గిలకలదిండి ఫిషింగ్ హార్బర్‌లో లంగరు వేసిన బోట్లు
మచిలీపట్నం: సముద్రంలో చేపల వేటకు కొద్దిరోజులపాటు బ్రేక్ పడనుంది. సాగర గర్భంలో చేపలు పునరుత్పత్తి సమృద్ధిగా జరిగే సీజన్ ఇదే కావడంతో ఈ ఏడాదీ వేట నిషేధం అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈనెల 15 నుంచి జూన్ 14 వరకు 61రోజుల పాటు వేట నిషేధ కాలంగా మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం మొదలుకుని తిరుపతి జిల్లా వరకు 974 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో 1.60 లక్షల మంది మత్స్యకారులకు చేపల వేట వృత్తి కాగా, వీరి ద్వారా 6 లక్షల మంది జీవనోపాధికి సముద్రం భరోసాగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో గుర్తింపు పొందిన 30,107 మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు ద్వారా సముద్రంపై చేపల వేట సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నిషేధ కాలంలో జీవనభృతి..
వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతి కల్పిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.4 వేలు మాత్రమే ఇచ్చేవారు. అది కూడా సకాలంలో ఇవ్వకపోగా, ఇచ్చిన డబ్బులు కూడా మత్స్యకారుల చేతికి వెళ్లకుండానే దళారులు మింగేసేవారు. కానీ, సీఎం వైఎస్ జగన్ జీవనభృతిని రూ.10 వేలుకు పెంచటమే కాక, డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తూ పారదర్శకత చాటుకున్నారు. రాష్ట్రంలో గతేడాది అర్హత గల వారు 97,619 మంది ఉండగా.. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.97.61 కోట్లును మత్స్యకారులకు భరోసాగా అందజేశారు.
అర్హుల జాబితా తయారీ
వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు జీవన భృతి అందించేందుకు అర్హులైన వారి జాబితాను సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వేట నిషేధ భృతి పొందాలంటే తప్పనిసరిగా బోటు రిజిస్ట్రేషన్ చేసుకుని.. మత్స్యకార సంఘంలో సభ్యుడై ఉండాలి. 18 నుంచి 60 ఏళ్లు మధ్య వయసు ఉండాలి. సోనా బోట్లకు 8 మంది, మోటార్ బోట్లకు ఆరుగురు, ఇంజిన్ తెప్పలకు ముగ్గురు మాత్రమే అర్హులు. ఇక జాబితాలో పేరులేని మత్స్యకారులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకంతో వలంటీర్ ద్వారా మత్స్యశాఖ సిబ్బందిని సంప్రదించాలి.
సంప్రదాయ పడవలకు అవకాశం
సంప్రదాయక పడవలు కలిగిన మత్స్యకారులు సముద్రం తీరానికి 8 కిలోమీటర్లలోపు, అనుమతించిన సైజు వలలతో చేపలు పట్టుకోవచ్చు. ఇందుకోసమని మత్స్యకారులు తగిన ఆధారాలతో అధికారులు నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. నిషేధం పక్కాగా అమలయ్యేలా తీర ప్రాంత పోలీసులు (మెరైన్), తీర ప్రాంత గస్తీ సిబ్బంది (కోస్ట్‌గార్డ్) చర్యలు తీసుకుంటున్నారు.
నిషేధం పక్కాగా అమలు
ఈ నెల 15 నుంచి సముద్రంపై మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేట నిషేధం పక్కాగా అమలుచేసేలా దృష్టిసారించాం. నిషేధాజ్ఞలు ఉల్లంఘించే బోటు యజమానులపై చర్యలు తీసుకుంటాం. నిషేధ కాలపు భృతికి అర్హులైన వారందరికీ మంజూరు చేసేలా శ్రద్ధ తీసుకుంటున్నాం.
– లాల్ మహమ్మద్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment