బనగానపల్లె, న్యూస్‌లైన్ : మండలంలోని టంగుటూరు గ్రామ సమీపంలో ఉన్న నీటి కుంట శుక్రవారం రెండు నిండుప్రాణాలను బలిగొంది. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో తల్లి, కుమారుడి మృతదేహాలు నీళ్లలో కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. టంగుటూరులో నివసిస్తున్న ఖాజాహుస్సేన్ - షేక్ మారెంబీ దంపతులకు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు షేక్ నూర్‌బాష మానసిక వికలాంగుడు(వివాహంకాలేదు). మిగిలిన ఇద్దరు కుమారులు హుస్సేన్ బాషా, హుస్సేన్‌సాతోపాటు ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది.
అయినా వీరంతా కలిసిమెలసి ఉండేవారు. మానసిక వికలాంగుడైన షేక్ నూర్‌బాషాను అందరూ ప్రేమగా చూసుకునే వారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తల్లి షేక్‌మారెంబీ(50)తో కలిసి షేక్ నూర్‌బాషా(25) పశువులకు పచ్చగడ్డి కోసేందుకు పొలానికి వెళ్లాడు. చీకటిపడినా తల్లి, కుమారుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గ్రామంలో, పొలాల్లో వెతికారు. అయితే గ్రామ సమీపంలోని కుంటలో ఇద్దరి మృతదేహాలూ కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నందివర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పరీక్ష నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇద్దరిని మింగిన కుంట
Published Sun, Dec 15 2013 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement
Advertisement