జెడ్పీ పీఠానికి ‘స్వాతి రాణి’
Published Mon, Mar 17 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కుమార్తె స్వాతి రాణి జిల్లా పరిషత్ పదవికి పోటీ చేయడానికి తెలుగుదేశం అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంలో శోభా హైమావతి పంతం నెగ్గించుకున్నారు. ఆదివారం నాటి సమావేశంలో అశోక్‌గజపతిరాజు సమక్షంలో నిర్ణయించినట్లు తెలిసింది. అశోక్ చేసిన ప్రకటనతో స్వాతిరాణి రాజకీయ అరంగ్రేటానికి లైన్ క్లియర్ అయింది. విజయనగరంలో జరిగిన సమావేశంలో అశోక్ గజపతిరాజు పలువురి నేతలకు అభ్యంతరాలను అడిగారు. ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో ఆమె అభ్యర్థత్వానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.
ఎస్.కోట ఎమ్మెల్యే స్థానం ఆశించిన మాజీ ఎమ్మెల్యే హైమావతి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగేందుకు ఇప్పుడు ఏం చేస్తారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎలా పోటీ చేస్తారు? అన్న సందేహాలు మొదలయ్యాయి. దీంతో హైమావతి పొలిటికల్ కెరియర్‌పై సందేహాలు ముసురుకున్నాయి. వేపాడ నుంచి స్వాతిరాణి జెడ్పీటీసీగా పోటీ చేయాలని తీర్మానం చేసి పార్టీ అధిష్ఠానానికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ద్వారా పంపారు. మరో వైపు ఎస్.కోట నుంచి పోటీకి దింపాలని ఎమ్మెల్యే లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే హైమావతిలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తొలుత రెండు మండలాల నుంచి నామినేషన్ వేయాలని, తర్వాత అధిష్ఠానం సూచనల మేరకు ఎక్కడ నుంచి పోటీలో ఉండాలో తేల్చుకుంటారంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
శత్రుచర్లకు చెక్ చెప్పిన హైమ!
తొలుత తన కుమార్తె స్వాతిరాణికి అరుకు ఎంపీ టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ైహైమావతి పట్టుబట్టారు. గుమ్మడి సంధ్యారాణికి అరుకు పార్లమెంట్‌కు పోటీ చేయాలని చంద్రబాబు చెప్పినా సంధ్యారాణి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో స్వాతిరాణి అరుకులో ప్రచారం ప్రారంభించారు. తనకే అరుకు పార్లమెంట్ స్థానం కేటాయించాలని డి.వి.జి శంకరరావు అధిష్ఠానంపై ఒత్తిడి చేశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల బేరి మోగటం, జెడ్పీచైర్‌పర్సన్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వుడు కావడం, హైమావతికి పట్టున్న వేపాడ, ఎస్.కోట జెడ్పీటీసీ స్థానాలు ఎస్టీలకు కేటాయించడంతో శోభ మనసు మార్చుకున్నారు. శత్రుచర్ల ఆగమనాన్ని వ్యతిరేకించిన అశోక్‌తో స్వరం కలిపారు.
మాజీ మంత్రి శత్రుచర్ల తన మేనల్లుడు జనార్ధన్ థాట్రాజ్ కుటుంబీకులకు జెడ్పీ పీఠం ఇవ్వాలన్న డిమాండ్‌కు అడ్డుకట్ట వేశారు. ఎస్.కోట, వేపాడ మండలాల దేశం నేతలు స్వాతిరాణి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ఎమ్మెల్యే లలితకుమారిపై ఒత్తిడి పెంచేలా వ్యూహం పన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎమ్మెలే లలితకుమారి స్వాతిరాణి అభ్యర్థిత్వాన్ని బలపరిచేలా పావులు కదిపారు. జిల్లా నేతలను సైతం ఒప్పించడంతో శోభ వ్యూహం ఫలించింది. దీంతో హైమావతి శత్రుచర్లకు ఆదిలోనే చెక్ చెప్పారు.
Advertisement
Advertisement