‘దేశం’ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయండి
శ్రీకాకుళం క్రైం:తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీ వారిపై చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, దువ్వాడ శ్రీనివాస్‌లు జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీని కోరారు. ఈ మేరకు ఆయన్ని తన కార్యాలయంలో సోమవారం కలసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. వారికి అండగా కొంతమంది పోలీసులు కూడా నిలుస్తూ అమాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు. బూర్జ మండల పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యకాండపై పోలీసులు ఇంత వరకు చర్య తీసుకోకపోవటం విచారకరమన్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు, నిండు గర్భిణి కొబగాన సంతోషిపై టీడీపీ ఎంపీపీ అభ్యర్థి పెంట నాగమణి పోలీసుల సమక్షంలో చేసిన దౌర్జన్యం అందరికీ తెలిసిందేనన్నారు.
అయితే ఇంత వరకు నాగమణిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం సరికాదన్నారు. కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం జగన్నాథస్వామి రథయాత్రలో ఇరువర్గాల మధ్య జరిగిన వివాదంపై పోలీసులు నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేసినప్పటికీ వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన వారిని మాత్రమే అరెస్టు చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. అక్కడి సీఐ టీడీపీ వారికి కొమ్ము కాస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, స్థానిక మంత్రి అండదండలతో చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇరువర్గాల వారిని అరెస్టు చేసి విచారణ చేపట్టాలని కోరారు. సరుబుజ్జిలి మండలం పెద్ద వెంకటాపురంలో కోర్టులో ఉన్న భూ వివాదంలో ఆమదాలవలస సీఐ కలగజేసుకుని టీడీపీ వర్గీయులకు అండగా ఉంటున్నారన్నారు.