వైఎస్ జగన్ చేతుల మీదుగా సత్కరించే ఏర్పాటు చేశామని, అయితే అనివార్య కారణాల వలన ఆయన రాలేకపోయారని స్వామీజీ చెప్పారు. పీఠమన్నా, తానన్నా జగన్‌కు అభిమానమని గుర్తుచేసుకున్నారు. బాలస్వామిని ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఘనంగా సత్కరించారు.