మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : నీరు–చెట్టు పథకం కింద రెల్లిగెడ్డ ఆధునికీకరణ పనుల పేరిట కోట్లాది రూపాయలు తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకి చేరిపోయాయని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొందూరు మండలం లైదాం నుంచి సింగూరు వరకు 9 కిలోమీటర్ల మేర ఆరు వేల ఎకరాల ఆయకట్టు ఉన్న రెల్లి గెడ్డ ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ.20కోట్లు నిధులు కేటాయించిందని చెప్పారు. అందుల్లో రూ.7.80 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో ముక్కలు ముక్కలు చేసి నాసిరకం పనులు చేపట్టి సొమ్ముచేసుకున్నారని ఆరోపించారు.
తాడివలస, గోరింట, మొదలవలస వద్ద సైడ్‌వాల్స్ పనులు చేయకుండానే రెల్లిమెట్ట జన్మభూమి కమిటీ సభ్యులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. టెండర్లకు పిలవకుండా అన్ని పనులు నామినేషన్ పద్ధతిలోనే చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, కలెక్టర్, ఏసీబీ, జలవనరులశాఖ ఈఎన్‌సీకి అక్రమాలు తెలియజేసినా కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. టీడీపీ కార్యకర్తలు చెప్పిన పనులు చేయకుంటే విప్ నేరుగా అధికారులను ఇంటికి పిలిపించి తిట్టడం విప్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు.
తక్షణమే రెల్లిగెడ్డ అక్రమాలపై సీఐడీ, విజిలెన్స్ విచారణ జరిపించి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని కోరారు. ఆమదాలవలస మండలం చిట్టివలస సంగమేశ్వర దేవాలయం కొండ వద్ద విప్ అండదండలతో అక్రమ బ్లాస్టింగ్ జరుగుతోందని ఆరోపించారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లుగా, మధ్యాహ్న భోజన నిర్వాహకులుగా, రేషన్ డీలర్లగా పనిచేస్తున్న వైఎస్సార్ సీపీ వర్గీయులను అన్యాయంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఆమదాలవలసలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు స్థలం ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌ను కోరామన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆమదాలవలసకు జగన్ వచ్చినప్పటికల్లా విగ్రహం ఏర్పాటుచేసి ప్రారంభించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
హరికృష్ణ మృతికి సంతాపం..
దివంగత ఎన్‌టీ రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ మృతి తీరని లోటని తమ్మినేని సీతారాం అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్‌సీ నాయుడు, బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, గుమ్మాడి రాంబాబు, బొణిగి రమణ, పప్పల రమేష్, మెట్ట శ్యామలరావు, తమ్మినేని మురళికృష్ణ, కూన రాజు, బాడాన కృష్ణారావు, శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment