సముద్రంలో వేట సాగిస్తున్న తమిళ స్టీల్ బోట్లు
సాక్షి, నెల్లూరు(ముత్తుకూరు) : జిల్లాలోని మత్స్యకారులకు సముద్రంలో చేపలు దొరకడం లేదు. తమిళనాడుకు సంబంధించి ఉక్కుతో తయారైన (స్టీల్) స్పీడ్ బోట్లు జిల్లా పరిధిలోని సముద్ర జలాల్లో దూకుడు ప్రదర్శించడం, ప్రాజెక్టుల నుంచి సముద్రంలో విడుదలయ్యే వ్యర్థ జలాల కారణంగా చేపల వేట సందిగ్ధంలో పడింది. దీంతో పడవలు, వలలు తీరానికే పరిమితమైపోయాయి.
తరచూ వచ్చి..
తమిళనాడులోని చెన్నై, పాండిచ్చేరి, నాగపట్నం ప్రాంతాల నుంచి 500 హెచ్‌పీ స్టీల్ బోట్లు తరచూ ఇక్కడి సముద్ర జలాల్లో ప్రవేశించి, భారీ వలలతో మత్స్యసంపదను కొల్లగొడుతున్నాయి. విలువైన వలలు నాశనం చేయడమే కాకుండా స్థానిక గంగపుత్రులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ పాలకులు ఈ సమస్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా, నిర్లక్ష్యం వహించడంతో తమిళ పడవలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇంజిన్ కలిగిన స్థానిక ఫైబర్ బోట్లు దూరంగా వెళ్లి వేట చేసే సామర్థ్యం, తమిళ మత్స్యకారులతో ఢీకొనే శక్తి లేకపోవడంతో నిస్సహాయులై గ్రామాలకే పరిమితయ్యారు.
బురదమయం
ప్రాజెక్టులు, పరిశ్రమల నుంచి నిత్యం వ్యర్థ, వేడి జలాలు సముద్రంలోకి విడుదలవుతున్నాయి. ఓడల రాకపోకలకు వీలుగా డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్ జరపడంతో జలాలు సహజత్వాన్ని కోల్పోతున్నాయి. తీరంలో జలాలు బురదమయమవుతున్నాయి. కనీసం రొయ్య పొట్టు కూడా లభించని దుస్థితి కొనసాగుతోంది. ఈ దురవస్థను అదుపుచేసే యంత్రాంగం కరువైంది. ఫలితంగా మత్స్యసంపద సహజ వనరులున్న చోటుకు తరలిపోయింది. సముద్రంలో 200 నాటికల్ మైళ్లకుపైగా ప్రయాణించి చొరబాటుదారుల ఉనికిపై దృష్టి సారించే కోస్టుగార్డులు తమిళ పడవల దూకుడుకు కళ్లెం వేసే పరిస్థితి లేకుండాపోయింది. మెరైన్ పోలీసులకు ఈ అధికారం ఉన్నా ఈ శాఖకు చెందిన మూడు పడవలు చెడిపోయి మూలనపడ్డాయి. వీటికి మరమ్మతులు చేయించి, గస్తీ నిర్వహించే అవకాశం మృగ్యమైంది. ఈ బలహీనతలు తమిళ బోట్లకు బలం చేకూర్చాయి.
పోర్టులో సుదీర్ఘ సమావేశం
కృష్ణపట్నం పోర్టులో ఈనెల 6వ తేదీన తమిళ స్పీడ్ బోట్ల దూకుడు, ఘర్షణ వాతావరణం నెలకొనడంపై మత్స్య శాఖ, మెరైన్ పోలీసు, పోర్టు సెక్యూరిటీ అధికారులు సుదీర్ఘంగా సమావేశం జరిపారు. పోర్టు పరిధిలోని 25 కిలోమీటర్ల మేరకు సముద్రంలో గస్తీ జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం పోర్టు రెండు బోట్లు సమకూర్చాలని కోరారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసి ఈ బోట్ల ద్వారా తడ నుంచి కావలి వరకు గస్తీ జరపాలని తీర్మానించారు. నెలకు పదిమార్లు గస్తీ జరిపి, తమిళ పడవలను నిరోధించాలని, అవసరమైతే వాటిని బంధించి, పెనాల్టీలు విధించాలని నిర్ణయించారు. అయితే, గస్తీకి అవసరమైన బోట్లు సమకూర్చే అంశం ప్రశ్నార్థకమైంది.
తమిళ పడవల దూకుడు అరికట్టాలి
తమిళనాడుకు చెందిన స్టీల్ పడవలు మన తీరంలోకి జొరబడి భారీ వలలతో చేపలు, రొయ్యలను పట్టుకుపోతున్నాయి. దీంతో మాకు చేపలు లభించని దుస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం ఈ దౌర్జన్యంపై దృష్టి పెట్టలేదు.
– బసవంగారి ఈశ్వరయ్య, మత్స్యకారుడు, నేలటూరుపాళెం
వ్యర్థ జలాలతో ముప్పు
చెన్నై పడవల సమస్యతో పాటు స్థానిక ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే కలుషిత నీటి వల్ల సముద్ర జలాలు పాడైపోతున్నాయి. దీంతో చేపలు, రొయ్యలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. – బుచ్చంగారి పోలయ్య, కృష్ణపట్నం ఆర్కాట్‌పాళెం
ప్రత్యేక దృష్టి సారించాం
జిల్లా పరిధిలోని సముద్ర జలాల్లోకి జొరబడే తమిళనాడు స్పీడ్ బోట్లపై మత్స్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సమస్యపై కృష్ణపట్నం పోర్టులో సమావేశం నిర్వహించాం. పలు నిర్ణయాలు తీసుకున్నాం. గస్తీ నిర్వహించేందుకు రెండు బోట్లు అవసరం. వీటికోసం ప్రయత్నిస్తున్నాం.
– షేక్ చాన్‌బాషా, ఏడీ, మత్స్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment