‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’ | Gudivada Amarnath Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

Published Tue, Jul 16 2019 4:32 PM | Last Updated on Tue, Jul 16 2019 7:12 PM

Gudivada Amarnath Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : కాపు సామాజిక వర్గాన్ని తమ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌ అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కాపులపై చంద్రబాబు నాయుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు కాపులకు ఏడాదికి రూ. వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి.. ఐదేళ్లలో రూ.2వేల కోట్లు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాపులను బీసీలలో కలుపుతామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అన్ని విధాల నష్టపోయిన కాపులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుదన్నారు.  కాపులను సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని విధాల ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. కాపు సామాజిక వర్గాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకై ఏడాదికి రూ. 2వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించామని గుర్తు చేశారు. ఇచ్చిన మాటాను నిలబెట్టుకునే వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసించారు. 

కాపులకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు
కాపు సామాజిక వర్గాన్ని ఆదుకునేందుకై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌లో పెద్ద పీట వేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. కాపులను ఆర్థికంగా ఆదుకునేందుకు బడ్జెట్‌లో రూ. రెండు వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల అవసరాలకోసం కాపులను వాడుకున్నారని ఆరోపించారు. కాపులకు చంద్రబాబు చేసిన మోసాన్ని ఆ సామాజికవర్గం ఎన్నడూ మర్చిపోలేదన్నారు.

కాపులంతా జగన్‌ వెంటే ఉన్నారు
మేనిఫెస్టో ప్రకారం వచ్చే ఐదేళ్లలో కాపులకు రూ. పదివేల కోట్లను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేటాయిస్తారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన కాపులపై తప్పుడు కేసులు పెట్టించిన చంద్రబాబు.. ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. కాపులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి  సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. కాపులమని చెప్పుకొని పార్టీ పెట్టిన నాయకులను కూడా ఆ సామాజిక వర్గం నమ్మలేదన్నారు. రాష్ట్రంలోని కాపులంతా సీఎం జగన్‌ వేంటే ఉన్నారని, వారందరికి ఆయన న్యాయం చేస్తారని ఎమ్మెల్యే కరణం అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement