ప్రాణం తీసిన కులాంతర వివాహం
రాచగూడిపల్లె (ఒంటిమిట్ట): మండలంలోని రాచగూడిపల్లె బీసీ కాలనీలో కూతురు కులాంతర వివాహం చేసుకుందని అన్నదమ్ముళ్లు అవమానించడంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాచగూడిపల్లె గ్రామానికి చెందిన గిరిజ నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. సంక్రాంతి పండుగ రావడంతో ఇంటి వద్దకు వచ్చి తల్లిదండ్రులను తమను ఇంట్లోకి రానివ్వాల్సిందిగా బ్రతిమలాడింది. గిరిజ తండ్రి రవి కూతుర్ని క్షమించి ఇంట్లోకి ఆహ్వానించారు.
అయితే రవి సోదరుడైన కృష్ణయ్య, అతని భార్య సుబ్బలక్షుమ్మలు కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావని అసభ్యకర పదజాలంతో దూషించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకానొక సందర్భంలో అతన్ని సోదరులు చితకబాదినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సోమవారం నుంచి వీరి వేధింపులు ఎక్కువ కావడంతో అవమానం భరించలేక విషద్రావం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని 108లో రిమ్స్‌కు తరలించే క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి కుమార్తె గిరిజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పెద్దఓబన్న తెలిపారు.