
విమానం.. గూడెం నుంచి పౌరయూనం!
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్: తాడేపల్లిగూడెం నుంచి ఆకాశయూనం చే యూలనే జిల్లా వాసుల ఆకాంక్షలు త్వరలోనే నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్కడి విమానాశ్రయూన్ని పునరుద్ధరించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాడేపల్లిగూడెం పట్టణం జిల్లాకు నడిబొడ్డున ఉండటం.. సీమాంధ్రకు చెందిన పూసపాటి అశోకగజపతిరాజు కేంద్ర పౌర విమానయూన శాఖ మంత్రిగా నియమితులు కావడం క లిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడి విమానాశ్రయూన్ని పునరుద్ధరించి పౌర విమాన యూనానికి త్వరలోనే అవకాశం కలుగుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి.
వైఎస్ హయూంలో టెండర్ల వరకూ వెళ్లినా...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయం పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. పనులకు సంబంధించి టెండర్లు కూడా పిలిచారు. 22 సంస్థలు టెండర్లు దాఖలు చేయగా, మైటాస్ సంస్థ పనులను దక్కించుకుంది. అయితే, సత్యం కంప్యూటర్స్‌లో తలెత్తిన సంక్షోభం కారణంగా పనులు మొదలు కాలేదు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో...
అనూహ్య పరిణామాల నడుమ ఇక్కడి విమానాశ్రయం పునరుద్ధరణ అంశం అప్పట్లో అటకెక్కింది. విమానయాన సేవలందించే కొన్ని సంస్థలు ముందుకొచ్చినా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ అంశం పెండింగ్‌లో ఉండిపోరుుంది. రాష్ట్ర విభజనకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ప్రజల ప్రయాణ అవసరాల కోసం సీమాంధ్ర ప్రాంతంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, పాత విమానాశ్రయాల పునరుద్ధరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జూన్ 2న ‘అపాయింట్ డే’గా ప్రకటించడంతో.. సీమాంధ్రలో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందులో విమానాశ్రయాల ఏర్పాటు, పునరుద్ధరణ వంటి అంశాలు కూడా ఉన్నాయి. దీంతో తాడేపల్లిగూడెంలో విమానాశ్రయ పునరుద్ధరణ ప్రాధాన్యతను సంతరించుకుంది. విమానాల రాకపోకలకు ఇది అనుకూలమని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి అధికారిక నివేదికలు వెళ్లాయి. తాజాగా కేంద్ర మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ బాధ్యతలను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అశోకగజపతిరాజుకు అప్పగించడంతో ఈసారి విమానాశ్రయ పునరుద్ధరణ దాదాపు ఖాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు బీజేపీకి చెందిన వ్యక్తి కావడం, కేంద్రంలోని అగ్రనాయకత్వంతో ఆయనకు సత్సంబంధాలు ఉండటం కూడా కలిసొచ్చేఅంశంగా చెబుతున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం నాటిది
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనిక కార్యకలాపాల కోసం తాడేపల్లిగూడెంలో సుమారు 650 ఎకరాల భూమిని సేకరించి విమానాశ్రయం నిర్మించారు. దీనిని ఒక్కసారి కూడా వినియోగించలేదు. అప్పటి నుంచి ఈ భూములన్నీ రక్షణ శాఖ అధీనంలోనే ఉండేవి. వీటిని పర్యవేక్షించడానికి విశాఖపట్నంలో ఎస్టేట్ ఆఫీసర్ ఉండేవారు. ఆ తరువాత విమానాశ్రయం పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ భూముల నిమిత్తం కోటి రూపాయల్ని కేంద్రానికి చెల్లించింది. దీంతో ఈ భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి దఖలుపడ్డాయి. అప్పటి నుంచి జిల్లా కలెక్టర్ కస్టోడియన్‌గా ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తున్నారు. గృహాలు, రహదారులు, వ్యవసాయ క్షేత్రాలు పోగా నికరంగా 250 ఎకరాలకు పైగా భూమి ఇక్కడ అందుబాటులో ఉంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఈ భూమి సరిపోతుందని గతంలో ఇక్కడ పలుమార్లు పర్యటించిన వైమానిక అధికారులు నివేదిక ఇచ్చారు.
ఈ విమానాశ్రయం నుంచి డొమెస్టిక్ (ప్రయూణికుల) సేవలతోపాటు, కార్గో (వస్తు) సేవలకు సైతం అనుకూలంగా ఉంటుందని సీహెచ్.శ్రీధర్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల వైమానిక బృందం ఇటీవల నివేదిక ఇచ్చింది. విమానాల రాకపోకలకు సంబంధించి వాతావరణ పరిస్థితుల విషయంలో విండ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా లభించింది. చెన్నైలోని విమానాశ్రయం రన్‌వే ఎలాంటి నాణ్యతా ప్రమాణాలతో ఉందో, ఇక్కడి విమానాశ్రయ రన్‌వేలో కూడా అదే నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయని తేల్చారు. రన్‌వేను 280 మీటర్ల మేర పెంచి, రన్‌వేపై స్పాంజ్ లేయర్ వేసి, సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే విమానాల రాకపోకలను సులభంగా సాగించవచ్చని స్పష్టం చేశారు.