మహిళల పట్ల టి-లాయర్ల అసభ్యప్రవర్తన: మోహన్రెడ్డి
హైకోర్టులో సీమాంధ్ర లాయర్ల మానవహారాన్ని తెలంగాణ న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని మాజీ అడ్వకేట్ జనరల్, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ అద్యక్షుడు సీవీ మోహన్రెడ్డి ఆరోపించారు. కేవలం తమను అడ్డుకోవాలన్న ఏకైక ఉద్దేశంతోనే వాళ్లు చలో హైకోర్టు కార్యక్రమం తలపెట్టారన్నారు. పోలీసులు కూడా తెలంగాణ న్యాయవాదులకు పూర్తిగా సహకరించారని, తమ కార్యక్రమానికి ముందస్తు అనుమతి ఉన్నా కూడా కావాలనే తమను అరెస్టు చేశారని అన్నారు.
తమను అడ్డుకునే క్రమంలో సీమాంధ్ర న్యాయవాదుల్లో ముగ్గురిని తెలంగాణ న్యాయవాదులు తీవ్రంగా గాయపరిచారని, మహిళా న్యాయవాదులని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. వాళ్లు తమపై దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని, హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడే ఇలాంటి దాడులు జరుగుతుంటే.. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీమాంధ్రుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగే సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికను విజయవంతం చేస్తామని మోహన్‌రెడ్డి తెలిపారు.