ఎస్వీయూ వీసీపై వేటుకు రంగం సిద్ధం | SVU Vice Chancellor Resigns..? | Sakshi
Sakshi News home page

ఎస్వీయూ వీసీపై వేటుకు రంగం సిద్ధం

Published Tue, Jun 18 2019 10:10 AM | Last Updated on Thu, Jun 27 2019 1:30 PM

SVU Vice Chancellor Resigns..? - Sakshi

ఎస్వీయూ వీసీగా బాధ్యతలు తీసుకుంటున్న ప్రొఫెసర్‌ వీవీఎన్‌ రాజేంద్రప్రసాద్‌( ఫైల్‌ )

టీడీపీ ప్రభుత్వ ఆశీస్సులతో హైకోర్టు కన్నుగప్పి పాత తేదీలతో విధుల్లో చేరిన ఎస్వీ యూనివర్సిటీ వీసీ వీవీఎన్‌ రాజేంద్రప్రసాద్‌పై వేటుకు రంగం సిద్ధమైంది. ఈయన నిమామకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఈ నెల 24న తుది తీర్పు వెలువడనుంది. తీర్పు ఆయనకు వ్యతిరేకంగా రావడం ఖాయం కావడంతో రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ అంశంపై సోమవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిసినట్లు తెలిసింది.

సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్‌: ఎస్వీయూ వీసీగా ప్రొఫెసర్‌ వీవీఎన్‌ రాజేంద్రప్రసాద్‌ను నియమిస్తూ గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 3న అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. 4న ఆయన విధుల్లో చేరా రు. ఆయనకు అనుకూలమైన అప్పటి ఎస్వీయూ అధికారుల సహకారంతో 3వ తేదీన విధుల్లో చేరిన ట్లు జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి, హైకోర్టుకు చేరడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్వీయూ వీసీగా రాజేంద్రప్రసాద్‌ నియామకాన్ని తప్పుపట్టింది. ఈ నియామకంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సరైన వివరణ ఇవ్వలేకపోవడంతో ఈ కేసును ఈ నెల 24కు వాయిదా వేసింది. 24న తుది తీర్పు వెలువడనుంది. ఆయన తొలగింపు ఉత్తర్వులు లాంఛనమే.

గత ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇంగ్లిష్‌ విభాగంలో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందిన రాజేంద్రప్రసాద్‌ను నియమించింది. ఈయన ఇదివరకు ఎలాంటి పదవులూ చేపట్టలేదు. విభాగాధిపతిగా కూడా పనిచేయలేదు. అకడమిక్‌ పరంగా కూడా చెప్పుకోదగ్గ ట్రాక్‌ రికార్డు లేదు. వయసు రీత్యా కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి రెండేళ్ల పాటు ఇబ్బందులకు గురిచేసిన సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ సోదరుడు కావడంతో ప్రభుత్వం ఈయన్ను వీసీగా నియమించింది. ఈయన వీసీ పోస్టుకు దరఖాస్తు చేయకపోయినా సెర్చ్‌ కమిటీ సమావేశానికి రెండు రోజుల ముందు దరఖాస్తు తెప్పించుకుని పదవి కట్టబెట్టారు. ఈ నియామకం వెనుక మాజీ డెప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ ఆశీస్సులు కూడా ఉన్నాయి.

నియామక ప్రక్రియపై అనేక కేసులు
ఎస్వీయూ వీసీ నియామకానికి గత ఏడాది ఆగస్టులో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జనవరి మొదటివారంలో సెర్చ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సెర్చ్‌ కమిటీలో ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శి ఒక సభ్యుడిగా ఉండటం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఎస్వీయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పి. మునిరత్నం రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఫిబ్రవరి 4న తీర్పు ఇచ్చింది. ఎస్వీయూ, పద్మావతి, మరికొన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమించ వద్దని ఆదేశించింది. ఫిబ్రవరి 4న ఈ తీర్పు వస్తుందని భావించిన ప్రభుత్వం ముందు రోజు అర్ధరాత్రి ఈయన్ను వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే వీసీల నియామకం చేపట్టవద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. కానీ ఎస్వీయూ వీసీగా ఫిబ్రవరి 3న బాధ్యతలు చేపట్టినట్లు జాయినింగ్‌ రిపోర్ట్‌ సమర్పించారు.

కో వారెంటో..
హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఎస్వీయూ వీసీగా రాజేంద్రప్రసాద్‌ నియామాన్ని సవాల్‌ చేస్తూ ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరుతూ మార్చిలో ప్రొఫెసర్‌ మునిరత్నం రెడ్డి హైకోర్టులో కో వారెంటో వేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. హైకోర్టుకు వేసవి సెలవుల అనంతరం సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన హైకోర్టు వీసీ నియామకంలో గత  ప్రభుత్వం తప్పు చేసినట్లు గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు స్పష్టం కావడంతో ఎస్వీయూ వీసీ నియామకంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు హైకోర్టు గుర్తించడంతో వీసీని తొలగించే అవకాశాలున్నాయి.

ఎస్వీయూ వీసీ రాజీనామా ?
ఎస్వీయూనివర్సిటీ వీసీగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ వీవీఎన్‌ రాజేంద్రప్రసాద్‌ నియామకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, పదవిపోవడం దాదాపు ఖరారు కావడంతో ఆయన రాజీనామాకు సిద్ధమైనట్లు తెలిసింది. వారం తర్వాత హైకోర్టు తనను వీసీగా తొలగించే అవకాశం ఉండటంతో రాజీనామా చేసేందుకు  నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. సోమవారం ఆయన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిశారు. ఎస్వీయూ వీసీ పదవికి రాజీనామా చేసినట్లు ఎస్వీయూలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వీసీతో మాట్లాడేందుకు ‘సాక్షి’  పలుమార్లు ఫోన్‌ ద్వారా ప్రయత్నించింది. ఆయన స్పందించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement