fish hunting
-
సముద్రంలో గల్లంతయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు సురక్షితం
సాక్షి, మచిలీపట్నం: చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు ఆచూకీ దొరికింది. అందరూ క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. వారంతా డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని కొత్తపాలెం తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల ఒకటో తేదీన మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేటకు చెందిన పలువురు మత్స్యకారులు నాలుగు బోట్లలో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారంతా తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది తీర ప్రాంతంలో ఉండగా ఓ బోటు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి, కదలక మొరాయించింది. బోటులో సాధారణ కీప్యాడ్ ఫోను మాత్రమే ఉంది. ఆ ఫోను చార్జింగ్ అయిపోవడంతో బోటులోని మత్స్యకారులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి మత్స్యకారుల ఆచూకీ లభ్యంకాక పోవటంతో ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు హెలికాప్టర్లతో ప్రత్యేక బృందాలు కాకినాడ సముద్ర పరిసర ప్రాంతాల్లో మంగళవారం నుంచి రేయంబవళ్లు గాలించాయి. మచిలీపట్నం నుంచి ప్రత్యేకంగా బోట్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. చదవండి: (చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం) -
వేట విరామానికి వేళాయె..
మచిలీపట్నం: సముద్రంలో చేపల వేటకు కొద్దిరోజులపాటు బ్రేక్ పడనుంది. సాగర గర్భంలో చేపలు పునరుత్పత్తి సమృద్ధిగా జరిగే సీజన్ ఇదే కావడంతో ఈ ఏడాదీ వేట నిషేధం అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈనెల 15 నుంచి జూన్ 14 వరకు 61రోజుల పాటు వేట నిషేధ కాలంగా మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం మొదలుకుని తిరుపతి జిల్లా వరకు 974 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో 1.60 లక్షల మంది మత్స్యకారులకు చేపల వేట వృత్తి కాగా, వీరి ద్వారా 6 లక్షల మంది జీవనోపాధికి సముద్రం భరోసాగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో గుర్తింపు పొందిన 30,107 మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు ద్వారా సముద్రంపై చేపల వేట సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిషేధ కాలంలో జీవనభృతి.. వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతి కల్పిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.4 వేలు మాత్రమే ఇచ్చేవారు. అది కూడా సకాలంలో ఇవ్వకపోగా, ఇచ్చిన డబ్బులు కూడా మత్స్యకారుల చేతికి వెళ్లకుండానే దళారులు మింగేసేవారు. కానీ, సీఎం వైఎస్ జగన్ జీవనభృతిని రూ.10 వేలుకు పెంచటమే కాక, డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తూ పారదర్శకత చాటుకున్నారు. రాష్ట్రంలో గతేడాది అర్హత గల వారు 97,619 మంది ఉండగా.. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.97.61 కోట్లును మత్స్యకారులకు భరోసాగా అందజేశారు. అర్హుల జాబితా తయారీ వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు జీవన భృతి అందించేందుకు అర్హులైన వారి జాబితాను సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వేట నిషేధ భృతి పొందాలంటే తప్పనిసరిగా బోటు రిజిస్ట్రేషన్ చేసుకుని.. మత్స్యకార సంఘంలో సభ్యుడై ఉండాలి. 18 నుంచి 60 ఏళ్లు మధ్య వయసు ఉండాలి. సోనా బోట్లకు 8 మంది, మోటార్ బోట్లకు ఆరుగురు, ఇంజిన్ తెప్పలకు ముగ్గురు మాత్రమే అర్హులు. ఇక జాబితాలో పేరులేని మత్స్యకారులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకంతో వలంటీర్ ద్వారా మత్స్యశాఖ సిబ్బందిని సంప్రదించాలి. సంప్రదాయ పడవలకు అవకాశం సంప్రదాయక పడవలు కలిగిన మత్స్యకారులు సముద్రం తీరానికి 8 కిలోమీటర్లలోపు, అనుమతించిన సైజు వలలతో చేపలు పట్టుకోవచ్చు. ఇందుకోసమని మత్స్యకారులు తగిన ఆధారాలతో అధికారులు నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. నిషేధం పక్కాగా అమలయ్యేలా తీర ప్రాంత పోలీసులు (మెరైన్), తీర ప్రాంత గస్తీ సిబ్బంది (కోస్ట్‌గార్డ్) చర్యలు తీసుకుంటున్నారు. నిషేధం పక్కాగా అమలు ఈ నెల 15 నుంచి సముద్రంపై మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేట నిషేధం పక్కాగా అమలుచేసేలా దృష్టిసారించాం. నిషేధాజ్ఞలు ఉల్లంఘించే బోటు యజమానులపై చర్యలు తీసుకుంటాం. నిషేధ కాలపు భృతికి అర్హులైన వారందరికీ మంజూరు చేసేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. – లాల్ మహమ్మద్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, కృష్ణా జిల్లా -
డ్రంక్ అండ్ డ్రైవ్... పడవ పల్టీ
బనశంకరి: రోడ్లపై వాహనదారులు మద్యం తాగి నడపడం తెలిసిందే. సముద్రంలో కూడా జాలర్లు మందు కొట్టి నడపడంతో పడవ పల్టీ కొట్టింది. ఈ సంఘటన కర్ణాటకలో మంగళూరు ఉళ్లాల కూడీ తీరంలో చోటుచేసుకుంది. ఉల్లాల అష్రాఫ్ అనే వ్యక్తికి చెందిన పడవ ఆదివారం వేకువజామున చేపల రేవు నుంచి అరేబియా సముద్రంలోకి వేటకు బయల్దేరింది. ఈ బోట్లో 10 మంది తమిళనాడుకు చెందిన మత్య్సకారులు ఉన్నారు. డ్రైవరుతో పాటు ఐదుగురు మద్యం తాగారు. డ్రైవర్ మత్తులో మరో వ్యక్తికి డ్రైవింగ్ అప్పగించాడు. ఈ గందరగోళంలో బోటు సముద్రం ఒడ్డుకు దూసుకొచ్చి రాళ్ల మధ్యలో ఒరిగిపోయింది. జాలర్లకు బయటకు వచ్చే మార్గం లేకపోగా, స్థానికులు ఉదయం గమనించి కాపాడారు. ఉళ్లాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. (చదవండి: 74 ఏళ్ల తర్వాత భారత్‌కి వస్తున్న చిరుత) -
ఏడుగురి ప్రాణాలు తీసిన సరదా
ప్రత్తిపాడు/పిడుగురాళ్లరూరల్(గురజాల)/చినగంజాం: ఈత సరదా వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ప్రాణం తీయగా.. చేపల వేట సరదా మరో ముగ్గురిని బలిగొంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన దుర్ఘటనల వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామం చిన్న మాలపల్లెకు చెందిన బొల్లా వర్థన్‌బాబు (18), నేలపాటి కోటేశ్వరరావు (15), బత్తుల సుధాకర్ (15)తో పాటు మరో ముగ్గురు యువకులు శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. కుంటలోకి దూకిన ముగ్గురు ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో మిగిలిన ముగ్గురు యువకులూ భయాందోళనకు గురై వెంటనే గ్రామస్తులకు సమాచారం అందజేశారు. ఎస్ఐ కృష్ణారెడ్డి కుంట వద్దకు చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. అలాగే పిడుగురాళ్ల పట్టణంలోని పీడబ్ల్యూడీ కాలనీకి చెందిన మస్తాన్ కుమారుడు యాసిన్ (12) ఈత కొడుతున్న సమయంలో నీటి గుంతలో ఇరుక్కుపోయి మృత్యువాత పడ్డాడు. ఇదిలా ఉండగా.. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన నలుగురు యువకులు శుక్రవారం సాయంత్రం రొంపేరు కాలువలో చేపల వేటకు వెళ్లగా.. వారిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మూలగాని వారిపాలెం రైల్వే స్టేషన్ సెంటర్‌కు చెందిన కోకి కాశిరెడ్డి (24), కుక్కలవారిపాలేనికి చెందిన కొణసం దుర్గారెడ్డి(27), వేటపాలెం మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన నంగు రమణారెడ్డి (23) కాలువలో దిగి కూరుకుపోయి మృత్యువాత పడగా.. మూలగాని వారిపాలెం గ్రామానికి చెందిన మూలగాని గోపిరెడ్డి ఒడ్డునే ఉండి ప్రాణాలతో బయటపడ్డాడు. (చదవండి: ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ) -
దసరా సరదా; మంత్రి అప్పలరాజు చేపల వేట
సాక్షి, శ్రీకాకుళం: నిత్యం సమీక్షలు.. సమావేశాలు. అడుగు తీసి అడుగు వేస్తే విన్నపాలు, విజ్ఞప్తులు. రాజకీయ నాయకుల జీవితం చాలా గజి‘బిజీ’గా ఉంటుంది. మంత్రుల గురించైతే చెప్పనక్కర్లేదు. దసరా నాడు మంత్రి సీదిరి అప్పలరాజు తన బాల్యాన్ని వెతుక్కున్నారు. ఎక్కడ తన ప్రస్థానం మొదలైందో మళ్లీ అక్కడకే వెళ్లి రిఫ్రెష్ అయ్యారు. తన చిన్ననాటి మిత్రులతో కలసి సరదాగా చేపలు పట్టి వారిలో ఆనందం నింపారు. తండ్రి, సోదరులతో వేట చేయాలని ఉన్నా నాడు బాల్యమంతా చదువు, ఆ తర్వాత వైద్య వృత్తి వల్ల సాకారం కానప్పటికీ.. ఇప్పటికి ఆయన చుక్కాని పట్టుకుని సంద్రంలోకి దిగారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని ఆయన స్వగ్రామం దేవునల్తాడలో దసరా రోజున సముద్ర తీరంలో కుటుంబ సభ్యులతో రోజంతా గడిపారు. తోటి మత్స్యకారులతో కలిసి వల వేసి చేపలు పట్టారు. సోదరుడు సీదిరి చిరంజీవి చేపల వేట సాగించే బోటుపై నడి సంద్రంలోకి వెళ్లారు. వల పట్టుకుని వృత్తిలో లీనమయ్యారు. 30 పనాల వరకు చేపలు చిక్కడంతో ఆయన ఆనందంతో ఎగిరి గంతేశారు. అనంతరం చేపలతో తీరానికి చేరుకున్న మంత్రి భావనపాడు తీరానికి సతీసమేతంగా వెళ్లి సముద్ర స్నానాలు చేశారు. (రాజధాని కోసం రాజీనామాకు సిద్ధం..) సతీ సమేతంగా బోటింగ్ చేస్తున్న మంత్రి అప్పలరాజు ఆ తర్వాత చిన్న నాటి స్నేహితులు తెరిపల్లి వరదరాజులు, సౌదాల వెంకన్న, సిరిగిడి వాసు, ఇతర కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా అక్కడే భోజనాలు చేసి గంగమ్మ తల్లి చెంతన సేదతీరారు. దసరా రోజంతా ఇలా మంత్రిగారు ఆటవిడుపు అందరినీ ఆనందానికి గురి చేసింది. రోజంతా నిరాడంబరంగా పండగను జరుపుకోవడంతో తోటి మిత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదో గొప్ప అనుభూతి... చాలా రోజులకు మళ్లీ చేపల వేటకు వెళ్లాను. ప్రధానంగా ఆటవిడుపు. కుటుంబం, స్నేహితుల మధ్య సరదాగా గడపడంతో బాల్యం గుర్తుకు వచ్చింది. ఇదో గొప్ప అనుభూతి. భావనపాడు ఫిషింగ్ హార్బర్లో ఎన్ని రకాల బోట్లు ఉన్నాయి. ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది అనేది పరిశీలించాను. కొత్త రకమైన వలలు ఎన్ని వచ్చాయి. అ వలల పనితీరు ఎలా ఉంది. వారి అవసరాలేంటి? అనేదానిపై అక్కడ ఉన్న మత్స్యకారులతో మాట్లాడాను. మత్స్యకారులకు ఉన్న పథకాల వివరించా. బోటింగ్ చేశాక రింగ్ వల పట్టుకుని సహచరులతో కలిసి చేపల ఎర కనిపించిన వెంటనే వల వేశాం. మత్స్యకారులకు హార్బర్ అవసరం, ఇంజిన్లు సరఫరా చేయాల్సిన అవసరాన్ని నేరుగా పరిశీలించడం ఒక అవకాశంగా భావిస్తున్నాను. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి -
టిట్‌టాక్ చేయడానికి చేపను మింగి..
సాక్షి, కర్ణాటక : హోసూరులో టిట్‌టాక్ వీడియో చేయడానికి ప్రాణంతో ఉన్న చేపలు మింగిన యువకుడు ఊపిరాడక మృతి చెందిన సంఘటన సంచలనం కలిగించింది. కృష్ణగిరి జిల్లా హోసూరు ఖాలేగుంట పార్వతినగర్‌కు చెందిన వెట్రివేల్ (22) కట్టడం మేస్త్రీ. అతనికి వివాహమై భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. గురువారం తన స్నేహితులతో కలిసి హోసూరు తెర్‌పేటలో ఉన్న చెరువు గట్టుకు చేపలు పట్టడానికి వెళ్లాడు. చదవండి: పురుగుల మందు తాగి టిక్‌టాక్ అక్కడ మద్యం తాగిన మత్తులో చేపలు పడుతున్నారు. ఆ సమయంలో టిక్‌టాక్ వీడియో చేయడానికి ఓ చేపను మింగాడు. ఆ చాప అతని శ్వాసనాళంలో తగులుకోవడంతో ఊపిరాడక అతను స్పృహతప్పి పోయాడు. ఇది చూసిన స్నేహితులు అతన్ని హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. హోసూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: పోలీస్ స్టేషన్లో పేకాట..! -
చేప చిక్కడంలేదు!
సాక్షి, నెల్లూరు(ముత్తుకూరు) : జిల్లాలోని మత్స్యకారులకు సముద్రంలో చేపలు దొరకడం లేదు. తమిళనాడుకు సంబంధించి ఉక్కుతో తయారైన (స్టీల్) స్పీడ్ బోట్లు జిల్లా పరిధిలోని సముద్ర జలాల్లో దూకుడు ప్రదర్శించడం, ప్రాజెక్టుల నుంచి సముద్రంలో విడుదలయ్యే వ్యర్థ జలాల కారణంగా చేపల వేట సందిగ్ధంలో పడింది. దీంతో పడవలు, వలలు తీరానికే పరిమితమైపోయాయి. తరచూ వచ్చి.. తమిళనాడులోని చెన్నై, పాండిచ్చేరి, నాగపట్నం ప్రాంతాల నుంచి 500 హెచ్‌పీ స్టీల్ బోట్లు తరచూ ఇక్కడి సముద్ర జలాల్లో ప్రవేశించి, భారీ వలలతో మత్స్యసంపదను కొల్లగొడుతున్నాయి. విలువైన వలలు నాశనం చేయడమే కాకుండా స్థానిక గంగపుత్రులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ పాలకులు ఈ సమస్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా, నిర్లక్ష్యం వహించడంతో తమిళ పడవలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇంజిన్ కలిగిన స్థానిక ఫైబర్ బోట్లు దూరంగా వెళ్లి వేట చేసే సామర్థ్యం, తమిళ మత్స్యకారులతో ఢీకొనే శక్తి లేకపోవడంతో నిస్సహాయులై గ్రామాలకే పరిమితయ్యారు. బురదమయం ప్రాజెక్టులు, పరిశ్రమల నుంచి నిత్యం వ్యర్థ, వేడి జలాలు సముద్రంలోకి విడుదలవుతున్నాయి. ఓడల రాకపోకలకు వీలుగా డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్ జరపడంతో జలాలు సహజత్వాన్ని కోల్పోతున్నాయి. తీరంలో జలాలు బురదమయమవుతున్నాయి. కనీసం రొయ్య పొట్టు కూడా లభించని దుస్థితి కొనసాగుతోంది. ఈ దురవస్థను అదుపుచేసే యంత్రాంగం కరువైంది. ఫలితంగా మత్స్యసంపద సహజ వనరులున్న చోటుకు తరలిపోయింది. సముద్రంలో 200 నాటికల్ మైళ్లకుపైగా ప్రయాణించి చొరబాటుదారుల ఉనికిపై దృష్టి సారించే కోస్టుగార్డులు తమిళ పడవల దూకుడుకు కళ్లెం వేసే పరిస్థితి లేకుండాపోయింది. మెరైన్ పోలీసులకు ఈ అధికారం ఉన్నా ఈ శాఖకు చెందిన మూడు పడవలు చెడిపోయి మూలనపడ్డాయి. వీటికి మరమ్మతులు చేయించి, గస్తీ నిర్వహించే అవకాశం మృగ్యమైంది. ఈ బలహీనతలు తమిళ బోట్లకు బలం చేకూర్చాయి. పోర్టులో సుదీర్ఘ సమావేశం కృష్ణపట్నం పోర్టులో ఈనెల 6వ తేదీన తమిళ స్పీడ్ బోట్ల దూకుడు, ఘర్షణ వాతావరణం నెలకొనడంపై మత్స్య శాఖ, మెరైన్ పోలీసు, పోర్టు సెక్యూరిటీ అధికారులు సుదీర్ఘంగా సమావేశం జరిపారు. పోర్టు పరిధిలోని 25 కిలోమీటర్ల మేరకు సముద్రంలో గస్తీ జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం పోర్టు రెండు బోట్లు సమకూర్చాలని కోరారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసి ఈ బోట్ల ద్వారా తడ నుంచి కావలి వరకు గస్తీ జరపాలని తీర్మానించారు. నెలకు పదిమార్లు గస్తీ జరిపి, తమిళ పడవలను నిరోధించాలని, అవసరమైతే వాటిని బంధించి, పెనాల్టీలు విధించాలని నిర్ణయించారు. అయితే, గస్తీకి అవసరమైన బోట్లు సమకూర్చే అంశం ప్రశ్నార్థకమైంది. తమిళ పడవల దూకుడు అరికట్టాలి తమిళనాడుకు చెందిన స్టీల్ పడవలు మన తీరంలోకి జొరబడి భారీ వలలతో చేపలు, రొయ్యలను పట్టుకుపోతున్నాయి. దీంతో మాకు చేపలు లభించని దుస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం ఈ దౌర్జన్యంపై దృష్టి పెట్టలేదు. – బసవంగారి ఈశ్వరయ్య, మత్స్యకారుడు, నేలటూరుపాళెం వ్యర్థ జలాలతో ముప్పు చెన్నై పడవల సమస్యతో పాటు స్థానిక ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే కలుషిత నీటి వల్ల సముద్ర జలాలు పాడైపోతున్నాయి. దీంతో చేపలు, రొయ్యలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. – బుచ్చంగారి పోలయ్య, కృష్ణపట్నం ఆర్కాట్పాళెం ప్రత్యేక దృష్టి సారించాం జిల్లా పరిధిలోని సముద్ర జలాల్లోకి జొరబడే తమిళనాడు స్పీడ్ బోట్లపై మత్స్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సమస్యపై కృష్ణపట్నం పోర్టులో సమావేశం నిర్వహించాం. పలు నిర్ణయాలు తీసుకున్నాం. గస్తీ నిర్వహించేందుకు రెండు బోట్లు అవసరం. వీటికోసం ప్రయత్నిస్తున్నాం. – షేక్ చాన్‌బాషా, ఏడీ, మత్స్య శాఖ -
వరి పొలంలో చేపల వేట
సాక్షి, వాజేడు : వరి పొలంలో చేపల వేట ఏమిటని అనుకుంటున్నారా ! అవునండి నిజమే. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోదావరి నీరు ఎగ పోటుతో పొలాల్లోకి చేరింది. వరద పెరిగే సమయంలో గోదావరి నుంచి చేపలు వస్తాయి. ములుగు జిల్లా వాజేడు మండల పరిధి కాచారం వద్ద పొలాల్లో రైతులు శుక్రవారం తోపెను వలతో చేపలు పట్టుకుంటుండగా ఆ దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. -
చేపను మింగాడు.. అది ప్రాణం తీసింది!
మనీలా: ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఊహించడం చాలా కష్టం. ఫిలిప్పీన్స్ నదిలో చేపలు పడుతూ ఓ వ్యక్తి అనుకోని ప్రమాదంలో మరణించాడు. 50 సంవత్సరాల ఆ వ్యక్తికి చేపలు పట్టడమే జీవనాధారం. చేపల వేటలో భాగంగా చేపను పట్టిన వెంటనే తన దంతాలతో నొక్కి పట్టుకోవడం అలవాటు. ఆ అలవాటే అతని ప్రాణాన్ని తీసింది. దంతాల మధ్య ఉంచుకున్న టిలాపియా రకం చేపను ప్రమాదవశాత్తు మింగడంతో శ్వాసరంధ్రాలు మూసుకుపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాధితున్ని స్థానికులు గుర్తించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. స్థానికుల వివరాల ప్రకారం బాధితుడు రోజర్ మార్సెలినోగా గుర్తించారు. గత నెల 29న సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని పురాతన ప్రావిన్స్ బుంగాసోంగ్ పట్టణంలో టాగుటుడ్ గ్రామం వద్ద నదిలో చేపలు పట్టడానికి వెళ్లినట్లు అతని కొడుకు తెలియజేశాడు. తన తండ్రికి చేపను పట్టిన వెంటనే దంతాల మధ్య ఉంచకోవడం అలవాటని, అయితే ఈసారి పొరపాటుగా చేపను మింగడంతో మరణించినట్లు తెలిపాడు. -
ఈ గుర్రమెందుకు‘రొయ్యో’..
చేపలు పట్టాలంటే ఏం కావాలి? ముందుగా ఓ వల.. ఆ తర్వాత పడవ.. కదా.. ఇదే ప్రశ్న.. బెల్జియంలోని ఓస్ట్‌డూన్‌కెర్క్‌కు వెళ్లి అడగండి.. ముందుగా ఓ వల.. ఆ తర్వాత గుర్రం అని సమాధానమిస్తారు.. గుర్రానికి చేపల వేటకు ఏం సంబంధం? ఉంది.. ఎందుకంటే.. ఇక్కడ గుర్రమెక్కే ష్రింప్స్(రొయ్యల్లాంటివి), చేపలను వేటాడతారు. గుర్రాలు దాదాపుగా నడుంలోతు మునిగేస్థాయి వరకూ సముద్రంలోకి వెళ్లి.. తిరిగి తీరం వైపు వస్తారు. వెనుక వైపు వల కట్టి ఉంటుంది. తీరానికి వచ్చాక.. అందులో చిక్కే ష్రింప్స్, ఇతర చేపలను అమ్ముకుంటారు. ష్రింప్స్‌తో చేసిన వంటకాలకు అక్కడ తెగ డిమాండ్ ఉంది.. 500 ఏళ్ల క్రితమైతే బెల్జియంతోపాటు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, దక్షిణ ఇంగ్లండులలో ఇలా గుర్రమెక్కే ష్రింప్స్‌ని వేటాడేవారు. అప్పట్లో అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే.. గుర్రమెక్కి చేపలు వేటాడుతున్న మత్స్యకారుల విగ్రహాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత తర్వాత ఆధునిక పద్ధతుల రాకతో ఈ తరహా విధానం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఓస్ట్‌డూన్‌కెర్క్‌లో మాత్రమే గుర్రమెక్కి చేపలను పట్టే మత్స్యకారులు ఉన్నారు. అదీ ఓ డజను కుటుంబాలు మాత్రమే. వారు కూడా పర్యాటకుల కోసం.. తమ సంప్రదాయాన్ని బతికించుకోవడం కోసం దీన్ని కొనసాగిస్తున్నారు. -
కబళించిన మృత్యువు
తూర్పు గోదావరి,నెల్లిపాక (రంపచోడవరం): సరదాగా చేపల వేటకు వెల్లిన ఇద్దరు బాలురిని మృత్యువు కబళించింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఎటపాక మండలం కన్నాయిగూడెం పంచాయతీ చెన్నంపేటలో తీరని విషాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండి వీరభద్రం, గుండి చినరాజు అన్నదమ్ముల పిల్లలు. వీరభద్రం పెద్ద కుమారుడు రామకృష్ణ(10), చినరాజు ఒక్కగానొక్క కుమారుడు సాయికిరణ్(13), కల్లూరి నవీన్ (17) కలిసి ఆదివారం ఉదయం.. చెన్నంపేట వద్ద గోదావరి, వాగు సంగమంలో చేపలు పట్టేందుకు గేలాలు తీసుకుని వెళ్లారు. వాగు దాటి అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు నవీన్.. రామకృష్ణ చేయి పట్టుకుని నీటి లోతును గమనిస్తూ మెల్లిగా వాగు దాటిస్తున్నాడు. ఈ క్రమంలో ఒడ్డున ఉన్న సాయికిరణ్ అకస్మాత్తుగా వారిద్దరి సమీపంలో నీటిలోకి దూకాడు. ఊహించని ఈ పరిణామంతో కంగారు పడిన నవీన్, రామకృష్ణ పట్టు తప్పి వాగులో మునిగిపోయారు. వారితోపాటు సాయికిరణ్ కూడా మునిగిపోయాడు. ఎట్టకేలకు యువకుడైన నవీన్ బయటపడి ఒడ్డుకు చేరాడు. రామకృష్ణ (10), సాయికిరణ్ (13) గల్లంతయ్యారు. దీంతో నవీన్ అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్లి సమీపంలోని కొందరికి విషయం తెలిపాడు. గ్రామంలోకి వెళ్లి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నగ్రామస్తులు వాగులో కొద్దిసేపు గాలించారు. చివరకు ఇద్దరు బాలుర మృతదేహాలను వెలికితీశారు. అన్నదమ్ములిద్దరూ అనుకోని రీతిలో వాగులో పడి మృతి చెందటంతో చెన్నంపేట గ్రామం విషాదంలో మునిగిపోయింది. రామకృష్ణ చంద్రంపాలెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. సాయికిరణ్ అదే పాఠశాలలో ఐదో తరగతి వరకూ చదివి గత ఏడాది నుంచి చదువు మానేశాడు. బిడ్డల మృతితో తల్లిదండ్రుల, బంధువులు బావురుమంటూ పెద్ద పెట్టున విలపించారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ నాయకులు రమేష్‌నాయుడు, బొజ్జయ్య, కడియం రామాచారి పరామర్శించి, రూ.6 వేల ఆర్థిక సాయం అందించారు. -
గంగపుత్రుల పంట పండింది
ఆకివీడు: ఉప్పుటేరులో చేపలు ఇబ్బడిముబ్బడిగా దొరుకుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కొల్లేరు తీర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వందలాది ఎకరాల చేపలు, రొయ్యల చెరువులు ఏకమైపోయాయి. చాలా చెరువులకు గండ్లు పడ్డాయి. కొన్ని చెరువుల గట్లపై రెండు మూడు అడుగుల ఎత్తున ఇంకా నీరు ప్రవహిస్తోంది. దీంతో చెరువుల్లోని చేపలు, రొయ్యలు వరదనీటికి కొట్టుకుపోతున్నాయి. ఆ నీరు కొల్లేరులోకి, అక్కడి నుంచి ఉప్పుటేరులోకి చేరుతోంది. నీటి ప్రవాహంతోపాటు చేపలు గుట్టలు గుట్టలుగా ఉప్పుటేరులోకి చొచ్చుకు వస్తున్నాయి. మత్స్యకారులు వల వేస్తే చాలు దండిగా చేపలు పడుతున్నాయి. దాంతో ఉప్పుటేరులో మత్స్యకారులు వందలాది పడవలు, దోనెలతో వలలు వేసి చేపల్ని పట్టుకుంటున్నారు. వంద గ్రాముల సైజు నుంచి కేజీ లోపు చేపలుఅధికంగా వలలకు చిక్కుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా కొట్టాడ, జంగంపాడు, పెదకొట్టాడ, పందిరిపల్లె గూడెం, దుంపగడప, సిద్ధాపురం, చినమిల్లిపాడు, పెదకాపవరం, గుమ్ములూరు, చినకాపవరం తదితర గ్రామాల నుంచి వందలాది మంది మత్స్యకారులు ఉప్పుటేరులో వేటాడుతున్నారు. రోజుకు వెయ్యి నుంచి రూ.3 వేల వరకూ విలువైన చేపల్ని వేటాడుతున్నట్లు కొందరు మత్స్యకారులు తెలిపారు. కిలో చేపలు రూ.30 ఉప్పుటేరులో వేటాడిన చేపల్ని కిలో రూ.30 లకు విక్రయిస్తున్నారు. ఉప్పుటేరు గట్టు వద్దే కాటా ఏర్పాటుచేసి తూకం తూస్తున్నారు. కొందరు పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఆకివీడులోని లాంచీల రేవు వద్ద హోల్‌సేల్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. మార్కెట్లో మరికొంత లాభానికి వాటిని అమ్ముకుంటున్నారు. ఉప్పుటేరు నిండా కొంగలు చేపలు దండిగా లభిస్తున్నందున ఉప్పుటేరు నిండా కొంగలు వాలుతున్నాయి. మూడు రోజులుగా ఉప్పుటేరు పొడవునా కొంగలు బారులుతీరి కనువిందు చేస్తున్నాయి. పదేళ్లకో పండుగ పదేళ్లకో పండుగ అన్నట్లుగా ఉంది మత్స్యకారులకు. చేపలు పట్టి జీవించే మత్స్యకారులు రోజంతా వేటాడినా గతంలో వలకు అరకొరగా చేపలు దొరికేవి. ఇప్పుడు దండిగా దొరుకుతున్నందున వారికి పండుగగా ఉంది. వేటాడిన చేపలు అమ్ముకుంటే ప్రస్తుతం వారికి కాసిన్ని డబ్బులు కనపడుతున్నాయి.– గాడి సంధాని, మత్స్యకారుడు, దుంపగడప -
భళా.. మీనరా'సి'
పశ్చిమ గోదావరి, నరసాపురం : నరసాపురం తీరంలో గత 15 రోజులుగా ముమర్మంగా వేట సాగుతోంది. వందల సంఖ్యలో మెకనైజ్డ్ బోట్లు, ఫైబర్‌బోట్లు వేట సాగిస్తున్నాయి. రాష్ట్రంలో విశాఖతీరంతో సహా ఎక్కడా లేని విధంగా స్థానికంగా మత్స్యసంపద దిగుబడి వస్తోంది. దీంతో ఇతర జిల్లాల నుంచి కూడా నరసాపురం తీరానికి బోట్లు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నాయి. విరామం లేకుండా వేట సాగిస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు గోదా వరి ద్వారా వచ్చి సముద్రంలో కలుస్తుండటంతో చేపలు పైకి ఎగబడుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యం లోనేసాధారణంకంటే ఎక్కువ మత్స్యసంపద ప్రస్తుతం దొరుకుతోందని అంటున్నారు. ఇది ప్రతీ ఏడాది కని పించే పరిస్థితే. అయితే ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో మత్స్యసంపద దొరుకుతున్నదని మత్స్యకారులు అంటున్నారు. గడిచిన 20 రోజుల్లోనే రూ. 400 కోట్ల విలువైన మత్స్యసంపద స్థానికంగా ఎగుమతి అయినట్టు అంచనా. కేంద్ర ప్రభుత్వం సముద్రంలో ప్రతీఏటా 61 రోజులపాటు వేట నిషేధాన్ని అమలు చేస్తుంది. జూన్ 15వ తేదీతో వేట నిషేధకాలం ముగిసింది. నిషేధం తరువాత గడిచిన నెలరోజుల్లో ఆశాజనకంగా వేట సాగుతోంది. మొన్నటి తుఫాన్ హెచ్చరిక తప్పస్తే ప్రకృతి కూడా వేటకు సహకరించడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి భారీగా బోట్లు బంగాళాఖాతానికి చేరువగా ఉండటంతో నరసాపురం తీరంలో నిత్యం వేట ముమ్మరంగా సాగుతుంది. ఇటు నరసాపురం మండలం బియ్యపుతిప్ప నుంచి అటు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద గోదావరి సముద్రంలో కలుస్తుంది. వర్షాలు భారీగా పడటంతో వరదదనీరు భారీగా సముద్రంలో కలుస్తోంది. దీంతో చేపలు ఎక్కువగా పడున్నాయి. దాటికి తోడు 61 రోజుల సుదీర్ఘవేట నిషేధకాలం తరువాత మత్స్యసంపద అపరిమితంగా లభ్యమవుతోంది. ఇక్కడ మత్స్యసంపద ఎక్కువగా దొరకడంతో ఇతర జిల్లాల నుంచి కూడా బోట్లు ఇక్కడికే చేరుకుంటున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు, విశాఖపట్టణం, ప్రకాశం జిల్లాలకు చెందిన బోట్లు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుని వేట సాగిస్తున్నాయి. ప్రస్తుతం రోజూ నరసాపురం తీరంలో 300 వరకూ బోట్లు వేట సాగిస్తున్నాయి. 20 రోజుల్లో రూ. 400 కోట్లపైనే వ్యాపారం గడిచిన 20 రోజుల్లో నరసాపురం తీరంలో రూ. 400 కోట్లు వరకూ వ్యాపారం సాగినట్టు అంచనా. సందువా, సొర, మాగ, పండుగొప్ప రకాల చేపలు, గుడ్డు పీతలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక టైగర్ రకానికి చెందిన రొయ్యలు దొరుకున్నాయి. ఈ రొయ్యలను సీడ్ ఉత్పత్తి నిమిత్తం ముంబాయ్, పూణేల్లోని పరిశోధనా కేంద్రాలకు పంపుతారు. దీంతో ఎగుమతిదారులు ఇటు నరసాపురం అటు అంతర్వేది రేవులకు చేరుకుని మత్స్యసంపదను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఇక స్థానికంగా అత్యంత డిమాండ్ ఉన్న పులసల జాడ కూడా కనిపిస్తుందని మత్స్యకారులు చెపుతున్నారు. -
తీరంలో అలజడి
కావలి: సముద్రంలో చేపల వేట సాగించే తెలుగు – తమిళ మత్స్యకారుల నడుమ నిత్యం ఘర్షణలు చోటుచేసుకోవడం, బందీలుగా పట్టుకోవడం తీరంలో అలజడి సృష్టిస్తోంది. తాజాగా కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం పెద్ద పట్టపుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు గురువారం రాత్రి మూడు తమిళ బోట్లను అదుపులోకి తీసుకొని అందులో ఉన్న 19 మందిని బందీలుగా పట్టుకున్నారు. శుక్రవారం మరో తమిళ బోటును అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పెద్ద పట్టపుపాలెం మత్స్యకారులకు, తమిళ బోట్లలోని మత్స్యకారులకు గాయాలయ్యాయి. స్థానిక మత్స్యకారులు కావలిలోని ఆస్పత్రిలో చికిత్సపొందగా, తమిళ మత్స్యకారులు నెల్లూరులో చికిత్సలు పొందారు. ఈ ఘర్షణలు, బందీలు ఎందుకంటే.. ఒడ్డు నుంచి సముద్రంలో 8 కిలోమీటర్ల వరకు మెకనైజ్డ్ బోట్లు చేపలు వేట చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. తీరం నుంచి 8 కిలోమీటర్ల అవతల ఉన్న సముద్రం భాగంలోనే వేట చేసుకోవాలని నిబంధన ఉంది. కానీ తమిళనాడుకు చెందిన మత్స్యకారులు తరచూ ఈ నిబంధనలను అతిక్రమిస్తుండడంతో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఈ మెకనైజ్డ్ బోట్లు కేవలం 18 మాత్రమే ఉన్నాయి. కానీ తమిళనాడులో వేల సంఖ్యలో ఈ రకం బోట్లు ఉన్నాయి. ఈ బోట్లతో సముద్రంలోకి చేపల వేటకు వెళితే నెల రోజులపాటు వేట సాగించడానికి అవసరమైన సామగ్రి, ఆహారం నిల్వ చేసుకునేందుకు వీలుంటుంది. తమిళనాడు ప్రాంతంలోని మత్స్యకారులు అధునాతన వలలు, సాంకేతిక పరిజ్ఞానంతో వేట సాగించడం ద్వారా ఒకేసారి టన్నుల కొద్ది మత్స్యసంపదను పట్టగలుగుతారు. ఈ క్రమంలో ఆ సముద్ర ప్రాంతంలో మత్స్యసంపద బాగా తగ్గిపోతోంది. దీంతో తమిళ మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్‌లోని సముద్ర తీరం వైపు వచ్చేస్తుంటారు. అందుకే సముద్రంపై తమిళ మత్స్యకారులు కనిపిస్తే చాలు తమ మత్స్య సంపదనంతా కొల్లగొడుతున్నారంటూ ఇక్కడి మత్స్యకారులు ఆవేదన చెందుతుంటారు. తమిళ మత్స్యకారులు కూడా సముద్రంలో తెలుగు మత్స్యకారులు వేసిన వలలను నష్టపరిచి కవ్వింస్తుంటారు. దీంతో ఘర్షణలు జరుగుతుంటాయి. ఇటీవలే వేట విరామం ముగిసి సముద్రంలో మత్స్యసంపద ఎక్కువగా ఉండడంతో తమిళ బోట్లు జిల్లాలోని సముద్ర తీర గ్రామాల వద్ద చేపల వేట సాగించడంతో మళ్లీ ఈ రగడ తలెత్తింది. గతంలోనూ.. గతేడాది జూన్ 21న కావలి రూరల్ మండలం నందెమ్మపురంలో 7, తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెంలో 10, ఇందుకూరుపేట మండలం కృష్ణాపురంలో 14 మెకనైజ్డ్ బోట్లను జిల్లాలోని మత్స్యకారులు బందీ చేసి ఒడ్డుకు తరలించారు. అలాగే ఆ బోట్లలో కూలీలుగా ఉన్న 200 మంది మత్స్యకారులను కూడా బందీలు చేసి పట్టుకొని తమ గ్రామాలకు చేర్చారు. బందీలుగా ఉన్న మత్స్యకారులందరూ నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. గురువారం కావలి రూరల్ మండలం పెద్దపట్టపుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు బందీగా పట్టుకొన్న బోట్లు తమిళనాడులోని జిల్లా కేంద్రం నాగపట్నంలో రిజిస్టర్ అయినవిగా గుర్తించారు. అందులోని కూలీలు తమిళులని గుర్తించారు. సముద్రంపై చేపల వేట చేస్తున్న తమిళ మత్స్యకారులను వెళ్లిపోవాల్సిందిగా తెలుగు మత్స్యకారులు చెప్పినప్పటికీ వారు లెక్కచేయక కవ్వింపు చర్యలకు పాల్పడడంతో విడవలూరు మండలంలోని సముద్ర తీరం వరకు వెంబడించి బందీగా పట్టుకొచ్చారు. -
చేపల వేటకు వెళ్లి..
