ఏఎంసీలో సమీక్ష సమావేశంలో పాల్గొన్న వైద్యాధికారులు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): జిల్లాలో ఇప్పటివరకు 71 వరకు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.తిరుపతిరావు వెల్లడించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, వీరిలో 50 ఏళ్ల వయసు దాటిన వారు ఐదుగురు మరణించారని తెలిపారు. రోగుల నుంచి తీసిన శాంపిళ్లను కేజీహెచ్‌లోని మైక్రోబయాలజీ విభాగానికి పంపిస్తున్నామన్నారు. జిల్లాలోని 12 కేంద్రాల ద్వారా రోగులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అన్ని కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు తుమ్మినా, దగ్గినా కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇతర జిల్లాల నుంచి కూడా కేసులు ఇక్కడ నమోదవుతున్నాయన్నారు. ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్సు ప్రాంతాల్లో స్క్రీనింగ్‌క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. బస్టాండ్‌లలోని టెలివిజన్ల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నామన్నారు. సినిమా థియేటర్లలో ఇంకా ప్రచారం చేయడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
నేటి నుంచి పలకరింపు–2
డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు పలకరింపు–2 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. ఇందులో భాగంగా ఆశ, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, సాధికారమిత్రలు రోజుకు పది ఇళ్లకు వెళతారన్నా రు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పలకరింపు–1లో 15,813 పిల్లలకు టీకాలు వేశామని గుర్తు చేశారు. ఐదేళ్లలోపు వయసు గల పిల్లలకు టీకాలు, మొదటి 3 నెలల గర్భిణుల నమోదు, బాలింతల ఆరోగ్య పర్యవేక్షణ, నవజాత, బరువు తక్కువ గల పిల్లల ఆరోగ్య సంరక్షణ, టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు, జాగ్రత్తలు, స్వైన్‌ఫ్లూ, డెం గ్యూ, మలేరియా, వ్యాధి లక్షణాలు ఉన్నవారిని సకాలంలో గుర్తించి వైద్యం అందించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.
స్వైన్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండండి
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, కేజీహెచ్‌కు వచ్చిన 32 కేసుల్లో 21 స్వైన్‌ఫ్లూగా నిర్థారించబడిన నేపథ్యంలో వైద్యులంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.సుధాకర్ సూచించారు. ఆంధ్ర వైద్య కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు విషయాలు చర్చించారు. వైరాలజీ ల్యాబ్‌లో కేసులు పెండింగ్‌లో లేవని తెలిపారు. స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులకు అత్యవసర సేవలు అందించేందుకు వైద్యబృందం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెం ట్ జి.అర్జున, డీఎంహెచ్‌వో తిరుపతిరావు, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జి.సాంబశివరావు, ఏఎంసీ మెడిసిన్ శాఖ హెడ్, ప్రొఫెసర్ ఎ.కృష్ణమూర్తి, మైక్రో బయాలజీ శాఖ హెడ్, ప్రొఫెసర్ పి.అప్పారావు, స్వైన్‌ఫ్లూ నోడల్ అధికారి కె.రాంబాబు, డాక్టర్ ఎల్.కల్యాణప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment