(వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: రక్తం రుచి మరిగిన ఆ మార్గం అర్ధరాత్రి దాహం తీర్చుకుంది. కడప-రాజంపేట జాతీయ రహదారిలోని సిద్దవటం మండలం కనుమలోపల్లె సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ముగ్గురు మృత్యుఒడి చేరారు. కర్నూలు జిల్లా డోన్ మండలం గోసనపల్లెకు చెందిన రైతు రామాంజనేయులు తాను పండించిన చిక్కుడు కాయలను చెన్నై మార్కెట్‌లో అమ్మాలనుకున్నాడు.
స్వగ్రామానికి చెందిన మినీ లారీ డ్రైవర్ శ్రీరాములు(30)తో మాట్లాడుకున్నారు. లోడ్ అయ్యాక శనివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరారు. అదే లారీలో ఓనర్ వెల్దుర్తి మండలం శ్రీరంగాపురానికి చెందిన ముద్దయ్యస్వామి(24) కూడా ఎక్కారు. రైతు, ఓనరు ఇద్దరూ నిద్రపోతుండగా, డ్రైవర్ లారీని నడుపుతున్నాడు. మార్గమధ్యంలో లారీ సిద్దవటం మండలం కనుమలోపల్లె సమీపంలోని శనీశ్వరస్వామి ఆలయ సమీపంలోని ఓ మలుపులోకి రాగానే ఎదురుగా మెరుపు వేగంతో వచ్చిన పది చక్రాల లారీ ఢీకొంది.
సంఘటనలో మినీ లారీ నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ క్యాబిన్‌లో చిక్కుకుపోయి, అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఢీకొట్టిన లారీలోని డ్రైవర్ మురళీ సీట్లోనే చిక్కుకుపోయాడు. ఒంటిమిట్ట సీఐ రెడ్డెప్ప, సిద్దవటం ఎస్‌ఐ గురునాథ్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద లారీలో చిక్కుకున్న డ్రైవర్ మురళీని బయటకు లాగి చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. మినీ లారీలో చిక్కుకుపోయిన ముగ్గురి మృతదేహాలను అతికష్టం మీద వెలికితీశారు. పోస్టుమార్టం కోసం వాటిని రిమ్స్ మార్చురీకి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్‌ఐ తెలిపారు.
నడి రాత్రి.. మృత్యు ఒడిలోకి!
Published Mon, Oct 21 2013 3:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
Advertisement