
జిల్లా ప్రజలను స్వైన్‌ఫ్లూ భూతం వణికిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇంకా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దగ్గినా, తుమ్మినా ఈ వ్యాధి ఇతరుల నుంచి వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. చలికాలం ప్రారంభమవడంతో వ్యాధి వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఏ మాత్రం వ్యాధి లక్షణాలు ఉన్నా ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.
గుంటూరు మెడికల్: నవ్యాంధ్ర రాజధాని జిల్లా గుంటూరు ప్రజల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి భయం ప్రారంభమైంది. గుంటూరు జీజీహెచ్‌లో 2018 జనవరి నుంచి నవంబర్ 8వ తేదీ వరకు 50 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు అనుమానంతో పరీక్షలు చేయగా 14 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్థారించారు. ఇరువురు స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతూ మృతిచెందారు. గతేడాది 212 మందికి స్వైన్‌ఫ్లూ నిర్థారణ పరీక్షలు చేయగా 95 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. గతేడాది ఈ వ్యాధితో చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారు. స్వైన్‌ఫ్లూ అంటువ్యాధి కావటం , వ్యాధిసోకిన వ్యక్తి దగ్గినా తుమ్మినా రోగి నోటి తుంపర్ల ద్వారా, గాలి ద్వారా అతి వేగంగా వ్యాపించి ప్రాణాలను తీస్తున్న వైనంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
స్వైన్‌ఫ్లూ బాధితుల వివరాలు..
నరసరావుపేటకు చెందిన ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు అనుమానం వచ్చి సెప్టెంబర్ 30న గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించగా అక్టోబర్ 4న వ్యాధి ఉన్నట్లు నిర్థారించారు. నాటి నుండి వరుసగా కేసులు నమోదు అవుతూ ఉండటంతో జిల్లా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కొప్పురావూరుకు చెందిన ఓ వ్యక్తికి అక్టోబర్ 17న, రాజుపాలెంకు చెందిన ఓ వ్యక్తికి అక్టోబర్ 24న, గుండ్లపల్లికి చెందిన ఇద్దరు పిల్లలకు అక్టోబర్ 26న, అమరావతికి చెందిన ఓ వ్యక్తికి అక్టోబర్ 29న, పొన్నూరుకు చెందిన వ్యక్తికి, తొట్టెంపూడికి చెందిన మహిళకు అక్టోబర్ 30న, రేపల్లెకు చెందిన మహిళకు అక్టోబర్ 31న స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్థారించి వైద్యసేవలను అందిస్తున్నారు. నవంబర్ 3న హైదరాబాద్‌కు చెందిన మహిళకు, 5వ తేదీన గుంటూరు సంగడిగుంటకు చెందిన మహిళకు, మిన్నెకల్లుకు చెందిన వ్యక్తికి, 6వ తేదీన బాపట్లకు చెందిన మహిళకు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేశారు. అక్టోబర్ 8న ముగ్గురు అనుమానితులకు పరీక్షలు చేయగా వీరిలో ఒకరికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేశారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి కేసులు నమోదు అవ్వటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యాధి లక్షణాలు...
స్వైన్‌ఫ్లూ వ్యాధి ఎచ్1ఎన్1 వైరస్ పందుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా వారి నోటి నుంచి వెలువడే లాలాజల తుంపర్లు, ముక్కులోని స్రవాల ద్వారా ఇతర వ్యక్తులకు వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన వారిలో మొదట సాధారణ జ్వర ం, గొంతునొప్పి, తుమ్ములు, ముక్కు, కళ్ళ వెంట నీరుకారడం, ఒళ్ళునొప్పులు, విరోచనాలు తదితర లక్షణాలు ఉంటాయి. తరువాత దగ్గు ప్రారంభమై నీరసం, నిస్సత్తువ, వాంతులు, విరోచనాలు, శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి.
అందుబాటులో వ్యాక్సిన్లు, మందులు
స్వైన్‌ఫ్లూ రాకుండా నివారించేందుకు గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో 150 వ్యాక్సిన్లు, 250 మాస్క్‌లు అందుబాటులో ఉంచాం. బాధితులకు ఐసీయూలో ప్రత్యేక వైద్యసేవలను అందిస్తున్నాం. హార్ట్ ఫెయిల్యూర్, సీవోపీడీ, ఉబ్బసం, హెచ్‌ఐవి, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో, ఊపిరితిత్తుల వ్యాధులున్న వారిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు త్వరగా ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులకు వ్యాధి సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. దగ్గినా, తుమ్మినా రుమాలు ముఖానికి అడ్డుపెట్టుకోవాలి. చలికాలంలో వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి నెల వరకు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ దుళ్ళపల్లి సుధీన, ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment