
ప్రత్తిపాడు/పిడుగురాళ్లరూరల్(గురజాల)/చినగంజాం: ఈత సరదా వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ప్రాణం తీయగా.. చేపల వేట సరదా మరో ముగ్గురిని బలిగొంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన దుర్ఘటనల వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామం చిన్న మాలపల్లెకు చెందిన బొల్లా వర్థన్‌బాబు (18), నేలపాటి కోటేశ్వరరావు (15), బత్తుల సుధాకర్ (15)తో పాటు మరో ముగ్గురు యువకులు శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. కుంటలోకి దూకిన ముగ్గురు ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో మిగిలిన ముగ్గురు యువకులూ భయాందోళనకు గురై వెంటనే గ్రామస్తులకు సమాచారం అందజేశారు. ఎస్‌ఐ కృష్ణారెడ్డి కుంట వద్దకు చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. అలాగే పిడుగురాళ్ల పట్టణంలోని పీడబ్ల్యూడీ కాలనీకి చెందిన మస్తాన్ కుమారుడు యాసిన్ (12) ఈత కొడుతున్న సమయంలో నీటి గుంతలో ఇరుక్కుపోయి మృత్యువాత పడ్డాడు.
ఇదిలా ఉండగా.. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన నలుగురు యువకులు శుక్రవారం సాయంత్రం రొంపేరు కాలువలో చేపల వేటకు వెళ్లగా.. వారిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మూలగాని వారిపాలెం రైల్వే స్టేషన్ సెంటర్‌కు చెందిన కోకి కాశిరెడ్డి (24), కుక్కలవారిపాలేనికి చెందిన కొణసం దుర్గారెడ్డి(27), వేటపాలెం మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన నంగు రమణారెడ్డి (23) కాలువలో దిగి కూరుకుపోయి మృత్యువాత పడగా.. మూలగాని వారిపాలెం గ్రామానికి చెందిన మూలగాని గోపిరెడ్డి ఒడ్డునే ఉండి ప్రాణాలతో బయటపడ్డాడు.
(చదవండి: ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ)
Comments
Please login to add a commentAdd a comment