
టీటీడీ ఈవో నియామకంపై కోర్టుకెళ్తా
టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్‌కుమార్ సింఘాల్ నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లనున్నట్లు విశాఖపట్నంలోని
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ధ్వజం
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్‌కుమార్ సింఘాల్ నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లనున్నట్లు విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ఈవోగా ఉత్తరాది వారిని నియమించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. టీటీడీ ఈవోగా వ్యవహరించిన సాంబశివరావును బదిలీచేయడం పనికిమాలిన ఆలోచనని, అసలు ఆయన్ను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు.
తెలుగు చదవడం రాని వారిని టీటీడీ ఈవోగా ఎలా నియమిస్తారని నిలదీశారు. టీటీడీ ఆగమాలపై అవగాహన లేనందువల్ల కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అనేక సమస్యలు వస్తాయన్నారు. ఈ అంశంపై తాను తప్పక న్యాయపోరాటం చేస్తానని స్వరూపానందేంద్ర స్వామి స్పష్టం చేశారు. రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల మండలిలో సభ్యులుగా నియమిస్తే టీటీడీకి నష్టం వాటిల్లుతుందని తెలిపారు.