
స్విస్ చాలెంజ్ భేష్
సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
సాక్షి, విజయవాడ బ్యూరో : స్విస్ చాలెంజ్ విధానాన్ని సుప్రీంకోర్టు అభినందించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. స్విస్ చాలెంజ్ అంటే తెలియనివాళ్లు దాని గురించి ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అమరావతి డెవలప్‌మెంట్ కంపెనీ కూడా ప్రభుత్వానిది కాదంటున్నారని, అవన్నీ చంద్రబాబు కంపెనీలంటున్నారని, అది వాళ్ల దౌర్భాగ్యమని అన్నారు. సీఎం బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి స్విస్ చాలెంజ్ నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచామన్నారు.
కాగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పార్లమెంట్‌లో పెట్టిన ప్రైవేట్ బిల్లుపై చంద్రబాబు స్పందిస్తూ... ఊరికే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ బిల్లు అంటే అభిప్రాయం చెప్పడానికి తప్ప ఉపయోగం ఉండదన్నారు.బిల్లు వల్ల లాభమేమిటని ప్రశ్నించారు. తెలంగాణతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించే విషయంలో గవర్నర్ ఏమీ చేయలేరని, ఆయన చేసేదేమీ ఉండదని తేల్చిచెప్పారు.
డ్యాష్‌బోర్డు ఎలా పనిచేస్తుందంటే
సాక్షి, హైదరాబాద్: సీఎం ఆఫీస్ రియల్ టైం ఎగ్జిక్యూటివ్ డ్యాష్‌బోర్డు ఎలా పనిచేస్తుంది? కమ్యూనిస్టు దేశాలు పెట్టుబడిదారి దేశాలుగా ఎలా మారాయి? మన దేశంతో రష్యా, చైనాల సంబంధాలు ఎలా ఉన్నాయి? రష్యా, చైనా దేశాల్లో నా పర్యటన ఎలా సాగిందంటే... అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ నేతలకు అవగాహన కల్పించారు. కాగా సీఎం చంద్రబాబు త్వరలో తైవాన్ దేశంలో పర్యటించనున్నారు.