సముద్రంలో తమిళ బోట్లు
కావలి: సముద్రంలో చేపల వేట సాగించే తెలుగు – తమిళ మత్స్యకారుల నడుమ నిత్యం ఘర్షణలు చోటుచేసుకోవడం, బందీలుగా పట్టుకోవడం తీరంలో అలజడి సృష్టిస్తోంది. తాజాగా కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం పెద్ద పట్టపుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు గురువారం రాత్రి మూడు తమిళ బోట్లను అదుపులోకి తీసుకొని అందులో ఉన్న 19 మందిని బందీలుగా పట్టుకున్నారు. శుక్రవారం మరో తమిళ బోటును అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పెద్ద పట్టపుపాలెం మత్స్యకారులకు, తమిళ బోట్లలోని మత్స్యకారులకు గాయాలయ్యాయి. స్థానిక మత్స్యకారులు కావలిలోని ఆస్పత్రిలో చికిత్సపొందగా, తమిళ మత్స్యకారులు నెల్లూరులో చికిత్సలు పొందారు.
ఈ ఘర్షణలు, బందీలు ఎందుకంటే..
ఒడ్డు నుంచి సముద్రంలో 8 కిలోమీటర్ల వరకు మెకనైజ్డ్ బోట్లు చేపలు వేట చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. తీరం నుంచి 8 కిలోమీటర్ల అవతల ఉన్న సముద్రం భాగంలోనే వేట చేసుకోవాలని నిబంధన ఉంది. కానీ తమిళనాడుకు చెందిన మత్స్యకారులు తరచూ ఈ నిబంధనలను అతిక్రమిస్తుండడంతో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఈ మెకనైజ్డ్ బోట్లు కేవలం 18 మాత్రమే ఉన్నాయి. కానీ తమిళనాడులో వేల సంఖ్యలో ఈ రకం బోట్లు ఉన్నాయి. ఈ బోట్లతో సముద్రంలోకి చేపల వేటకు వెళితే నెల రోజులపాటు వేట సాగించడానికి అవసరమైన సామగ్రి, ఆహారం నిల్వ చేసుకునేందుకు వీలుంటుంది. తమిళనాడు ప్రాంతంలోని మత్స్యకారులు అధునాతన వలలు, సాంకేతిక పరిజ్ఞానంతో వేట సాగించడం ద్వారా ఒకేసారి టన్నుల కొద్ది మత్స్యసంపదను పట్టగలుగుతారు. ఈ క్రమంలో ఆ సముద్ర ప్రాంతంలో మత్స్యసంపద బాగా తగ్గిపోతోంది. దీంతో తమిళ మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్‌లోని సముద్ర తీరం వైపు వచ్చేస్తుంటారు. అందుకే సముద్రంపై తమిళ మత్స్యకారులు కనిపిస్తే చాలు తమ మత్స్య సంపదనంతా కొల్లగొడుతున్నారంటూ ఇక్కడి మత్స్యకారులు ఆవేదన చెందుతుంటారు. తమిళ మత్స్యకారులు కూడా సముద్రంలో తెలుగు మత్స్యకారులు వేసిన వలలను నష్టపరిచి కవ్వింస్తుంటారు. దీంతో ఘర్షణలు జరుగుతుంటాయి. ఇటీవలే వేట విరామం ముగిసి సముద్రంలో మత్స్యసంపద ఎక్కువగా ఉండడంతో తమిళ బోట్లు జిల్లాలోని సముద్ర తీర గ్రామాల వద్ద చేపల వేట సాగించడంతో మళ్లీ ఈ రగడ తలెత్తింది.
గతంలోనూ..
గతేడాది జూన్ 21న కావలి రూరల్ మండలం నందెమ్మపురంలో 7, తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెంలో 10, ఇందుకూరుపేట మండలం కృష్ణాపురంలో 14 మెకనైజ్డ్ బోట్లను జిల్లాలోని మత్స్యకారులు బందీ చేసి ఒడ్డుకు తరలించారు. అలాగే ఆ బోట్లలో కూలీలుగా ఉన్న 200 మంది మత్స్యకారులను కూడా బందీలు చేసి పట్టుకొని తమ గ్రామాలకు చేర్చారు. బందీలుగా ఉన్న మత్స్యకారులందరూ నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. గురువారం కావలి రూరల్ మండలం పెద్దపట్టపుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు బందీగా పట్టుకొన్న బోట్లు తమిళనాడులోని జిల్లా కేంద్రం నాగపట్నంలో రిజిస్టర్ అయినవిగా గుర్తించారు. అందులోని కూలీలు తమిళులని గుర్తించారు. సముద్రంపై చేపల వేట చేస్తున్న తమిళ మత్స్యకారులను వెళ్లిపోవాల్సిందిగా తెలుగు మత్స్యకారులు చెప్పినప్పటికీ వారు లెక్కచేయక కవ్వింపు చర్యలకు పాల్పడడంతో విడవలూరు మండలంలోని సముద్ర తీరం వరకు వెంబడించి బందీగా పట్టుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment