మీరు ఒంటరిగా వెళుతున్నారా.. మీ ఒంటిపై బంగారు నగలు ఉన్నాయా.. నిర్మానుష్యప్రదేశంలో నడుస్తున్నారా.. అయితే.. జాగ్రత్త.. ఓ క్షణం మీ పరిసరాల్ని నిశితంగా పరిశీలించండి.. మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చే వ్యక్తులు లేదా బైకుల విషయంలో అప్రమత్తంగా ఉండండి.
లేదంటే మీ నగలను క్షణాల్లో లాక్కెళ్తారు. జిల్లాలో పెరుగుతున్న గొలుసు దొంగతనాల నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కడప అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రతిచోటా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో గొలుసు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా అధిక శాతం దొంగతనాలు జరుగుతున్నాయి. మోటార్‌బైక్‌పై వేగంగా రావడం.. ఏదో ధ్యాసలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలో నుంచి ఒక్కసారిగా గొలుసు లాక్కెళ్లడం మామూలై పోయింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనమైతే దాదాపు ఉండటం లేదు.
వ్యసనాలకు బానిసలై..
జిల్లాలో ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో గొలుసు దొంగలు మహిళలను హడలెత్తిస్తున్నారు. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దొంగతనాలకు పాల్పడిన వారిని విచారిస్తే వారిలో ఎక్కువగా వ్యసనాలకు బానిసలైన వారే ఉన్నట్లు తెలుస్తోంది.
కొందరు ఉన్నత చదువులు చదువుతున్న యువత విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి దొంగల అవతారమెత్తుతున్నట్లు స్పష్టమవుతోంది. మరికొందరు అవసరాలకు డబ్బులు లేక దొంగతనాలకు తెగబడుతున్న సంఘటనలు కూడా పోలీసుల దృష్టికి వచ్చాయి. వీరిలో కొందరు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉంటున్న వారి పిల్లలు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చోరీలు ఇలా..:
దొంగలు తొలుత నిర్మానుష్య ప్రదేశాలను ఎంచుకుంటారు. ఆ ప్రదేశాలలో బంగారు ఆభరణాలు ధరించి వెళుతున్న ఒంటరి మహిళలను గుర్తించి రెక్కీ నిర్వహిస్తారు. తర్వాత తమ ముఖాలు కనిపించకుండా కర్చీఫ్‌లు కట్టుకుని మోటార్‌బైక్‌పై వస్తారు. వాహనం నడుపుతున్న యువకుడు అతివేగంగా మహిళ పక్కనుంచి దూసుకెళ్తాడు. వెనుక కూర్చున్న మరొక వ్యక్తి మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేస్తాడు. ఈ క్రమంలో తమ మోటారు సైకిల్‌కు ఎలాంటి నెంబరు లేకుండా కూడా కొన్ని సంఘటనల్లో జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
అంతా అంతర్‌జిల్లా దొంగలే:
జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడిన దొంగలను పోలీసులు విచారిస్తే అంతా ఇతర జిల్లాలకు చెందినవారే అని తేలింది. దీంతో అందరి వివరాలను సేకరించి, ఫొటోలు, చిరునామాలతో సహా రికార్డు చేశారు.
రికవరీ ఇలా..
గత ఏడాది నవంబర్‌లో చిన్నచౌకుపరిధిలో ఇద్దరిని అరెస్టు చేసి 7 బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు.
సీసీఎస్ పోలీసులు ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని 12 గొలుసులు రికవరీ చేశారు.
ఈ నెలలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని 7లక్షల రూపాయల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
బ్లూకోట్ వ్యవస్థ మెరుగు పడాలి
జిల్లాలో బ్లూకోట్ వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సిబ్బంది ప్రతి స్టేషన్ పరిధిలో అవసరమైన మేరకు ఉండటం వల్ల ఈ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. విశాలమైన, నిర్మానుష్యమైన, వెడల్పాటి రోడ్ల మీదుగా వెళ్లే ఒంటరి మహిళలనే టార్గెట్‌గా చేసుకోవడాన్ని పరిగణలోకి తీసుకుని కడప, ప్రొద్దుటూరు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు దొంగలపై నిఘా పెంచాలి.
మహిళలే టార్గెట్
Published Mon, Jan 27 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement