ప్రత్యేక హోదాతోనే పన్ను రాయితీలు : జేపీ
గుంటూరు:
రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాలను కలుపుకుని కేంద్రంతో చర్చలు జరపాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్‌నారాయణ సూచించారు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి శనివారం విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రత్యేక హోదాలోనే ప్రత్యేక ప్యాకేజీ ఉందనే విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో రెవెన్యూ లోటును పూరించాలని, విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పన్ను రాయితీలు ఇవ్వాలనే విషయాలను తాను ప్రస్తావించినట్లు చెప్పారు.
14వ ఆర్ధిక సంఘం ద్వారా రెవెన్యూ లోటు, మౌలిక వసతులు కొంతమేరకు సమకూరుతున్నాయంటూ పన్ను రాయితీలు మాత్రం ప్రత్యేక హోదాతోనే వస్తాయని జేపీ స్పష్టం చేశారు. పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నందున ఏపీకి ‘హోదా’ ఇచ్చేందుకు కేంద్రం సంశయిస్తున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలను కలుపుకుని కేంద్రాన్ని కోరాలన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, నిరసనలు తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే వారిని నిలువరించకూడదని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంటు సాక్షిగా నాటి పాలకపక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీలు తాము ఇచ్చిన హామీలపై వెనక్కు తగ్గడం తగదన్నారు. ప్రత్యేక హోదా గురించి చట్టంలో పెట్టినా, పెట్టకపోయినా పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ప్రజలు ముఖ్యంగా యువత గొంతు విప్పాలని, శాంతియుతంగా ఉద్యమాలు చేస్తే మరలా సమస్య తెరమీదకు వచ్చి దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారని జేపీ చెప్పారు. కాగా, లోక్‌సత్తా పార్టీ మూడు రాజ్యాంగ సవరణలు, ఆరు చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు దోహదపడిందన్నారు.