జన్నారం(ఖానాపూర్) : మరో రెండు రోజుల్లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కోచింగ్ వెళ్లే యువకున్ని విద్యుత్ షాక్ రూపంలో మృత్యువు కబలించింది. ఎదిగిన కొడుకు కుటుంబ బరువు మోస్తాడనే సమయంలో మృత్యువాత పడటంతో ఆ కుటుంబం రోదన మిన్నంటింది. శనివారం జరిగిన ఘటన వివరాలను లక్సెట్టిపేట్ సీఐ శ్రీనివాస్, జన్నారం ఎస్సై ఫరీద్ వివరించారు. మండలంలోని మొర్రిగూడ గ్రామానికి చెందిన లావుడ్యా కిషన్‌నాయక్, యశోదబాయిలకు ఒక కుమారుడు, ఒక్క కూతురు. కుమారుడు సుమన్(23) గత సంవత్సరం డిగ్రీ పూర్తి చేశాడు. శనివారం ఉదయం స్నేహితులు నవీన్, మధు, సురేందర్, రాజు, శ్రీనుతో కలిసి సరదాగా చేపలు పట్టేందుకు సమీపంలోని బద్దుబాయి పొలంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. కర్రకు కరెంటు తీగలు అమర్చి నీటిలో పెట్టి చేపలు చనిపోగానే బయటకు తీస్తారు. ఈ క్రమంలో తీగలు నీటిలో వేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోతూ కుడిచేతితో వైర్‌ను పట్టుకున్నారు. దీంతో షాక్ తగిలి అక్కడ సృహ కోల్పోయి పడిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే జన్నారం ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి తల్లిదండ్రులతోపాటు అక్క ఉంది. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాస్, ఎస్సై ఫరీద్‌లు పరిశీలించారు. మృతుడి తండ్రి కిషన్‌నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కోచింగ్ వెళ్దామనుకుని.. ఇటీవల ప్రభుత్వం కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని కోచింగ్ వెళ్లాలనుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడానికి మాట్లాడుకున్నాడు. అయితే రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం కోచింగ్ వెళ్దామని ఆగాడు. రోజు క్రికెట్ ఆడుకునే కొడుకు ఈ రోజు చేపలకని పోయి కానరాని లోకాలకు వెళ్లాడని కుటుంబీకులు రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. -
నదిలోని చేప ‘మనది’ కావాల్రా అబ్బీ!
మామిడికుదురు (పి.గన్నవరం): అందరికీ దప్పిక తీర్చే నీరు వారికి.. అన్నం పెట్టే పెన్నిధి కూడా! అమ్మ ఒడిలో పారాడే బిడ్డల్లా వారు.. వారు నదిలో వేట సాగిస్తారు. రేయైనా, పగలైనా తన ప్రయాణానికి ఏ దిక్సూచీ అవసరం లేని నదిలాగే.. ఆ నది కడుపులో చేపలను అన్వేషించే వారి వేటకూ, వలలకూ కూడా వేళలతో, వాతావరణంతో పని లేదు. చిక్కని చీకటి రాత్రయినా, దట్టమైన మంచు కమ్ముకున్న వేకువనైనా.. గంగపుత్రుల వేటకు ఆటంకం ఉండదు. అందరూ కప్పుకున్న దుప్పట్లను వీడి, తల బయటకు పెట్టడానికి కూడా ఇష్టపడని వేళ.. ఇదిగో ఇక్కడ ఇద్దరు మత్స్యకారులు కమ్ముకున్న మంచుకు అణుమాత్రం ‘చలి’ంచకుండా వేట సాగిస్తున్నారు. ఒక వృద్ధుడు సారథిలా నావకు తెడ్డు వేస్తుంటే, నడివయస్కుడొకరు యోధునిలా వల విసురుతున్నారు. వైనతేయ గోదావరి నదీతీరంలో గురువారం వేకువన పెదపట్నంలంక వద్ద ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన జీవన ‘చిత్రం’ ఇది. మన కంటికి పసందైన ఈ దృశ్యం.. నది కడుపున వెతికే వారి వల కన్నులకు చేపలు కంటబడి, పట్టుబడితేనే వారి కృషి ఫలించినట్టవుతుంది. -
ప్రాణం తీసిన సరదా...
కాటేదాన్: చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో మునిగి మృతిచెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై నాగాచారి తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో చింతల్మెంట్ ప్రాంతానికి చెందిన సయ్యద్‌బాబు(20). ఆదివారం కావడంతో సరదాగా చేపలు పట్టేందుకు లక్ష్మీగూడ వాంబేకాలనీలోని కొత్త చెరువుకు వచ్చాడు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. అతనితో పాటు వచ్చిన స్నేహితులు బాబు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. గట్టుపై బాబు చెప్పులను గ్రహించిన స్నేహితులు చెరువులో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బాబు మృతదేహాన్ని వెలికితీసేందుకు రాత్రి 7 గంటల వరకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చేపలకు షాక్.. వేట చూస్తే షేక్
విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని పలు గ్రామాల గిరిజనులు ప్రమాదకర స్థితిలో విద్యుత్ వైర్లతో చేపల వేట సాగిస్తున్నారు. మండలంలోని సురాపాడు ఆనకట్ట, అడారు కాలువ వద్ద గురువారం ఈ దృశ్యం ‘సాక్షి’ కంటపడింది. అక్కడున్న విద్యుత్‌స్తంభాల వైర్లకు జీఐ వైరు(ఇనుము)ను కర్రతో తగిలించి కాలువ, ఆనకట్ట మధ్యలో కొంతదూరం పాటు మరికొన్ని కర్రలను ఏర్పాటు చేశారు. వాటికి జీఐవైరు ద్వారా విద్యుత్ సరఫరా అందేలా చేశారు. దీంతో విద్యుత్‌సరఫరా ఉన్న వైరుకు తగిలిన చేపలు షాక్‌కు గురవుతుండడంతో వాటిని పడుతున్నారు. ప్రమాదకరమైన ఈ వేటపై అధికారులు దృష్టిసారించాల్సి ఉంది. - మక్కువ -
కోస్తాలో కుండపోత
* ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వానలు * చింతూరులో 26, విశాఖలో 17 సెం.మీల వర్షపాతం * అధికారులు అప్రమత్తం.. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు సాక్షి నెట్వర్క్: కోస్తా జిల్లాలను వర్షం ముంచెత్తుతోంది. రుతుపవనాలకు, అల్పపీడనం తోడు కావడంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గత రెండురోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు కాగా అనేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. శుక్రవారం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మరో రెండురోజులు భారీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి. పలు జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 233.8 మి.మీలు వర్షం కురవగా, శనివారం 734 మి.మీల వర్షపాతం నమోదయ్యింది. విశాఖపట్నం జిల్లాలో మూడురోజుల నుంచి కరువు తీరా వర్షం కురుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విశాఖలో 17 సెం.మీల భారీ వర్షపాతం నమోదయింది. అత్యధికంగా చింతూరులో 26 సెం.మీ నమోదైంది. ఆచూకీ లేకుండా పోయిన 24 పడవలు తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 4 రోజుల క్రితం 161 మంది మత్స్యకారులతో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 23 బోట్ల ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు శనివారం కాకినాడలో మత్స్యకార నాయకులు, బోట్లు యజమానులు, అధికారులతో చర్చించారు. ఇదే విధంగా కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారుల, నెల్లూరు జిల్లాకుచెందినవారు మరో ఆరుగురు గల్లంతయ్యారు. -
రాజుగారి చేప రుచులు
అనగనగా ఓ రామరాజు. ఆయన చేపల వేటకైతే వెళ్లలేదు గానీ, చేపల వంటకాల్లో మాత్రం నలభీముల వారసుడే! ఆయన వండి వడ్డించే చేపలతో పాటు ఇతర వంటకాల రుచులకు ఎంతటెంతటి వారైనా దాసోహం కావాల్సిందే. రామరాజు వంటకాలను ఆరగించే వారిలో తొంభై శాతానికి పైగా వీఐపీలే ఉంటారంటే, ఆయన రేంజ్ ఏమిటో ఊహించవచ్చు. చేపలలోనే రాజా చేపగా ప్రసిద్ధి పొందిన పులస చేపతో వంటకాలు చేయడంలో రామరాజు నైపుణ్యం అనితరసాధ్యం. ఆయన వండే పులస వంటకాల గుబాళింపుల మాదిరిగానే ఆయన పేరుప్రఖ్యాతులు ఖండాంతరాలకు విస్తరించాయి. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, కేంద్ర మాజీ మంత్రులు గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, చిరంజీవి సహా పలువురు కేంద్ర నాయకులు, సినీ దర్శకుడు రాజమౌళి, హీరోలు ప్రభాస్, మోహన్‌బాబు వంటి వారు రామరాజుకు రెగ్యులర్ కస్టమర్లు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఫరూక్ అబ్దుల్లా ఇక్కడి స్టార్ హోటల్లో బసచేసినా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న రామరాజు వంటకాలను ప్రత్యేకంగా తెప్పించుకుని మరీ ఆరగిస్తారు. వీఐపీలే కాదు, నగరంలోని కొందరు రెస్టారెంట్ల యజమానులు సైతం రామరాజు వంటకాలను ప్రత్యేకంగా తెప్పించుకుని ఆరగించడం విశేషం. గోదావరి నుంచి.. పశ్చిమగోదావరి భీమవరానికి చెందిన రామరాజు దాదాపు పాతికేళ్ల కిందట నగరానికి వచ్చి స్థిరపడ్డారు. ఇరవెరైండేళ్లుగా తనకు నైపుణ్యంగల పాకకళనే ఉపాధిగా చేసుకున్నారు. ఇంట్లోనే ప్రత్యేకంగా వంటలు చేసి, ఆర్డర్లపై సరఫరా చేస్తుంటారు. తొలినాళ్లలో నగరంలోని బడా బడా పారిశ్రామికవేత్తలకు ఈ వంటకాలను సరఫరా చేశారు. వంటకాల రుచి అమోఘంగా ఉండటంతో అనతికాలంలోనే రామరాజు ప్రాచుర్యం పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చే రాజకీయ నాయకులు, సెలిబ్రిటీలకు సైతం వంటకాలు సరఫరా చేయడం మొదలైంది. ప్రాచుర్యం పెరగడంతో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్స్ రాసాగాయి. కొందరు సెలిబ్రిటీలు ఎక్కడ ఉన్నా రామరాజు వంటకాలను ఆర్డర్ చేయించుకుని తెప్పించుకుంటుంటారు. రామరాజు వద్ద వారానికి రెండు మూడుసార్లయినా ఫిష్ పాంఫ్రెట్స్ తీసుకుంటుంటాను. మా ఆవిడకీ ఈ వంటకాలు చాలా ఇష్టం. నాలుగేళ్లుగా ఈ రుచులు ఆస్వాదిస్తున్నాను. రామరాజు వంట ఒకసారి అలవాటైతే వదులుకోవడం తేలికకాదు. -శ్రీను వైట్ల, సినీ దర్శకుడు ఇవీ స్పెషాలిటీ వంటకాలు.. పులస చేప ఇగురు, పీతల వేపుడు, పప్పుచారు కోడిపలావు, నాటుకోడి-పీతలు-రొయ్యల మిక్స్డ్ పలావు వంటివి రామరాజు స్పెషాలిటీ వంటకాలు. వంటకాల్లో వెన్నపూస, గసగసాల ముద్ద, బజ్జీ మిర్చి, బెండకాయలు వంటివి ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. పదిహేనేళ్లుగా రామరాజు రుచులను ఆస్వాదిస్తూనే ఉన్నాను. నా ఆరోగ్యానికి రామరాజు వంటకాలు కూడా ఒక కారణమేననుకుంటాను. ఆరోగ్యకరంగా వంటకాలు వండటంలో రామరాజు సిద్ధహస్తుడు. - శ్రీనివాసరెడ్డి, సినీ దర్శకుడు - శిరీష చల్లపల్లి -
ఉసురు తీసిన రాకాసి అల
పూండి, న్యూస్‌లైన్: చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఓ మత్స్యకారుడు రాకాసి అల తాకిడికి తెప్ప తిరగపడడంతో మృత్యువాతపడగా మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు ఇవీ... వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట పంచాయతీ పరిధి దిబ్బవానిపేటకు చెందిన గుంటు లింగరాజు(45) అడ్ల సోమేష్, డి.నారాయణతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లాడు. వేటకు వెళ్లిన అరగంటకే ఓ రాకాసి అల ఉవ్వెత్తున ఎగిసిపడడంతో తెప్ప బోల్తాపడింది. దీంతో లింగరాజు తెప్ప కింద చిక్కుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. ఆయనకు భార్య కాంతమ్మ, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చేపల వేటపై ఆధారపడి జీవించే ఇంటి పెద్దదిక్కు తిరిగి రాని లోకాలకు పోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వీఆర్వో కె.ఇందిరాప్రియదర్శిని ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు తీరంలోనే శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ పి.జోగారావు చెప్పారు. ఇదిలా ఉండగా మత్స్యశాఖ ద్వారా మృతుని కుటుంబానికి *2 లక్షలు సహాయం అందించి ఆదుకుంటామని ఎఫ్‌డీవో కె.శ్రావణి చెప్పారు. దస్త్రాలన్నీ సకాలంలో అందిస్తే తొలి విడతలో *లక్ష, ఆ తర్వాత మరో *లక్ష అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లింగరాజు కుటుంబానికి ఆపద్భందు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆదుకోవాలని సర్పంచి గోవింద పాపారావు, మాజీ సర్పంచి ఎ.రాజులు తదితరులు కోరారు.