
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు గ్రామానికి చెందిన టి. రాజశేఖర్‌రెడ్డి(28) స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో నవ్యాంధ్ర రాజధాని జిల్లా గుంటూరులో స్వైన్‌ఫ్లూ కలవరం ప్రారంభమైంది.వ్యాధి పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు. తొలుత రాయలసీమ జిల్లాలకే పరిమితమైన కేసులు నేడు రాజధాని జిల్లాలో కూడా నమోదవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యాధికారులు నిర్ధారణ చేయగా వారిలో ఒకరు మృతి చెందారు. ఇద్దరు చిన్నారులకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు అనుమానంతో గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో అడ్మిట్ చేసి వైద్య సేవల్ని అందిస్తున్నారు.
గుంటూరు మెడికల్: నవ్యాంధ్ర రాజధాని నగరం గుంటూరు నేడు వ్యాధులకు నిలయంగా మారుతోంది. ఈ ఏడాది మార్చిలో డయేరియా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి. సుమారు 2,400 మంది వ్యాధి బారిన పడగా 20 మందికి పైగా మరణించటం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం కలిగించింది. ఆగస్టులో కనీవిని ఎరుగని రీతితో డెంగీ కేసులు నమోదయ్యాయి. సుమారు 100 మంది వరకు వ్యాధి బారిన పడ్డారు. తాజాగా ఈనెలలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారణ చేయడంతో గుంటూరు ప్రజలు భయపడిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మాదిరిగా రాజధాని నగరంలో అధిక సంఖ్యలో జ్వరాలు నమోదు అవ్వడంపై సీఎం ఆగస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం బాధితుల వివరాలను అధికారులు బయటకు చెప్పకుండా దాచిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి జిల్లావ్యాప్తంగా మలేరియా 279 కేసులు నమోదు కాగా ఇందులో గుంటూరు పట్టణంలోనే 172 ఉన్నాయి. ఇక డెంగీ బాధితులు జిల్లావ్యాప్తంగా 87 కేసులు నమోదు కాగా గుంటూరు పట్టణంలో 42 ఉన్నాయి.
వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ
గుంటూరులో 2015లో స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులుగా 72 మందికి వైద్య పరీక్షలు చేయించగా 38 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. వీరిలో తొమ్మిది మంది చనిపోయారు. 2016లో స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులుగా 15 మందికి పరీక్షలు చేశారు. 2017లో జిల్లాలో 14 మందికి వ్యాధి సోకగా వారిలో ఆరుగురు వ్యాధి బారిన పడి మృతిచెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు గుంటూరు నగరానికి చెందిన వారే ఉండటంతో ప్రజలు స్వైన్‌ఫ్లూ పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా వారిలో ఒకరు గుంటూరు ఏటిఅగ్రహారానికి చెందిన డ్రైవర్‌గా వైద్యాధికారులు నిర్ధారించారు.
ఒకే కుటుంబంలో నలుగురికి డెంగీ లక్షణాలు
దుగ్గిరాల: డెంగీ లక్షణాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శుక్రవారం దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. స్థానిక జెండాచెట్టు ప్రాంతానికి తూములూరు నాగరాజు, ఈమని రాజ్యలక్ష్మి , ఈమని అభినయ్, ఈమని తనీష్‌లు దసరా సెలవులు కావడంతో మద్రాసు వెళ్లారు. సెలవులు ముగిసిన తర్వాత తిరిగి వచ్చారు. నలుగురికి జ్వరం రావడంతో తొలుత స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందారు. అభినయ్‌కి శుక్రవారం జ్వరం అధికం కావడంతో దుగ్గిరాల ప్రాథమి ఆరోగ్యకేంద్రానికి తీసుకువచ్చారు. వైద్యాధికారి కృష్ణవేణి నాలుగురికి వైద్య పరీక్షలు నిర్వíßహించి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు.
చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి
స్వైన్‌ఫ్లూ వైరస్‌ను పూర్తిగా నిరోధించే మందులు లేవు. చలికాలంలో వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం టామిఫ్లూ, రెలెంజా వంటి యాంటీ వైరల్ మందులు వాడుతున్నారు. ఇవి వైరస్ ఉధృతిని మాత్రమే తగ్గించగలవు. ఈ మందులు కూడా వ్యాధి సోకిన తొలిదశలోనే బాగా పనిచేస్తాయి. వ్యాధి సోకకుండా ప్రయాణాలు... ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలి. దగ్గినా, తుమ్మినా ముఖానికి కర్చీఫ్‌ను అడ్డుపెట్టుకోవాలి. మాస్క్‌లు ధరించటం ఉత్తమం. పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు బయటపడితే ఇంటికే పరిమితం అవ్వాలి. ఇతర కుటుంబ సభ్యులకు సోకుకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి విశ్రాంతి తీసుకుంటూ ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. వైద్యుని సలహా మేరకు మందులు వాడాలి.– డాక్టర్ నరేంద్ర వెంకటరమణ, ఫిజీషియన్, గుంటూరు
హోమియోతో డెంగీ, స్వైన్‌ఫ్లూకి చెక్
గుంటూరు మెడికల్ : హోమియో మందులతో స్వైన్‌ఫ్లూ, డెంగీ రాకుండా జాగ్రత్తపడొచ్చని ప్రభుత్వ హోమియో వైద్య నిపుణులు వెల్లడించారు. ముందస్తుగా మందులు మింగటం ద్వారా వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఆర్సినికాల్బ్ (30 పవర్) మూడు రోజులు మింగితే స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకదు. ప్రతిరోజూ ఉదయం ఒక్కపూట మాత్రమే మందులు మింగితే సరిపోతుంది. పదేళ్లలోపు పిల్లలకు మూడు మాత్రలు, పదేళ్లు దాటిన వారికి ఐదు మాత్రలు మింగితే చాలు. ఇపటోరియం పర్ఫరేట్ అనే మందు మూడు రోజులపాటు మింగితే డెంగీ దరి చేరదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలలో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. గుంటూరు బ్రాడీపేట ఒకలో లైన్‌లోని ప్రభుత్వ హోమియో వైద్యశాల, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, తాడికొండ, సింగంపాలెం, ఐనవోలు, జిల్లెల్లమూడి, దొండపాడు, పసుమర్రు, ముప్పాళ్ల , మన్నవ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలలో స్వైన్‌ఫ్లూ, డెంగీ జ్వరాల నియంత్రణ మాత్రలు అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment