train collided
-
Italy:ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్,ఎక్స్‌ప్రెస్ రైళ్లు
రోమ్: ఇటలీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఉత్తర ఇటలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొలోగ్నా, రిమినీ స్టేషన్ల మధ్య ఒక హై స్పీడ్ రైలును మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 17 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ వేగంలో వెళ్తుండగా రెండు రైళ్లు ఢీకొట్టుకోవడంతో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని రైలు ఆపరేటర్ చెప్పారు. దేశ డిప్యూటీ పీఎం, రవాణా మంత్రి కూడా అయిన మాట్టే సాల్వినీ ఈ ప్రమాదంపై స్పందించారు. రైళ్లు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు చిన్న గాయాలే అయ్యాయని తెలిపారు. ఢీ కొట్టుకున్న రైళ్లలో హై స్పీడ్ రైలు ముందుభాగం నుజ్జునుజ్జవగా ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. -
పాట వింటూ.. ప్రాణాలే కోల్పోయాడు..
ధర్మవరం టౌన్: ఇయర్ ఫోన్ పెట్టుకుని ఎంచక్కా పాటలు వింటూ నడుస్తున్నాడు.. అంతలోనే రైలు పట్టాలు.. సంగీతాస్వాదనలో మైమరచిపోయిన ఆ యువకుడికి రైలు వస్తున్న శబ్ధం వినిపించలేదు. సరిగ్గా పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టి దుర్మరణం పాలయ్యాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పాతకుంట రైల్వేగేట్ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని జోగోనికుంటకు చెందిన రమణారెడ్డి, లక్ష్మీదేవిల కుమారుడు సాయికుమార్‌రెడ్డి(21). ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో కర్రీస్ తీసుకొచ్చేందుకని వెళ్లి ప్రమాదం బారినపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బయటకు వెళ్లిన సాయికుమార్ ఎంతకూ రాకపోవడంతో బంధువులు చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలో రైల్వే సిబ్బంది రాత్రి 12 గంటల ప్రాంతంలో పట్టాల వద్ద మృతదేహాన్ని గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడి చెవిలో ఇయర్‌ఫోన్ ఇరుక్కుపోయి ఉంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండున్నరేళ్లకే నూరేళ్లు..!
- ఆడుకుంటూ.. పట్టాలపైకి.. - రైలు ఢీకొని కవలలు మృతి కామారెడ్డి క్రైం: ఆడుకుంటూ తమకు తెలియకుండానే వారు వేసిన అడుగులు మృత్యువు వైపు నడిపించాయి. ఇంటికి సమీపంలోని రైలు పట్టాలపై ఆడుకుంటుండగా.. రైలు రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళిచింది. ముద్దుముద్దు మాటలతో సందడి అప్పటి వరకు సందడి చేసిన ఆ కవల చిన్నారులు విగత జీవులై కనిపించడం గ్రామస్తులను కలచివేసింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చిన ఈ ఘటన కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లిలో సోమవారం జరిగింది. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చందన భానుశ్రీ, చంద్రంలకు రెండున్నరేళ్ల క్రితం కవల పిల్లలు విద్వేశ్, విఘ్నేశ్‌లు ఉన్నారు. చంద్రం కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయమే పనిపై వెళ్లాడు. భానుశ్రీ ఏడు నెలల గర్భిణి. మధ్యాహ్నం 2 గంటల వరకు పడుకున్న పిల్లలు.. లేచి ఆడుకోవడానికి ఇంటి పక్కనే ఉన్న కొట్టం దగ్గరికి వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి సమీపంలోని రైలు పట్టాలపైకి చేరి ఆడుకోసాగారు. వీరి ఇల్లు గ్రామ శివారులో ఉండడంతో చిన్నారులు రైలు పట్టాలపై ఉన్న విషయాన్ని ఎవరూ గమనించలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ పట్టాలపై ఉన్న వీరిని ఢీ కొట్టింది. అయితే, పట్టాలపై పిల్లలను కొద్దిదూరంలో గమనించిన లోకోపైలట్ రైలును ఆపడానికి బ్రేక్ వేసినా ఫలితం లేకపోయింది. దీంతో కవలలు అక్కడికక్కడే మరణించారు. కవలల్లో ఒకరి మృతదేహం పట్టాల పక్కన పడిపోగా మరొకరి మృతదేహం తునాతునకలైంది. లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు çఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనాస్థలానికి వచ్చి బోరున విలపించారు. సంఘటనాస్థలాన్ని కామారెడ్డి రూరల్ ఇన్చార్జి సీఐ కోటేశ్వర్రావు, దేవునిపల్లి ఎస్సై సంతోష్‌కుమార్, రైల్వే పోలీసులు సందర్శించి, వివరాలు సేకరించారు. -
అస్సాంలో రైలు ఢీకొని 3 ఏనుగులు మృతి
గువాహటి: అస్సాంలోని నాగోన్ జిల్లాలో శనివారం పట్టాలు దాటుతున్న 3 ఏనుగులను రైలు ఢీకొనడంతో అవి చనిపోయాయి. వీటిలో ఒకటి గర్భంతో ఉండటం, దానిలోని బిడ్డ కూడా మృతిచెందడం స్థానికులను తీవ్ర దిగ్రా్బంతికి గురిచేసింది. కాంపూర్‌లోని పోటియాపామ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో రెండు ఏనుగులు అక్కడికక్కడే చనిపోగా మరొకటి గాయాలతో తరువాత కన్ను మూసింది. నిర్లక్ష్యంగా వ్యవహిరించిన రైల్వే శాఖపై కేసు నమోదుచేయాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ప్రమీలా రాణి అధికారులను ఆదేశించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో రైళ్ల వేగం గంటకు 15 కి.మీలకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. -
కొడుకుల్ని కాపాడి తండ్రి దుర్మరణం
రైలు ఢీకొని విద్యుత్ ఏఈ మృతి తెనాలి రూరల్: మృత్యువు ఎదురుగా దూసుకురావడంతో ఆ తండ్రి చివరి క్షణంలో బిడ్డల్ని కాపాడుకుని తాను ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన శనివారం గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన రెడ్డి రాంబాబు (37) విద్యుత్ శాఖలో తెనాలి రూరల్ ఏఈగా పనిచేస్తున్నారు. శనివారం తన ఇద్దరు బిడ్డలతో కలసి గ్రామ శివారులో ఉన్న పొలం వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేందుకు కొమ్మమూరు కాల్వపై ఉన్న వంతెనపై వస్తూ ఎదురుగా వస్తున్న రైలును చివరి క్షణంలో గమనించిన రాంబాబు మృత్యువు తప్పదనుకున్నాడు. బిడ్డలనైనా కాపాడాలనుకున్నాడు. ఒకరిని కాల్వలోకి నెట్టేసి, మరొకరిని పట్టాల పక్కకు తోసేశాడు. ఈ లోగా రైలు వచ్చి రాంబాబును ఢీకొట్టింది. ఈ సంఘటనలో అతను ప్రాణాలు వదిలాడు. -
రైలు ఢీకొని 40 గొర్రెలు మృతి
కర్నూలు: కర్నూలు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రైలు ఢీకొని 40 గొర్రెలు మృతి చెందాయి. పగిడిరాయి-ఉప్పర్లపల్లి స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రైలు పట్టాలపై గొర్రెలు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణం తీసిన సెల్‌ఫోన్ సంభాషణ
♦ రైలు ఢీకొని పాలిటెక్నిక్ విద్యార్థిని మృతి ♦ మృతురాలు పేరాల వాసిగా గుర్తింపు బాపట్లటౌన్ : సెల్‌ఫోన్ ఓ విద్యార్థిని ప్రాణాన్ని బలితీసుకుంది. రైలు ఢీకొని పాలిటెక్నిక్ విద్యార్థిని మృతిచెందిన సంఘటన బుధవారం పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని పేరాలకు చెందిన పి.నారాయణమూర్తి, తులసీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె పి.అపర్ణ(19) బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతుంది. కళాశాల నుంచి ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం స్నేహితులతో కలిసి ఉప్పరపాలెం గేటు సమీపంలోని పంచాయతీరాజ్ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఉప్పరపాలెం గేటు మీదుగా రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది. సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ ట్రాక్ పక్కనే నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో నిజాముద్దీన్ నుంచి చెన్నై వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ విద్యార్థినిని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో అపర్ణ అక్కడికక్కడే మృతిచెందింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఫోన్ మాట్లాడుతూ రైలు వస్తుందనే విషయాన్ని గ్రహించదలేదని, లేకుంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు.