హిందూధర్మ పరిరక్షణకు కృషి
పెందుర్తి (విశాఖ): హిందూధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నట్లు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెందుర్తి మండలం చినముషిడివాడలో స్వామీజీ జన్మదిన వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. పీఠం ప్రాంగణంలో దేవతామూర్తులకు స్వామీజీ పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పీఠంలో జరిగిన ఆత్మీయ సభలో భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. పవిత్ర హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాల నిరోధానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నామన్నారు. సేవా కార్యక్రమాలను భవిష్యత్‌లో మరింత విస్తృతం చేస్తామని, లోక కల్యాణార్థం ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కొనసాగిస్తామని వెల్లడించారు.
స్వామీజీకి ప్రముఖుల సత్కారం
స్వామీజీని మంత్రి గంటా శ్రీనివాసరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, గణబాబు, పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, సింహాచలం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ తదితరులు గజమాలతో సత్కరించి ఆయన ఆశీర్వచనాలు పొందారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, టీటీడీ ఈవో సాంబశివరావు, ఐఏఎస్ ఎల్.వి సుబ్రహ్మణ్యం, తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ, ఐపీఎస్ జె.పూర్ణచంద్రరావు ఫోన్ ద్వారా స్వామీజీకి శుభాకాంక్షలు తెలియజేశారు. సభలో స్వామీజీ చేతుల మీదుగా పేదలకు వస్త్రదానం చేశారు. వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.