విశాఖను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ
విశాఖపట్టణం: విశాఖపట్నం నగరంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే ఎనిమిది స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో విశాఖపట్నం విమానాశ్రయం, టూరిస్ట్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మే 1వ తేదీన 3 కేసులు నమోదయ్యాయి. 24 గంటలు గడవకముందే మరో 8 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కావడం వైద్య వర్గాల్లో కలవరం మొదలైంది.
ఇన్నాళ్లూ చిత్తూరు జిల్లాల్లో తీవ్రత ఉండేది. ఇప్పుడేమో విశాఖను వణికిస్తోంది. ఈనెల 1, 2వ తేదీల్లో స్వైన్‌ఫ్లూ బారిన పడ్డ మొత్తం 11 మంది వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని విశాఖపట్నం జిల్లా వైద్యాధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. బాధితుల నుంచి సేకరించిన రక్తనమూనాలు తిరుపతిలోని స్విమ్స్‌కు, ముంబయ్‌లోని ఎస్‌ఆర్‌ఎల్ ల్యాబొరేటరీలకు పంపించి స్వైన్‌ఫ్లూగా నిర్ధారించినట్టు గొల్లపూడిలో ప్రజారోగ్యశాఖ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.