పార్టీ నేతలపై పదేపదే అక్రమ కేసులు
పాత కేసులను తిరగదోడి బెదిరింపులు
చెవిరెడ్డి అరెస్టు తాజా ఉదంతం
పెరుగుతున్న అధికార పార్టీ దౌర్జన్యాలు
భగ్గుమంటోన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
తిరుపతి: జిల్లాలో అధికార పార్టీ దౌర్జన్యం హద్దులు దాటుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోంది. పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని వినియోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులపై ఒకవైపు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే, మరో పక్క అక్రమ కేసులతో బెదిరించి నాయకులను తమవైపు తిప్పుకునే చర్యలకు పాల్పడుతోంది. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మండలస్థాయి నాయకులపై గత కొంత కాలంగా నమోదవుతోన్న అక్రమ పోలీస్ కేసులు, వాటి తాలూకు అరెస్ట్‌లు అధికార పార్టీ నేతల కక్ష సాధింపు ధోరణులను తేటతెల్లం చేస్తున్నాయి.
జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. 14 అసెంబ్లీ స్థానాలకు గాను మెజార్టీ స్థానాలను ఈ పార్టీనే కైవసం చేసుకుంది. అధికార పార్టీ దీన్ని జీర్ణించుకోలేకపోయింది. సీఎం సొంత జిల్లాలో ప్రతిపక్ష పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కడం అవమానంగా భావించిన పార్టీ పెద్దలు వ్యూహాత్మక రాజకీయానికి తెరలేపారు. మంత్రి పదవుల ఆశ చూపి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు వల వేయడం ప్రారంభించారు. అదేవిధంగా జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి నాయకులపైనా పార్టీ మారాలను ఒత్తిడి తెచ్చారు. వైఎస్ కుటుంబంపై పూర్తి విశ్వాసమున్న పార్టీ నాయకులు ఎవ్వరూ (పలమనేరు ఎమ్మెల్యే మినహా) టీడీపీ వైపు మొగ్గు చూపలేదు. దీంతో అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు సిద్ధమైంది. నయానో, భయానో టీడీపీ వైపు తిప్పుకునేందుకు కుయుక్తులు పన్నింది.
ఇందులో భాగంగా నాయకులపై అక్రమ కేసులకు తెరతీసింది. అధికార పార్టీలోని పెద్దలు రంగంలోకి దిగారు. అనుకూలంగా మెలిగే జిల్లా, డివిజన్‌స్థాయి అధికారులను నియమించుకున్నారు. ప్రధానంగా పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని అక్రమ కేసుల బనాయింపుల పర్వానికి తెరలేపారు. ఇప్పటి వరకూ ఎంపీ మిధున్‌రెడ్డి, నగరి, చంద్రగిరి ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలపై అక్రమ కేసులు పెట్టించారు. తిరుపతి విమానాశ్రయంలో ఉద్యోగితో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణతో 5 నెలల కిందట ఎంపీ మిధున్‌రెడ్డిపై కేసు నమోదు చేయించారు. నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాపై రెండుసార్లు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. చంద్రగిరి ఎమ్మెల్యేపై ఇప్పటికి అరడజనుకు పైగా కేసులు బనాయింపజేశారు. నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతిపై ఇటీవల టీడీపీ నాయకులు ప్రత్యక్షంగా దాడులకు తెగబడ్డారు. ఏడాది కిందట ఆమె భర్తపైనా దాడులు జరిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లో వైఎస్సార్‌సీపీ మండల నేతలపైనా, గంగాధరనెల్లూరు శ్రీరంగరాజపురం మండలంలోనూ గతంలో వైఎస్సార్‌సీపీ నేతలపై అధికార పార్టీ దౌర్జన్యాలు జరిగాయి.
అక్రమ కేసులు కూడా బనాయించారు. ఇటీవల పాకాల, శ్రీకాళహస్తి మండలాల్లోనూ వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు జరిగాయి. పాత కేసులను తిరగదోడి ఇబ్బందులకు గురిచేయడం ద్వారా కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోంది. ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని పక్కనపెట్టి యథేచ్ఛగా అక్రమ కేసులకు పూనుకుంటోంది. వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేసులకు భయపడే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నాయి.