ప్రాణం తీసిన సెల్‌ఫోన్ సంభాషణ
♦ రైలు ఢీకొని పాలిటెక్నిక్ విద్యార్థిని మృతి
♦ మృతురాలు పేరాల వాసిగా గుర్తింపు
బాపట్లటౌన్ : సెల్‌ఫోన్ ఓ విద్యార్థిని ప్రాణాన్ని బలితీసుకుంది. రైలు ఢీకొని పాలిటెక్నిక్ విద్యార్థిని మృతిచెందిన సంఘటన బుధవారం పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని పేరాలకు చెందిన పి.నారాయణమూర్తి, తులసీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె పి.అపర్ణ(19) బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతుంది. కళాశాల నుంచి ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం స్నేహితులతో కలిసి ఉప్పరపాలెం గేటు సమీపంలోని పంచాయతీరాజ్ కార్యాలయానికి వెళ్లారు.
కార్యాలయంలో పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఉప్పరపాలెం గేటు మీదుగా రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ ట్రాక్ పక్కనే నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో నిజాముద్దీన్ నుంచి చెన్నై వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ విద్యార్థినిని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో అపర్ణ అక్కడికక్కడే మృతిచెందింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఫోన్ మాట్లాడుతూ రైలు వస్తుందనే విషయాన్ని గ్రహించదలేదని, లేకుంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు.